ఎమ్మెల్యేలు కొండా, వినయ్, అరూరి లకు కడియం గ్రీన్ ఛాలెంజ్.

వరంగల్ :
నీరే ప్రాణాధారం.. ఆ నీటికి మూలాధారం మొక్క. భవితరాలకి మంచి భవిష్యత్ అందించాలంటే పచ్చదనాన్ని పరిరక్షించాలి, పెంపొందించాలి. హరిత తెలంగాణను ఆవిష్కరించాలి. ఇందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం ను ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు అందరిని హరితహారంలో భాగస్వామ్యం చేసేందుకు మూడు మొక్కలు నాటండి మరో ముగ్గురిని మూడు మొక్కలు నాటేందుకు పిలవండి అనే నినాదంతో గ్రీన్ ఛాలెంజ్ ను మొదలుపెట్టారు. ఈ గ్రీన్ ఛాలెంజ్లో ఇపుడు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూడా చేరారు. ఆదివారం ఉదయం ఆర్ట్స్ కాలేజీ మైదానంలో వాకింగ్ లో భాగంగా అక్కడికి వెళ్లి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తన కూతురు డాక్టర్ కడియం కావ్యతో కలిసి మూడు మొక్కలు నాటి, స్థానిక ఎమ్మెల్యేలు కొండా సురేఖ, దాస్యం వినయ్ భాస్కర్, అరూరి రమేష్ లకు తలా మూడు మొక్కలు నాటేందుకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఈ మొక్కలు నాటిన ఆనందాన్ని సెల్ఫీతో షేర్ చేసుకున్నారు. మూడు మొక్కల తన ఈ గ్రీన్ ఛాలెంజ్ ను ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు  స్వీకరించి మూడు, మూడు మొక్కలు నాటి వరంగల్ వాసులందరికి ఈ మొక్కలు నాటే గ్రీన్ ఛాలెంజ్ ద్వారా స్ఫూర్తినివ్వాలన్నారు.పచ్చని చెట్లు, గొలుసు చెరువులతో కలకళలాడిన కాకతీయ నగరానికి హరితహారం, గ్రీన్ ఛాలెంజ్, మిషన్ కాకతీయల ద్వారా పునః వైభవం తీసుకురావాలని, భావి తరాలకు పెరిగే కాలుష్యం నుంచి భద్రత కల్పించి పచ్చదనాన్ని బహుమతిగా అందించాలని పిలుపునిచ్చారు.