ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్. ప్రధాని మోదీ.

న్యూ ఢిల్లీ:
దేశంలోని పలు ప్రాంతాల ప్రజల మధ్య బంధాలను, సాంస్కృతిక సంబంధాలను పెంపొందించే ‘ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్’ కార్యక్రమాన్ని బలోపేతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గవర్నర్లను కోరారు. వివిధ రాష్ట్రాల మధ్య సామరస్యాన్ని, సమగ్రతను పెంపొందించేందుకు నూతన మార్గాలను అవలంభించాల్సిన అవసరం వుందన్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో రెండు రోజుల పాటు జరిగిన గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల 49వ సమావేశం ముగింపు కార్యక్రమంలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. సమావేశంలో పలు అంశాలు చర్చించి.. అభిప్రాయాలను పంచుకున్నందుకు గవర్నర్లకు ప్రధాని అభినందనలు తెలిపారు. యూనివర్సిటీ ఛాన్స్ లర్ల హోదాలో గవర్నర్లు విద్యారంగంలో ఉత్తమ ఫలితాలు వచ్చేలా చూడాలన్నారు. భారతీయ విశ్వవిద్యాలయాలు ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయాల స్థానంలో ఉండాలని ప్రధాని కోరారు. ఇది సాధించడంలో గవర్నర్ల పాత్ర ప్రధానమైనదన్నారు. సామాన్యుడి జీవనం సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. ప్రజా జీవితంలో విస్తృత అనుభవం వున్న గవర్నర్లు ప్రభుత్వ శాఖలు, పౌర సంస్థలు లక్ష్యం కోసం అంకితభావంతో పని చేసేలా గవర్నర్లు ప్రోత్సహించాలని సూచించారు. 2022 లో జరుపుకునే 75 వ స్వాతంత్ర్య దినోత్సవం..2019 లో జరుపుకునే మహాత్మాగాంధీ 150వ జయంతి మనం సాధించాల్సిన అభివృద్ధి లక్ష్యాలకు స్పూర్తి సంఘటనలన్నారు. రాబోయే కుంభమేళ కూడ జాతీయ సంబంధిత కారకాలను పెంపొందించే ప్రధాన సందర్భమన్నారు.