ఐఏఎఫ్ వైస్ చీఫ్ కి బుల్లెట్ గాయం.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) వైస్ చీఫ్, ఎయిర్ మార్షల్ శిరీష్ బబ్బన్ దేవ్ పొరపాటున గాయపడ్డారు. తన తుపాకీ శుభ్రం చేస్తూ ఆయన తన తొడలోకి బుల్లెట్ కాల్చుకున్నారు. వెంటనే ఆయనను ఢిల్లీలోని ఆర్ఆర్ హాస్పిటల్ కు తరలించారు. ఆయనకు శస్త్ర చికిత్స చేసిన వైద్యులు ఐసీయులో వైద్య పర్యవేక్షణలో ఉంచారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలిసింది. దేవ్ పూర్తిగా కోలుకొనేందుకు మరికొంత కాలం పట్టవచ్చని చెబుతున్నారు. జూలైలో ఎయిర్ వైస్ చీఫ్ గా శిరీష్ దేవ్ బాధ్యతలను స్వీకరించారు. ఎయిర్ చీఫ్ గా బీఎస్ ధనోవా బాధ్యతలను స్వీకరించడంతో… ఆయన స్థానంలో వైస్ చీఫ్ గా శిరీష్ నియమితులయ్యారు. 1979 జూన్ 15న ఫైటర్ పైలట్ గా శిరీష్ ఎయిర్ ఫోర్స్ లో చేరారు. మిగ్-21 బైసన్ స్క్వాడ్రన్ కు ఆయన ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ (ఏఓసీ)గా పని చేశారు. దీనికి తోడు అత్యంత కీలకమైన ఒక ఫార్వర్డ్ బేస్ కు చెందిన సిగ్నల్ యూనిట్ కు చీఫ్ కమాండింగ్ ఆఫీసర్ గా వ్యవహరించారు. స్టేషన్ కమాండర్ గా ఎయిర్ ఫోర్స్ లోకి అధునాతన టెక్నాలజీని, సెన్సార్లను ఆయన తీసుకువచ్చారు.