ఎయిరిండియాకు బ్యాంకు నోటీసులు.

న్యూఢిల్లీ:
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు కష్టాల పరంపర కొనసాగుతోంది. భారీ నష్టాలు, కొండలా పేరుకు పోతున్న రుణభారం కింద నలిగిపోతున్న మహారాజాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కొద్ది వారాలుగా మూడు బ్యాంకులు, విమానాలు అద్దెకిచ్చిన రెండు కంపెనీలు ఎయిరిండియాకు డిఫాల్టర్ నోటీసులు ఇచ్చాయి. బిజినెస్ స్టాండర్డ్ కథనం ప్రకారం శాన్ ఫ్రాన్సిస్కోకి చెందిన వెల్స్ ఫార్గో ట్రస్ట్ సర్వీసెస్ కంపెనీ, యుఏఈకి చెందిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ దుబాయ్ ఏరోస్పేస్ ఎంటర్ ప్రైజెస్ (డీఏఈ) తమకు బకాయిపడ్డ అద్దె మొత్తం చెల్లించాలని ఎయిరిండియాకు లేఖలు రాశాయి.అయితే ఈ విషయంపై మాట్లాడేందుకు డీఏఈ నిరాకరించగా వెల్స్ ఫార్గో అందుబాటులోకి రాలేదు. ఇక ఎయిరిండియా కూడా దీనిపై వివరణ ఇవ్వలేదు. ఇవి కాకుండా మహారాజాకు రుణాలిచ్చిన 22 బ్యాంకుల కన్సార్షియంలోని మూడు బ్యాంకులు ఎయిరిండియాకు లేఖలు రాశాయి. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, దేనా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎయిరిండియాకు రాసిన లేఖలో తాము ఇచ్చిన రుణం నిరర్థక ఆస్తిగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి. బ్యాంకుల ప్రతినిధులు సైతం ఈ వ్యవహారంపై నోరు విప్పడం లేదు. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఈ లేఖపై మాట్లాడేందుకు నిరాకరించగా బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేనా బ్యాంక్ వ్యాఖ్యానించడానికి ఇష్టపడటం లేదు.గత నెల కేంద్ర ప్రభుత్వం ఎయిరిండియాలో 76% వాటాను ప్రైవేటు సంస్థలకు అమ్మబోయింది. కానీ కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో ఆ ఆలోచన విరమించుకోవాల్సి వచ్చింది. ఎయిరిండియాను ఒడ్డున పడేసేందుకు ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తూనే సంస్థకు ఆర్థిక సాయం అందిస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. ఆగస్ట్ లోపు ఎయిరిండియాకు ప్రభుత్వం ఆర్థిక సాయం వస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అప్పటి వరకు ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకోవద్దని తమకు నోటీసులు ఇచ్చిన సంస్థలకు ఎయిరిండియా సూచించినట్టు తెలిసింది.