ఎవరి ‘జీవితం’ – ఎవరి ‘మరణం’ !!

ఎస్.కె. జకీర్.

తెలంగాణ శాసనసభకు జరగనున్న ఎన్నికలు ఉత్త ఎన్నికలు కావు. జీవన్మరణ పోరాటం.
ఎవరి జీవితం ? ఎవరి మరణం ? ఎన్నికల ప్రచార యుద్ధాన్ని కేసీఆర్ ‘టేకాఫ్’ తీసుకున్న తీరు ఆశ్ఛర్యంకలిగిస్తున్నది. ఈ ఎన్నికలను’ తెలంగాణ ఆత్మ గౌరవ’ రణంగా , చావు బతుకుల సమస్యగా కేసీఆర్ తేల్చిపారేశారు. మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న చోట కూడా ఆయన 100 డిగ్రీలకు ఉష్ణోగ్రతలను పెంచగలరు. ఆయన మాటకారి. అత్యంత సాహసి. ఎడారిలోనూ వరి పండించగలరు. 2014 నుంచి తెలంగాణలో తాము చేసిన సంక్షేమ కార్యక్రమాలను ఆశీర్వదించవలసిందిగా కోరుతూనే ,తమ పాలనపై తీర్పు ఇవ్వవలసిందిగా కోరుతూనే మరో వైపు దీన్ని ‘ప్రజల చావు బతుకుల’ సమస్యగా కేసీఆర్ దారి మళ్లించారు. ఎందుకిలా అంటున్నారు? నిజంగా ప్రజలకు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య ఎలా అవుతుంది ? తెలంగాణ ప్రజల చావు బతుకుల సమస్యా ? లేక తెలంగాణ రాష్ట్ర సమితి జీవన్మరణ సమస్యా ? అనే ప్రశ్నలు తలెత్తుతున్నవి. ఎన్నికలు ఐదేళ్లకోసారి రావడం, జయాపజయాలు సర్వసాధారణమే. కానీ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు కేసీఆర్ ‘మలుపు’ తిప్పినట్టుగా జీవన్మరణ పోరాటమెలా అవుతుంది!! దీని వెనుక లాజిక్ ఏమిటి? టిఆర్ఎస్ త్వరలోనే చీలిపోనున్నట్టు తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొన్ని నెలలుగా ఈ జోస్యం చెబుతూనే ఉన్నారు. రమణ, రేవంత్ రెడ్డిలకు టిఆర్ఎస్ అంతర్గత వ్యవహారాలపై సమాచారం అందించే ‘వేగులు’ ఉన్నారా! లేదా !అన్నది మరో చర్చ. అధికార పార్టీ మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి ఇటువంటి ప్రకటనలు చేస్తున్నట్టు భావించవచ్చును. లేదా ఆ మేరకు కొంత ‘క్లూ’ కూడా ఉందేమో తెలియదు. ”ఇది లైఫ్ అండ్ డెత్ పోరాటం. బతకాల్నా.. చావాల్నా.. బానిసలు కావాల్నా! తేల్చుకునే సమయం. ఏమరపాటుగా ఉంటే ఘోరమైన దెబ్బతింటం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మళ్ల అంధ్రోళ్లకుఅప్పగిస్తమా? దరఖాస్తులకు విజయవాడ పోదామా? అమరావతికి బానిసలవుదామా? మీరే చెప్పాలి. తెలంగాణ నిర్ణయాలు తెలంగాణల జరగాలా? లేక ఢిల్లీలో జరగాల్నా? అధికారం మన చేతిలో ఉండాల్నా? అమరావ తి, ఢిల్లీలో ఉండాల్నా? ఢిల్లీ, అమరావతి గులాంలు కావద్దు! పట్టువీడితే ఉన్న గోసిఊడిపోతది. ఆగమైపో తం. ఇన్నాళ్లు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఈనగాచి నక్కల పాలైతది. ఏమరపాటుగా ఉంటే.. ఈ గద్దలు తన్నుకుపోతే.. మళ్లా భయంకర పరిస్థితులు ఉంటాయి” అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ వనపర్తి ‘ప్రజా ఆశీర్వాద సభ’లో అనడాన్ని బట్టి ఆయన ఈ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో, వంద సీట్లను కైవసం చేసుకోవాలని ఎంత పట్టుదలగా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చును. వాస్తవానికి ఎన్నికలు వచ్చి పోతుంటాయి. పార్టీలు వచ్చిపోతుంటాయి. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. కానీ ప్రజల జీవన ప్రమాణాలు ఏ మేరకు పెరిగాయి ? ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదలకు గాను సంబంధిత ప్రభుత్వం చేసిన ‘ ఘన కార్యాలు’ ఏమిటి ? అని ప్రజలు చర్చించుకొని ఓటు వేస్తారు. ఒక్కో రాజకీయ పార్టీ, లేదా ఆ పార్టీ అధినేతలు పాలనాపరమైన విధాన నిర్ణయాలు తీసుకునే సమయంలో ప్రాధాన్యతలు వేర్వేరుగా ఉండవచ్చు. చంద్రబాబు ప్రాధాన్యతలు వేరు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రాధాన్యతలు వేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాకతొట్ట తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధామ్యాలు వేరు. ఆయా కాలాల్లో ఉన్న వనరులు, సంపద, అనుకూల వాతావరణం, రాజకీయ సుస్థిరత…. వంటి అనేక అంశాలపై పాలన ఆధారపడి ఉండవచ్చు. ఆ పాలన, ప్రజల్ని ప్రభావితం చేసే పరిస్థితులు వేరుగా ఉంటాయి. చంద్రబాబు నాయుడు హయాంలో కరెంటు ఇవ్వలేకపోయారు. కరెంటు సంక్షోభం కాల్పుల దాకా వెళ్ళింది. ఆయన ప్రభుత్వమే పతనమైంది. రాజశేఖరరెడ్డి సంక్షేమం వైపు బదిలీ అయ్యారు. చాలా పథకాలు ఇప్పటికీ ప్రజల నాలుకలపైన ఉన్నవి. ప్రజల గుండెల్లో నాటుకున్నవి. విభజన తర్వాత కేసీఆర్ 24 గంటల కరెంటు సరఫరా జరుగుతున్నది. పలు సంక్షేమ పథకాలు ప్రజలకు తాకినవి. అవి వారి అనుభవంలోకి వచ్చాయి. వై.ఎస్. రాజశేఖరరెడ్డి ‘జలయజ్ఞం’ కొనసాగింపు కేసీఆర్ పాలనలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది. ప్రభుత్వ విధాన నిర్ణయాలు ప్రజలకు అనుకూలమైతే, అవి ఓటు బ్యాంకులుగా కూడా మారగలిగితే మరుసటి ప్రభుత్వం వాటిని కొనసాగించవలసిందే. ఇరిగేషన్ రంగం తెలంగాణలో కొత్త పుంతలు తొక్కుతున్నట్టు కనిపిస్తున్న దృశ్యమంతా వై.ఎస్. హయాంలో, కాంగ్రెస్ పాలనలో శ్రీకారం చుట్టిన కార్యక్రమాలే. కానీ కాంగ్రెస్ కు క్రెడిట్ ఇవ్వడానికి టిఆర్ఎస్ ఇష్టపడదు. ఇది పక్కా రాజకీయం. జలయజ్ఞంలో కుంభకోణాలు జరిగినట్టు, భారీ అవినీతి జరిగినట్టు టిఆర్ఎస్ నాయకులు ఇప్పటికి కనీసం కొన్ని వందల సార్లు ఆరోపించి ఉండవచ్చును. కేసీఆర్ హయాంలోనూ ఇరిగేషన్ రంగంలో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ కూడా ఆరోపిస్తునే ఉన్నది. ఈ సంక్షేమ పథకాలు, వాటి ఫలితాల చర్చను పక్కన బెడితే టిఆర్ఎస్, కాంగ్రెస్ రెండింటికీ ఈ ఎన్నికలు జీవన్మరణ పోరాటమే. టిఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రాకపోతే!! అనే ఊహను కూడా కేసీఆర్, ఆయన అనుచరగణం తట్టుకోలేకపోతున్నారు. అందుకే ‘మహాకూటమి’ పై ఈ ‘దాడులు’. చంద్రబాబుపై మాటల మందుపాతరలు. కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతే. ఈ సారి ఎలాగోలా గట్టెక్కక పోతే, అధికారం చేబట్టకపోతే, గోదావరి వరద వలె కాంగ్రెస్ నాయకులు టిఆర్ఎస్ లోకి వలసలు వెడతారన్నవ్హాయం ఆ పార్టీకి ఉన్నది. అందుకే టిడిపి,సిపిఐ, తెలంగాణ జన సమితితో పొత్తులకు సన్నాహాలు చేస్తున్నది. సీట్ల పంపకం చివరి అంకంలో ఉన్నట్టు సమాచారం ఉన్నది. కోదండరాం నాయకత్వంలోని జనసమితి కోరుతున్న సీట్ల సంఖ్య ‘కూటమి’ రూపకల్పనలో కొంత ఇరకాటంలోకి నెడుతున్నప్పటికీ క్లయిమాక్సులో శుభం కార్డు పడుతుందన్న భావన కాంగ్రెస్ నాయకుల్లో ఉన్నది.

