‘ఐఎల్‌ అండ్‌ ఎఫ్ఎస్‌’పై దర్యాప్తు. ఎస్ఎఫ్ఐఓ విచారణకు ఆదేశం.

న్యూఢిల్లీ:
ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కున్న ఐఎల్‌ అండ్‌ ఎఫ్ఎస్‌, దాని అనుబంధ సంస్థల లావాదేవాలపై దర్యాప్తు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంస్థలపై సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ (ఎస్ఎఫ్ఐఓ) విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఐఎల్‌ అండ్‌ ఎఫ్ఎస్‌ కంపెనీకి 169 అనుబంధ సంస్థలు ఉన్నాయి. వీటిలో అనుబంధ సంస్థలు, జాయింట్‌ వెంచర్‌ కంపెనీలతో పాటు అసోసియేట్‌ కంపెనీలు ఉన్నాయి. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినా కంపెనీ ఏటా భారీ ఎత్తున డివిడెండ్‌ను ఇవ్వడంతోపాటు కంపెనీ ఉన్నతోద్యోగులకు భారీ వేతనాలు ఇస్తోంది. కంపెనీల చట్టం 2013లోని సెక్షన్‌ 241 (2) కింద ఈ అసాధారణ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. కంపెనీలో మరింత నిధుల దుర్వినియోగం జరగకుండా ఉండేందుకు, ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఈ చర్య తీసుకున్నట్లు వివరించింది. కంపెనీ భారీ రుణ భారంతో ఉన్నట్లు పైకి కన్పిస్తోంది..
అయినా తప్పుడు డేటాతో వాస్తవాలను మరుగున పెట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది. కంపెనీ ఖాతాలు చూస్తే రూ. 20,000 కోట్లు అదృశ్య ఆస్తుల రూపంలో (నాన్‌ కరెంట్‌ అసెట్స్‌ ఖాతాలో)ఉన్నట్లు స్పష్టమౌతోందని తెలిపింది. కంపెనీ ఆదాయంలో సగం మొత్తం రావాల్సిన పద్దుల్లో ఉన్నాయని.. వీటిలో చాలా మటుకు న్యాయపరమైన చిక్కుల్లో ఉన్నాయని ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది.