ఏపి సి.ఎం.గా జగన్ అత్యంత సమర్థుడు. -పోసాని కృష్ణ మురళి.

అమరావతి:
ప్రాక్టికల్ జగన్ పాదయాత్ర చూసిన తర్వాత వైఎస్ జగనే రాష్ట్రానికి సీఎం కావాలనిపించిందని సినీ ప్రముఖుడు పోసాని కృష్ణ మురళి అన్నారు.వైఎస్ జగన్ అబద్దపు హామీలివ్వడం లేదన్నారు. కమిట్‌మెంట్ ఉన్న నాయకుడుగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పారు.
‘దైవసాక్షిగా.. నా కుటుంబ సాక్షిగా.. నా మీద ఒట్టు వేసుకుని చెబుతున్నా జగన్ చాలా మంచివాడు’ అని ఆయన అన్నారు.
టీడీపీ ప్రభుత్వంలో జరగని అన్ని పనులు వైఎస్ జగన్ చేస్తాడని తాను ప్రగాఢంగా నమ్ముతున్నానన్నారు.ఆయన సమర్ధత నచ్చిందని సీఎం కాగలిగిన అన్ని అర్హతలున్నాయని పోసాని అభిప్రాయపడ్డారు.
జగన్ అంతకుముందు ముఖ్యమంత్రుల కంటే చాలా సమర్ధంగా పనిచేస్తారని చెప్పారు. లేకపోతే తనను చెప్పుతో కొట్టండని కూడా పోసాని అన్నారు.తనకు ఎటువంటి పదవులు వద్దని,ఎమ్మెల్యే, ఎంపీగా పోటీచేయనని ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవులను స్వీకరించనని పోసాని స్పష్టం చేశారు.అబద్దపు హామీలిచ్చి ప్రజలను మోసం చేయనని, అబద్దపు హామీలతో అధికారంలోకి రానని జగన్ చెప్పిన మాటలు నచ్చాయని కృష్ణ మురళి చెప్పారు.జగన్ లాంటి పరిణతి చెందిన నేతను తాను ఎక్కడా చూడలేదన్నారు.రాష్ట్రానికి సేవ చేయగల నాయకుడు వైఎస్ జగన్ మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు.వైఎస్ జగన్ గురించి రాష్ట్ర ప్రజలెవరూ తప్పుగా అనుకోలేదన్నారు. చంద్రబాబు మాత్రమే ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పోసాని విమర్శించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిలోని నిజాయితీ, మాట మీద నిలబడే తత్వం తనకు నచ్చాయని సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి అన్నారు. ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ను ఆయన శనివారం కలిశారు. అనంతరం పోసాని మాట్లాడుతూ..‘జగన్‌లోని ధృడ సంకల్పం నన్ను ఆకర్షించింది. అందుకే ఆయనకు మద్దతుగా పాదయాత్రలో పాల్గొన్నాను. అన్ని వర్గాల సమస్యలు పరిష్కరించే నాయకుడు వైఎస్‌ జగన్‌. ఆయనలో సంకల్పం చూసి ఆశ్చర్యం వేసింది.ఇది చరిత్రలో నిలిచిపోయే పాదయాత్ర. మూడు వేల కిలోమీటర్లు నడవడం అంటే మామూలు విషయం కాదు. మండుటెండను సైతం లెక్కచేయకుండా ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఆయన చేస్తున్న పాదయాత్ర అసాధారణం. నేను రెండు, మూడు కిలోమీటర్లు కూడా నడవలేకపోయా. సమస్యల పరిష్కారంపై నిబద్ధత కలిగిన నాయకుడిగా ఆయనకు ఓటువేసి ముఖ్యమంత్రిని చేయండి. నేను రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్కసారి మీరు ఓటు వేస్తే మీరే మళ్లీ మళ్లీ ఆయనను గెలిపిస్తారు.’ అని అన్నారు. వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో కొనసాగుతోంది.