ఎరువుల దుకాణాలు, గోదాములపై తూనికల కొలతల శాఖ ఆకస్మిక తనిఖీలు.

89 కేసులు నమోదు, రూ. 6.65 కోట్ల ఎరువులు సీజ్.
హైదరాబాద్:
రాష్ట్రంలో విత్తనాలు వేయడానికి సిద్ధంగా ఉన్న రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని ఎరువులు, పురుగు మందులు, విత్తనాల్లో అక్రమాలకు పాల్పడుతూ తూకాలలో మోసం చేస్తున్న వ్యాపార సంస్థలపై తూనికల కొలతల శాఖ ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే విత్తనాల కంపెనీల మోసాలపై గతవారంలో విస్తృత తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేసిన తూనికల కొలతల శాఖ తాజాగా ఎరువుల కంపెనీల మోసాలపై రంగంలోకి దిగింది.

ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో అన్నదాతలకు సరైన తూకంతో ఎరువులు, విత్తనాలు అందించాలన్న ఉద్ధేశంతో రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులుగా ఎరువుల దూకాణాలు, గోదాములపై ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. తూనికల కొలతల శాఖ నిబంధనలకు విరుద్ధంగా ఎరువుల బస్తాల తూకంలో తేడాలు, విత్తన ప్యాకెట్ల పరిమాణంలో హెచ్చుతగ్గులు ఉండటంతో కేసులు నమోదు చేసింది.
ఖమ్మంలో 2 కేసులు, రూ. 1.30 కోట్లు, జగిత్యాల – 12 కేసులు, రూ. 36 వేలు, నాగర్‌కర్నూల్‌ – 10 కేసులు, రూ. 1.30 లక్షలు, సిద్ధిపేట – 4 కేసులు, రూ. 65 వేలు, సంగారెడ్డి – 22 కేసులు, రూ. 3.19 లక్షలు, రంగారెడ్డి – 14 కేసులు, రూ. 4 కోట్లు, కామారెడ్డి – 7 కేసులు, రూ. 97 వేలు, నిజామాబాద్‌ – 3 కేసులు, రూ. ఒక కోటి, నల్గొండ – 4 కేసులు, రూ. 4.66 లక్షలు, మంచిర్యాల – 9 కేసులు, రూ. 60 వేలు, వరంగల్‌ రూరల్‌ – 2 కేసులు, రూ. 22.7 లక్షలు, మొత్తం 89 కేసులు నమోదు చేసి, 6 కోట్ల, 65 లక్షల, 14 వేల, 492 రూపాయలు విలువ చేసే ఎరువులను సీజ్‌ చేశారు. ఖమ్మంలో అవంతి వేర్‌ హౌస్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో నాగార్జున ఫర్టిలైజర్‌ లిమిటెడ్‌కు చెందిన 36 వేల ఎరువుల బస్తాలను, కోరమండల్‌ లిమిటెడ్‌కు చెందిన 28 వేల ఎరువుల బస్తాలను సీజ్‌ చేశారు. అలాగే, జగిత్యాలలో లక్ష్మీ మణికంఠ సీడ్స్‌లో క్రిబ్బో ఫర్టిలైజర్స్‌ ఎరువులు, నాగర్‌కర్నూల్‌లో మన గ్రోమర్‌లో కోరమండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌, నాగార్జున ఫర్టిలైజర్స్‌లో నాగార్జున ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌, నల్గొండలో శ్రీ మురళీకృష్ణ ఫర్టిలైజర్స్‌ ఎక్సెల్‌ క్రాప్‌ కేర్‌ లిమిటెడ్‌, సంగారెడ్డిలో శ్రీ కార్తిక్‌ సంగమేశ్వర ఆగ్రో సీడ్స్‌లో గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ లిమిటెడ్‌, మన గ్రోమర్‌ సెంటర్‌లో భవాని బయో ఆర్గానిక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఎం చంద్రయ్య ఫర్టిలైజర్‌ అండ్‌ సీడ్స్‌లో నాగార్జున ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌, రంగారెడ్డిలో కర్నీ లాజిస్టిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో ఇండియన్‌ పొటాష్‌ లిమిటెడ్‌, గుజరాత్‌ స్టేట్‌ ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌, గ్రీన్‌స్టార్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌, రఫీక్‌ ట్రాన్సపోర్ట్‌ కంపెనీలో గ్రీన్‌స్టార్‌ ఫర్టీలైజర్స్‌, ప్రదీప్‌ ఫాస్ట్‌ఫేట్‌ లిమిటెడ్‌ వంటి కంపెనీలకు చెందిన ఎరువులను పెద్ద ఎత్తున సీజ్‌ చేయడం జరిగింది.
రైతులకు విక్రయించే విత్తనాలు, క్రిమిసంహారక మందులు, ఎరువుల వంటి వాటిలో తూకంలో మోసాలకు పాల్పడుతుండడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, చట్టపరమైన చర్యలు చేపడతామని తూనికల కొలతల శాఖ కంట్రోలర్‌ శ్రీ అకున్‌ సబర్వాల్‌ అన్నారు.ఇప్పటికే విత్తనల కంపెనీల మోసాలపై గతవారంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన తూనికల కొలతల శాఖ 154 కేసులు నమోదు చేసి రూ. 2.35 కోట్ల విలువ చేసే విత్తనాలను సీజ్‌ చేశాం. గడిచిన రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వ్యాపార సంస్థలపై 89 కేసులు నమోదు చేసి, రూ. 6.65 కోట్ల విలువ చేసే ఎరువులను సీజ్‌ చేశాం. ఇక మీదట ఏ వ్యాపారి అయినా తూకం పేరుతో రైతులను మోసం చేసినా, చేయడానికి ప్రయత్నించినా సహించబోమని, భారీ జరిమానాలు, అరెస్టులు తప్పవని కంట్రోలర్‌ హెచ్చరించారు. ఎక్కడైనా సరే ఏ ఒక్క రైతు కూడా మోసపోకుండా చూడడానికి పకడ్బందీ చర్యలు ఇప్పటికే ప్రారంభించామని అన్నారు. రైతులకు సరైన తూకంలో ఎరువులు అందేలా చూడడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. రైతులు కూడా నిర్భయంగా తమకు జరుగుతున్న మోసాలపై నేరుగా 7330774444 వాట్సప్‌ నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని వారికి భరోసా ఇచ్చారు.