ఐదేళ్ల తర్వాత ‘టైగర్’ గర్జించాడు.

న్యూఢిల్లీ:

వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు.. గాయాల బెడద మధ్య నలిగిపోయి ర్యాంకింగ్స్ లో అట్టడుగుకి చేరిన దిగ్గజ గోల్ఫర్‌ టైగర్‌ ఉడ్స్ మళ్లీ ఫామ్‌ సాధించాడు. ఐదేళ్ల తర్వాత టైగర్ మరో అంతర్జాతీయ పీజీఏ టైటిల్‌ సాధించి 13వ ర్యాంక్ కి చేరాడు. ఈస్ట్‌ లేక్‌ టూర్‌ ఛాంపియన్‌షిప్‌లో ఉడ్స్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో టైగర్‌ ఉడ్స్ 269 పాయింట్లు సాధించి ప్రత్యర్థులకి అందనంత ఎత్తులో నిలిచాడు. విజేత టైగర్ ఉడ్స్ అని ప్రకటించగానే గెలుపు కోసం ఐదేళ్లుగా నిరీక్షిస్తున్న టైగర్ సంతోషంతో కన్నీరు పెట్టాడు. ప్రేక్షకుల ముందే ప్రస్తుత గర్ల్ ఫ్రెండ్‌ ని ముద్దాడాడు.చివరగా టైగర్ 2013లో పీజీఏ టైటిల్‌ గెలిచాడు. 82 టైటిళ్లతో శామ్‌ స్నీడ్‌ ప్రపంచ రికార్డును టైగర్‌ ఉడ్స్ బద్దలు కొడతాడని అంతా భావించారు. ఐతే అతని విశృంఖల శృంగార కార్యకలాపాలు బయటపడి వ్యక్తిగత జీవితంలో తీవ్ర కుదుపు వచ్చింది. భార్య విడిపోయింది. దీనికి గాయాలు తోడయ్యాయి. దీంతో అతను 79 టైటిళ్ల మీదే ఉండిపోయాడు. ఎట్టకేలకు ఇప్పుడు తన ఖాతాకి మరో టైటిల్‌ జమ చేశాడు. ఇదే ఊపులో మరో మూడు టైటిళ్లు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడని అభిమానులు ఆశిస్తున్నారు.