‘ఐకియా’ అను భూతల దోపిడీ!!

యాభై ఏళ్లపాటు కళ్లజోళ్లు దుకాణాన్ని నిర్వహించిన ఒక పెద్దాయన వార్ధక్యభారం కుంగదియ్యడంతో కొడుక్కు దుకాణం అప్పజెప్పాడు. ఒక వ్యాపార రహస్యం కూడా చెప్పాడు. “ఒక కస్టమర్ వస్తాడు. ముందుగా ప్రిస్క్రిప్షన్ చూడు. జాగ్రత్తగా లెక్కలు వేసుకుని రెట్టింపు లాభం కలుపుకుని వెయ్యి రూపాయలు చెప్పి అతని ముఖం చూడు. అతని ముఖం ప్రసన్నంగా ఉంటె … ఇది ఫ్రెమ్ ఖరీదండి. అద్దాలు మరో నాలుగు వందలు అవుతాయని చెప్పు. అతను సరే అంటే… ఒక్కొక్క అద్దం ఖరీదండి. రెండూ కలిపి ఎనిమిది వందలు అవుతాయని చెప్పు. అప్పుడతను ఏమైనా తగ్గిస్తారా అని అడుగుతాడు. భలేవారండి… మీరు మా నాన్న గారినుంచి కస్టమర్. మీరు అడిగితె కాదనేది ఏముంది? రెండు వందలు తగ్గిస్తాను..నాకు లాభం లేకపోయినా మీలాంటి కస్టమర్ ను వదులుకోలేము అని చెప్పు…ఆ విధంగా వంద రూపాయల కళ్ళజోడు వెయ్యి రూపాయలకు అమ్ముతూ మన ఊళ్ళోనే నాలుగు మేడలు కట్టించాను. ఇరవై ఎకరాల మాగాణి, మీ అమ్మకు అరకిలో సువర్ణాభరణాలు చేయించాను. నీ అక్కయ్యకు పావుకిలో బంగారంతో పట్టెడ చేయించాను.” చెప్పాడు ఆ వృద్ధుడు. ఈరోజు భాగ్యనగరంలో వెలసిన మహా ఫర్నిచర్ మాల్ ఐకియాకు వెళ్ళాము. సింగపూర్ లోని ముస్తఫా మాల్, కోచి లోని లూలూ మార్కెట్ గుర్తుకొచ్చాయి. ఆఫ్టరాల్ మంచాలు, సోఫాలు, పరుపులు, టేబుళ్లు అమ్మే దుకాణాలు ఇన్నిన్ని ఎకరాల్లోనా అని మనసు ఆర్ద్రం అయింది. డైనింగ్ టేబుల్ చూద్దామని వెళ్ళాము. ఒక టేబుల్ ను చూడగానే తెగ నచ్చేసింది. టేబులుకు ఒక తోక వేలాడుతున్నది. దానిమీద పదహారువేల రూపాయలు అనే తోక ఉన్నది. ఓహ్… ఇంత చవకగానా…అయితే ఐకియా గూర్చి నేను విన్నది నిజమే అన్నమాట! అని నయనాలు చెమర్చగా అక్కడున్న ఒక అమ్మాయిని పిలిచాను. “మగువా…. ఈ టేబులు తీసుకుంటాను. ఎంత ఇది?” అడిగాను ఆత్రంగా… మరో కస్టమర్ దాన్ని ఎగరేసుకుని పోకుండా. “యాభై అయిదు వేలు సార్” అన్నది అతి వినయంగా ఆ అతివ. కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అరిచి “అదేమిటి? పదహారు వేలే కదా?”. అన్నాను.మొట్టమొదటిసారిగా హైదరాబాద్ వచ్చినవాడిని చూసినట్లు చూసి “కుర్చీలు వేరే నండీ. ఒక్కొక్క కుర్చీ ఆరువేల రూపాయలు. ఆరు కుర్చీలు ముప్ఫయి ఆరువేలు. టేబులు పదహారువేలు. ఈ చిన్ని టేబుల్ (పక్కనున్న జానెడు పీటను చూపిస్తూ) వెయ్యి రూపాయలు. ట్రాన్స్ పోర్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు. అసెంబ్లింగ్ చార్జెస్ వెయ్యి రూపాయలు” దేవులపల్లి భావకవితలా అర్ధ తాత్పర్యాలను వివరించింది. “కడుంగడు ధన్యవాదములు లలనా…శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు” అని ఆమెకు మంగళాశాసనములు పలికి కప్పులు, సాసర్లు, గ్లాసులు పెట్టుకునే చిన్న షెల్ఫ్ కొందామని ప్రయత్నించాము. అది ఒక అడుగు ఎత్తు, ఆరు అడుగులు పొడవు కలిగి మూడు అద్దాల ద్వారములు కలిగియున్నది. అద్దాల ద్వారమునకు 3590 /- అని తోక వేలాడుతున్నది. “అబ్బో.. ఇది చాలాబాగుంది. కొనేద్దాము” అనుకుని రెండో ద్వారమును తెరువగా దానికి లోపలివైపు మరో 3590 /- అనే తోక వేలాడుతున్నది. మేము హాశ్చర్యముగా తిలకించి మూడో ద్వారమును తెరువగా అక్కడ మరో 3590 /-రూపాయల తోక వేలాడుచున్నది. మేము తికమక మకతికలకు లోనై, అక్కడనే కాలుగాలిన పిల్లిలా తిరుగాడుచున్న పడతిని పిలిచి “ఓ పూబంతీ…ఇదేమిటి దీనికి మూడు తోకలు ఉన్నవి? ఇది ఎంత” అని అడిగాము. “అది పన్నెండు వేలు సార్..” అని చెప్పినది నెమ్మదిగా. నా గుండె గుభిల్లనగా వణుకుతున్న స్వరంతో “అదేమిటి ఒకేసారి పన్నెండు వేలు అని రాయొచ్చుగా? శీఘ్రదర్శనం, అతి శీఘ్రదర్శనం, మహాశీఘ్రదర్శనం అని వేర్వేరు టికెట్లు ఉన్నట్లు విడివిడిగా ఎందుకు రాశారు?” అని ప్రశ్నించాను. ” అది ఒక్కొక్క షెల్ఫ్ ధర సార్.. మూడూ కావాలంటే పన్నెండు వేలు.. మేము ఇంటికి తెస్తే వెయ్యి రూపాయలు…అసెంబ్లింగ్ చార్జెస్ వెయ్యి రూపాయలు” అని చాలా సింపుల్ గా చెప్పింది. అప్పటికే నా కాళ్లలో వణుకు మొదలు కాగా, నిష్క్రమణ ద్వారం ఎటువైపు?” అని ప్రశ్నించాను ఒక ఉద్యోగిని. “కింద బాణం గుర్తులను ఫాలో అవుతూ వెళ్ళండి సార్” అన్నాడు కొంత వినయవిధేయతలతో. ఇక వస్తూ వస్తూ అక్కడ పింగాణీ కప్పులు (బౌల్స్) కనిపిస్తే కాళ్ళు అటువైపుకు లాగగా ఒక కప్పును చూసాను. దాని పృష్ఠభాగంలో 187 /- అనే స్టికర్ కనిపించింది. అది మామూలుగా చైనా బజార్ లాంటి షాపుల్లో ముప్ఫయి రూపాయలు ఉంటుంది. అక్కడ ఫుడ్ కోర్ట్ కనిపించింది. అక్కడ తిరుపతి క్యూ కనిపించింది. మొన్ననే ఐకియా బిర్యానీలో గొంగళిపురుగు, చాకోలెట్ లో రెక్కపురుగులు కనిపించిన దృశ్యాలు తలపునకొచ్చి, అతివేగముగా ఆ ప్రదేశం నుంచి నిష్క్రమించితిమి. బయటకొచ్చి బండిమీద బజ్జీలు తిని తృప్తిగా స్వగృహమునకు పయనమైతిమి. మామూలుగా మనం ఫర్నిచర్ షాపుకు వెళ్లి “డైనింగ్ టేబుల్ ఎంత” అని అడిగితె ఆరు కుర్చీలు, బల్ల, దానిమీద ఉండే అద్దం, ట్రాన్స్ పోర్ట్ మొత్తం కలిపి ఇంత మొత్తం అని చెబుతారు. బేరసారాలు ఉంటాయి. అంతే కానీ, కుర్చీ ఇంత, దాని ఒక్కో కాలు ఇంత టేబుల్ మీద అద్దం ఇంత, దానిమీద వేసిన డిజైన్ ఇంత అని చెప్పరు. కానీ, ఒక వస్తువుకు విడివిడిగా ధరల పట్టికలను వేలాడదీయడం ఐకియా ప్రత్యేకత! అదేమంటే క్వాలిటీ అనే ఒక బుకాయింపు! పేదలు, మధ్యతరగతివారు, ఎగువ మధ్యతరగతి వారు ఐకియా ఉన్న వీధికి కూడా వెళ్లి సమయం వృధా చేసుకోవద్దు. నెలకు రెండు మూడు లక్షలు సంపాదిస్తూ, డబ్బును ఎలా వృధా చెయ్యాలో తెలియని వారు, పై పై మెరుగులు చూసి భ్రమపడేవారు మాత్రమే ఆ దుకాణంలోకి అడుగుపెట్టండి.

(ఒక నెటిజన్ ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్).