ఐజేయు అధ్యక్షుడిగా దేవులపల్లి అమర్. 28న అధికారిక ప్రకటన.

న్యూ ఢిల్లీ:
25 రాష్ట్రాల వర్కింగ్ జర్నలిస్ట్స్ సంఘాలు ఆయనకు జాతీయ పగ్గాలు అప్పగించడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయు) అధ్యక్షుడి ఎన్నికల్లో అమర్ నాయకత్వానికి
భారతదేశ జర్నలిస్టులు జేజేలు పలకడం అభినందనీయం. ఇప్పటివరకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగిన ఆయన
మరో అడుగు ముందుకువేసి జాతీయ సంఘానికి అధ్యక్షునిగా ఏకగ్రీవంగా
ఎన్నికవుతున్నారు. ఇండియన్ జర్నలిస్టుల యూనియన్(ఐజేయు) చరిత్రలో అధ్యక్ష స్థానానికి దక్షిణ భారతదేశం నుండి తొలిసారిగా ఎన్నికైంది అమర్ కావడం విశేషం. దేశవ్యాప్తంగా మీడియాలో నెలకొన్న పరిస్థితులపై స్పష్టమైన అవగాహన, వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమం పట్ల ఆయనకున్న సుదీర్ఘ అనుభవం, చిత్తశుద్ధి, పట్టుదల, అంకితాభావం ఆయా రాష్ట్రాల జర్నలిస్టుల సంఘాల నాయకత్వాలను ఆకర్షించి అంతటి ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళింది. ఐజేయు అధ్యక్ష స్థానానికి నామినేషన్ల గడువు మే 25 న ముగిసింది. వివిధ రాష్ట్రాల జర్నలిస్టు సంఘాల ప్రతిపాదనలతో అమర్ నామినేషన్ ఒక్కటే దాఖలు కావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. మే 28న కేంద్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.