ఒంటిగంట వరకే పంచాయతీ పోలింగ్. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు.

హైదరాబాద్:
మార్గదర్శకాలు జారీచేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం. త్వరలో జరుగనున్న పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకే నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. స్థానిక పోరును పక్షంరోజుల్లో పూర్తిచేయనున్న ఎన్నికల కమిషన్.. ఒంటిగంటకు పోలింగ్ పూర్తయ్యాక 2 గంటలకు లెక్కింపు ప్రక్రియను ప్రారంభిస్తుంది.పంచాయతీ ఎన్నికల నిర్వహణపై స్టేజ్-1, స్టేజ్-2 రిటర్నింగ్ అధికారుల విధులను ఖరారుచేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీచేసింది. ఈ మార్గదర్శకాలను నూతన పంచాయతీరాజ్ చట్టం ద్వారా అమలుచేస్తున్నట్టు పేర్కొన్నది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రెండు స్టేజ్‌లలో రిటర్నింగ్ అధికారులను నియమిస్తున్నట్టు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల్లో పేర్కొన్నది. జెడ్పీటీసీ స్థానానికి పోటీచేసే అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే రూ.2,500, ఇతరులైతే రూ.5 వేలు, ఎంపీటీసీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే రూ.1250, ఇతరులైతే రూ. 2,500,సర్పంచ్ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే రూ.1000, ఇతరులైతే రూ.2 వేలు, వార్డుస్థానాల్లో బరిలో నిలిచేవారు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులైతే రూ.250, ఇతరులైతే రూ.500 డిపాజిట్‌గా చెల్లించాలి. 10వేలకుపైగా జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థుల ఖర్చుకు రూ.80 వేల వరకు, వార్డు స్థానానికి పోటీచేసే అభ్యర్థి రూ.10 వేల వరకు ఖర్చు చేయవచ్చు.10 వేలలోపు జనాభా ఉంటే సర్పంచ్ అభ్యర్థి రూ.40 వేలు, వార్డుసభ్యుడు రూ.6 వేలలోపు ఖర్చుపెట్టాలి. ఇవన్నీ బ్యాంకు ఖాతా నుంచే వెచ్చించాలి.