ఎమ్మెల్యే రాజయ్యతో విభేదాలు లేవు. – కడియం శ్రీహరి.

వరంగల్:
“స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం వల్లే కడియం శ్రీహరి నేడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ నియోజక వర్గ ప్రజల రుణాన్ని ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేను ’’ అని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఉద్వేగంగా ప్రసంగించారు. స్టేషన్ ఘన్పూర్ నియోజక వర్గంలోని తాటికొండ గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన నేడు ప్రసంగించారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యకు, నాకు ఎలాంటి అభిప్రాయ బేధాలు లేవని, కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. ఏ అవకాశమైన పార్టీ ఇస్తుందని, ముఖ్యమంత్రి కేసిఆర్ ఇస్తారని దాని ప్రకారమే పనిచేస్తామని చెప్పారు.
స్టేషన్ ఘన్పూర్ ప్రజల నాయకుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఇక్కడి ప్రజలు తలఎత్తుకునే విధంగానే ఇప్పటి వరకు తాను వ్యవహరించానని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఈ నియోజక వర్గ ప్రజలు తలదించుకునే తప్పు పని కడయం శ్రీహరి ఇప్పటి వరకు చేయలేదని, ఇక కూడా చేయడని హామీ ఇచ్చారు. తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో ఈ నియోజకవర్గం అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు. ఆనాడు భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా ఈ నియోజక వర్గానికి గోదావరి నీటిని తీసుకొచ్చే దేవాదులను ప్రారంభించానన్నారు. అప్పుడు దీనిని ఎన్నికల కోసం చేస్తున్నారని చాలామంది విమర్శించారు, కానీ నేడు దానివల్లే స్టేషన్ ఘన్పూర్ లో సాగునీరు అందుతోందన్నారు. నేడు విద్యాశాఖ మంత్రి గా లింగంపల్లి రిజర్వాయర్ ను ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకొచ్చి లింగంపల్లి ప్రాజెక్టు పట్టుకొచ్చానన్నారు. రాష్ట్రంలోని పూర్వ పది జిల్లాల్లో జిల్లాకొక పెద్ద రిజర్వాయర్ ఉందని, వ్యవసాయం మీద ఆధారపడిన వరంగల్ జిల్లాకు పెద్ద రిజర్వాయర్ లేదని, లింగంపల్లి వద్ద రిజర్వాయర్ కడితే బాగుంటుందని సిఎం కేసిఆర్ దృష్టికి తీసుకొచ్చిన వెంటనే అంగీకరించారన్నారు. 2700 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పరిపాలన అనుమతులు వచ్చాయన్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభం అవుతాయన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం అయితే పూర్వ వరంగల్ లోని అన్ని నియోజక వర్గాలకు రెండు పంటలకు నీరు అందుతుందన్నారు.తాటికొండ, మీదికొండ, కొత్తపల్లి గ్రామాలలో 4,5వేల ఎకరాలకు నీరందించి సస్యశ్యామలం చేసే కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. అదేవిధంగా స్టేషన్ ఘన్పూర్ నుంచి నర్మెట వరకు డబుల్ రోడ్డు చేయిస్తానని చెప్పారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. నేడు తెలంగాణలో 40వేల కోట్ల రూపాయలతో 40 సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయన్నారు. ఇన్ని సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదన్నారు. పేదింట్లో ఆడపిల్ల పెళ్లి ఖర్చు కింద 1,00,116 రూపాయలను ఇస్తున్నారని చెప్పారు. అదేవిధంగా పేదింటి మహిళ గర్భం దాల్చి కూలికి వెళ్లకూడదనే ఉద్దేశ్యంతో ప్రసవానికి మూడు నెలల ముందు, ప్రసవం తర్వాత మూడు నెలల పాటు మొత్తంగా ఆరు నెలలకు నెలకు రెండు వేల రూపాయల చొప్పున 12వేల రూపాయలను ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. ఆడపిల్ల పుడితే మరో వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తుందన్నారు. ఇలాంటి మంచి ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం ఉండాలని కోరారు.ఈ సమావేశంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జడ్పీ చైర్ పర్సన్ గద్దల పద్మ, స్థానిక జడ్పీటీసీ స్వామినాయక్, సర్పంచ్ సంధ్యారాణి, ఇతర గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.