‘ఎములాడ’ గులాబీలో అసమ్మతి. చెన్నమనేని వర్సెస్ ఉమ

విశ్వనాథ్, కరీంనగర్;

వేములవాడ అధికార టీఆర్ఎస్ పార్టీ టికెట్ల పంచాయితీ తారాస్థాయికి చేరుకున్నది. వేములవాడ టీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు బరిలో ఉన్నారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తుల ఉమ వేములవాడ టికెట్టు కోరుతున్నారు. వేములవాడ టీఆర్ఎస్ టిక్కెట్ రమేష్ బాబుకే ఉంటుందా లేక చివరి నిమిషాల్లో తుల ఉమ కు బి ఫామ్ లభిస్తుందా? అన్నది ఉత్కంఠ రేపుతోంది. రమేష్ బాబు పేరు ప్రకటించినందున ఉమను బుజ్జగించవచ్చునని తెలుస్తున్నది. ఆమె మెత్త బడతారా, లేక రెబల్ అభ్యర్థిగా రంగంలోకి దిగనున్నారా..? అనే ప్రశ్నలు వస్తున్నవి. వేములవాడ అధికార పార్టీ రాజకీయ రంగస్థలంలో రణరంగాన్ని తలపించే స్థాయిలో నిరసన సెగలు ఊపందుకుంటున్నాయి. రమేష్ బాబుకు ప్రస్తుతం మనశ్శాంతి కరువయినట్టు తెలుస్తున్నది. తులా ఉమా అసమ్మతి కార్యకలాపాలను ఉధృతం చేశారు. రమేష్ బాబు ‘ద్వంద్వ పౌరసత్వం’పై కాంగ్రెస్ నాయకుడు ఆది శ్రీనివాస్ సుప్రీం కోర్టు వరకు వెళ్లి పోరాడుతున్న సంగతి తెలిసిందే. రమేష్ బాబు నియోజకవర్గంలో ఎక్కువ సమయాన్ని కేటాయించరని, అభివృద్ధి కుంటుపడిందని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తుల ఉమ వర్గీయుల ఆరోపణ. రమేష్ బాబు కు టిక్కెట్ మార్చి ఉమకే టిక్కెట్ కేటాయించాలని వారు డిమాండు చేస్తున్నారు. వేములవాడలో ఈనెలాఖరులో భారీ ఎన్నికల ప్రచార సభకు రంగం సిద్ధమైంది. కేసీఆర్ పాల్గొనే సభ కోసం చెన్నమనేని స్థల పరిశీలన చేశారు. ఈ సమయంలోనే జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ వర్గీయులు మరింత స్వరం పెంచి నిరసనలకు దిగుతున్నారు. దీంతో రమేష్ బాబు హైదరాబాద్ లో మూడురోజుల పాటు తిష్ఠ వేశారు. తన అభ్యర్థిత్వాన్ని మార్చవద్దని మంత్రి కేటీఆర్ కు చెన్నమనేని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. తుల ఉమ వర్గీయులు చందుర్తి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. చందుర్తి నుంచి వేములవాడ ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించాలని ఆమె మద్దతుదారులు ప్రణాళిక రచిస్తున్నారు. తమ వాణిని, నినాదాన్ని గట్టిగా టిఆర్ఎస్ అధిష్టానానికి వినిపించేందుకు రంగం సిద్ధమైంది. తుల ఉమతిరుగుబావుటాఎగురవేస్తారన్న చర్చ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది. తుల ఉమ కు కేటీఆర్ ఫోన్ చేసి బుజ్జగించే ప్రయత్నాలు చేసినట్టు సమాచారం అందింది. కేటీఆర్ ఫోన్ కాల్ తో భారీ ర్యాలీని వాయిదా వేసుకున్నట్టు సమాచారం. రమేష్ బాబు పై అసమ్మతి గళాన్ని వినిపిస్తున్న వారంతా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ను కలిసి ‘సేవ్’ స్వచ్ఛంద సంస్థ పేరిట రమేష్ బాబు అవినీతికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. తుల ఉమకు వేములవాడ అసెంబ్లీ టికెట్టు విషయమై కేసీఆర్ గతంలో హామీ ఇచ్చినట్టు ఆమె మద్దత్దారుల కథనం. ఇప్పటికే అభ్యర్థిత్వాన్ని ప్రకటించాక రమేష్ బాబుకు టికెట్ నిరాకరిస్తే ఎదురయ్యే పరిస్థితులపై కూడా కేసీఆర్ యోచిస్తునట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కు విధేయురాలిగా ఉన్న తుల ఉమ క్షేత్రస్థాయిలో పలువురు కార్యకర్తలు, ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ తో రెబల్ అభ్యర్థిగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారా? కేసీఆర్ నిర్ణయాన్ని ధిక్కరించగలరా? అనే చర్చకూడా జరుగుతోంది.