తెలంగాణాలో రాజకీయ వేడి ప్రారంభమైంది. అపద్ధర్మ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు వ్యతిరేకంగా ఉత్తమ్ నేతృత్వంలో కాంగ్రెస్‌తో పొత్తులకు ప్రతిపక్షాలు సన్నద్ధమయినవి. 2004 లో గిరిజన ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే, కాంగ్రెస్ అప్పుడు మొత్తం 21 అసెంబ్లీ సీట్లను గెలుచుకోగా, బీజేపీతో జత కలిసి ఎన్నికలకు వెళ్లిన టీడీపీ అప్పట్లో 15 సీట్లు గెలుచుకుంది. బీజేపీ కూడా ఐదు సీట్లను గెలుచుకోవడం తెలిసిందే.అంటే ఈ మూడు పార్టీలు కలిసి 41సీట్లను కైవసం చేసుకున్నాయి. ఆ తర్వాత వివిధ కారణాలతో విపక్షంలో ఉన్న పార్టీల నుంచి చాలామంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి జంప్ చేశారు. సీపీఐకి చెందిన రవీంద్ర కుమార్ దేవరకొండ నుండి 4,216 ఓట్ల మెజారిటీ తో గెలిచారు. అక్కడ రెండో స్థానం టీడీపీ కి దక్కింది. రవీంద్రకుమార్ ప్రస్తుతం టిఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్నారు.

వైరా అస్సేబ్లీ నియోజక వర్గంనుండి వైఎస్సాఆర్ కాంగ్రెస్ నుండి గెలిచిన బానోతు మదన్ లాల్ తన సమీప ప్రత్యర్థి టీడీపీఫై10,583 ఓట్ల తేడాతో గెలిచారు. అశ్వారావుపేట నుంచి ఇదే పార్టీ తరుఫున గెలిచిన తాటి వెంకటేశ్వర్లు కూడా టీడీపీ ప్రత్యర్థి పైనే గెలిచారు. అయినా వీరికి వచ్చిన మెజారిటీ సుమారు 8,500 పైనే. అంటే ఈ స్థానాలలో టిఆర్ఎస్ బలం ఎంతో సులభంగానే అర్థమవుతోంది. తెలంగాణ సెంటిమెంట్ పతాక స్థాయిలో ఉన్నప్పుడు జరిగిన 2014 ఎన్నికలలోనే ఈ స్థానాలలో టిఆర్ఎస్ కనీసం రెండో స్థానంలో కూడా లేదన్నది వాస్తవం. అప్పట్లోనే ఈ నియోజకవర్గ ఓటర్లు టిఆర్ఎస్ ను ఆదరించలేదు. ఇప్పుడు జరగబోతున్న ఎన్నికలలో, ఆ పార్టీని ఏమాత్రం ఆదరిస్తారోచూడవలసి ఉన్నది. తెలంగాణ సెంటిమెంటు పూర్తి స్థాయిలో ప్రజలలో నాటుకు పోయిన సమయంలో 2014 లో జరిగిన ఎన్నికలలో టిఆర్ఎస్ కు వచ్చిన ఓట్ల శాతం పోలయిన ఓట్ల మొత్తం లో కేవలం 33.4 శాతం. అంటే 66.6 శాతం మంది ఓటర్లు టిఆర్ఎస్ ను వ్యతేరేకించార. మధ్యంతర భృతి ఆశించి భంగ పడ్డ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇంటికో వుద్యోగం ఇస్తానన్న మాటలు నమ్మి అప్పట్లో టిఆర్ఎస్ ను భుజాన మోసిన నిరుద్యోగులు, ఉస్మానియా, కాకతీయ విద్యార్థులు సైతం కెసిఆర్ పాలనపై విపరీత మైన కోపంగా వున్నారు. మరి కొన్నివర్గాలు కూడా టిఆర్ఎస్ మీద గుర్రుగానే ఉన్నవి. కొన్ని రంగాల్లో కేసీఆర్ ‘సక్సెస్ గ్రాఫ్’ ఉన్నట్టే, వ్యతిరేక గ్రాఫ్ కూడా ఉన్నది. ‘సక్సెస్’ మోతాదులో వ్యతిరేకత ఉన్నదీ, లేనిదీ ఇప్పుడే తేలదు. దళితుడ్ని ముఖ్యమంత్రి చేస్తానన్న హామీ ఉల్లంఘన , దళితులకు మూడెకరాల భూ పంపిణీ వైఫల్యం, ఉద్యోగాల కల్పనలో వైఫల్యాలు, క్యాబినెట్ లో మహిళకు చోటు ఇవ్వకుండానే మొదటి ‘టర్మ్’ ప్రభుత్వాన్ని ముగించడం…. తదితర అంశాలపై కేసీఆర్ ప్రజలకు జవాబు చెప్పవలసి ఉందని రాజకీయ పరిశీలకులంటున్నారు.