ఒక ఫెయిల్యూర్ స్టోరీ. గొప్పలతో డప్పు.

‘బొగ్గుబాయి,ముంబై,దుబాయి’ అంటూ ఉపాధి అవకాశాలకు సంబంధించి నిరుద్యోగ యువతలో కెసిఆర్ సెంటిమెంటు రగిలించే ప్రయత్నం గట్టిగా చేశారు.ఉన్న ఖాళీల కోసం నోటిఫికేషన్లు రావు.ఖాళీల భర్తీకి గాను ఒక క్యాలెండర్ ప్రకటించాలన్న డిమాండును ప్రభుత్వం ఖాతరు చేయదు.ఉద్యమ పార్టీ పక్కా రాజకీయపార్టీగా అవతరించిన అనంతరం నిరుదోగ యువత అవసరం కానరావడం లేదు.ఉద్యోగం లభించక తీవ్ర నిరాశా,నిస్పృహలో నిరుద్యోగ యువకులు ఆత్మహత్య చేసుకుంటున్న వార్తలు తరచూ మీడియాలో కనిపిస్తున్నవి.ప్రభుత్వ ప్రాధాన్యతలు వేరుగా ఉన్నవి.సాగునీటి ప్రాజెక్టులు,మిషన్ భగీరథ,రైతుబంధు, రైతుబీమా వంటి కార్యక్రమాలు,ఇతర జనాకర్షక ‘ఓటుబ్యాంకు’ రాజకీయాలకు కెసిఆర్ ప్రాధాన్యం ఇస్తున్నట్టు అర్ధమవుతున్నది.


హైదరాబాద్;
నాలుగేళ్ల టిఆర్‌ఎస్ సర్కారు పాలన రెండు అడుగులు ముందుకు నాలుగడుగులు వెనక్కు అనేలా తయారైంది. ఇదొక ఫెయిల్యూర్ స్టొరీ.నీళ్ళు-నిధులు-నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగింది.తెలంగాణ కోసం తృణప్రాయంలా బలిదానం చేసుకున్న యువకుల సూసైడ్ నోట్స్ లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయన్న ఆరాటం కన్పిస్తుంది.కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంత కీలకమెయిన్ అంశాన్ని కేసిఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది.గత నాలుగేళ్ళలో ప్రభుత్వ ఉద్యోగాలలో భర్తీ చేసినవి 20 వేలకు మించి లేవు.ఇందులో పోలీసు కానిస్తేబుళ్ళ నియామకాలే దాదాపు 10 వేలా దాకా ఉన్నవి.ప్రభుత్వంలో, ప్రభుత్వ రంగ సంస్థలలో కనీసం 2 లక్షల దాకా ఖాళీలున్నట్టు ఒక అధ్యయనంలో తేలింది.యూనివర్సిటీ లలో సగానికిపైగా అధ్యాపకుల పోస్టులు ఏళ్ల తరబడి ఉన్నవి.మొదట్లో అసలు జోన్ లే ఉండవని ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యాఖ్యానించారు.ఇప్పుడు తాజాగా 7 జోన్లు అంటున్నారు.మరో 2 మల్టీ జోన్లు గా చెబుతున్నారు.నిరుద్యోగ సమస్యకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదన్న విమర్శలు ఎదుర్కుంటున్నది. ‘బొగ్గుబాయి,ముంబై,దుబాయి’ అంటూ ఉపాధి అవకాశాలకు సంబంధించి నిరుద్యోగ యువతలో కెసిఆర్ సెంటిమెంటు రగిలించే ప్రయత్నం గట్టిగా చేశారు.ఉన్న ఖాళీల కోసం నోటిఫికేషన్లు రావు.ఖాళీల భర్తీకి గాను ఒక క్యాలెండర్ ప్రకటించాలన్న డిమాండును ప్రభుత్వం ఖాతరు చేయదు.ఉద్యమ పార్టీ పక్కా రాజకీయపార్టీగా అవతరించిన అనంతరం నిరుదోగ యువత అవసరం కానరావడం లేదు.ఉద్యోగం లభించక తీవ్ర నిరాశా,నిస్పృహలో నిరుద్యోగ యువకులు ఆత్మహత్య చేసుకుంటున్న వార్తలు తరచూ మీడియాలో కనిపిస్తున్నవి.ప్రభుత్వ ప్రాధాన్యతలు వేరుగా ఉన్నవి.సాగునీటి ప్రాజెక్టులు,మిషన్ భగీరథ,రైతుబంధు, రైతుబీమా వంటి కార్యక్రమాలు,ఇతర జనాకర్షక ‘ఓటుబ్యాంకు’ రాజకీయాలకు కెసిఆర్ ప్రాధాన్యం ఇస్తున్నట్టు అర్ధమవుతున్నది.సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కెసిఆర్ ప్రభుత్వానికి ‘ఫోకస్’ గా ఉన్నది.అయితే సమగ్ర వ్యవసాయ విధానం రూపకల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు.’రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే’ అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిప్పులు చెరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం చేబట్టగానే మాట మార్చింది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా నివారిస్తామని కెసిఆర్ అన్నారు.గడచిన నాలుగేళ్ళలో 3,500 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.ఇది రైతు సంఘాల లెక్ఖ.2017 చివరి వరకు 1149 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నవి. 2015 లోనే తెలంగాణలో 1358 మంది ఆత్మహత్య చేసుకున్నట్టు జాతీయ నేర గణాంకాల మండలి తన నివేదికలో తెలిపింది.ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే 140 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.అధికారికంగా గుర్తించిన 1149 మంది రైతుల కుటుంబాల్లో 846 కుటుంబాలకు పరిహారం లభించింది.రైతుల ఆత్మహత్యలు నివారించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నదో వివరించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్ని సార్లు కోరినా ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు.భూమిలేని నిస్సహాయ దళితులందరికీ 3 ఎకరాల చొప్పున పంపిణీ చేస్తామని టిఆర్ఎస్ పార్టీ 2014 ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది.తెలంగాణ వ్యాప్తంగా 3 లక్షల మందికి పైగా అసలు భూమి లేని దళితులున్నారు.మరో 3 లక్షల దళిత కుటుంబాలు 3 ఎకరాల కన్నా తక్కువ భూమి కలిగిన వారు.ఇందులో చాలా మంది రైతుకూలీలుగానో,లేదా కౌలు రైతులుగానో జీవిస్తున్నారు.ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వాటిని దళితులకు పంపిణీ చేస్తామని, ప్రభుత్వ భూములు అందుబాటులో లేని పక్షంలో ప్రైవేటు వ్యక్తుల నుంచి భూములు కొనుగోలు చేసి పంపిణీ చేస్తామని ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి నాళ్లలో హామీ ఇచ్చింది.కానీ గత నాలుగేళ్లలో ప్రభుత్వం గుర్తించిన లబ్దిదారులు 4596 మంది.ప్రభుత్వం పంపిణీ చేసిన భూమి 11,968 ఎకరాలు మాత్రమె.ఒక వైపు భూములున్న వారి అవసరాలకోసం సాగునీటి వసతి కల్పించడం,ఇతర వ్యవసాయ పధకాలు ప్రకటించడం వంటి చర్యలు తీసుకుంటూ అసలు భూమి లేని కూలీలను కూలీలుగానే ఉంచే ఆలోచనలో పాలకులు ఉన్నట్టు కనిపిస్తున్నది.మార్కెట్ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చెయ్యాలని,రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చూడాలని వచ్చిన డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో వివిధ సందర్భాలలో రైతాంగంలో ‘అశాంతి’ నెలకొంటున్నది.ప్రభుత్వంతో ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంటున్నది.ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆందోళనకు దిగిన మిర్చి రైతులను అరెస్టు చేసి చేతులకు బేడీలు వేసి తీసుకువెళ్ళడం వివాదాస్పదమైంది.అ ఘటన కెసిఆర్ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాల్జేసింది.తర్వాత నష్ట నివారణ చర్యలు ఎన్ని రకాలుగా చేబట్టినా ఫలితం లేకపోయింది.తెలంగాణ ప్రభుత్వం ఏ కార్యక్రమం తలపెట్టినా అది యావత్తు దేశానికి ‘మోడల్’ అనే ప్రచారం విస్తృతంగా జరుగుతున్నది.ఈ ప్రచారం కోసం వందలాది కోట్లను నీళ్ళలా ఖర్చుపెడుతున్నది.ప్రభుత్వం తన సక్సెస్ గా చెప్పుకుంటున్న వాటిలో 24 గంటల నిరంతరాయ కరెంటు సరఫరా ఒకటి.ఇది గొప్ప కార్యక్రమం కాదని ఎవరూ చెప్పడం లేదు.వ్యవసాయ రంగానికి సంబంధించినంతవరకు ఇది రైతులకు లాభమా ? నష్టమా ?అన్న చర్చ జరుగుతున్నది.తెలంగాణాలో 84 శాతం మంది రైతులు బోర్ల పై ఆధారపడి సాగు చేస్తున్నారు. ప్రభుత్వ వర్గాల కధనం ప్రకారం కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి వంటి భారీ ప్రాజెక్టులు పూర్తి అయితే బహుశా బోర్లపై ఆధారపడే రైతుల సంఖ్య తగ్గవచ్చును.24 గంటల నిరంతరాయ కరెంటు సరఫరాను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది.కానీ ఆటోమేటిక్ స్టార్టర్ల మూలంగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నవి.చాలా చోట్ల బోర్లు ఎండిపోతున్నవి. 9 గంటల కరెంటు సరిపోతుందని రైతులు చెబుతున్నారు. ఇక రైతు సమన్వయ సమితులు గ్రామాల్లో ‘సమాంతర’ వ్యవస్థలుగా మారే ప్రమాదం ఉందన్న విమర్శలు ఉన్నవి.ఈ సమితుల్లో నియామక ప్రక్రియ అంతా రాజకీయమయమైందన్న నింద ఉన్నది.తెలంగాణ రాష్ట్రం 5392 కోట్ల లోటు బడ్జెట్లో ఉన్నట్టు 2017 ‘కాగ్’ రిపోర్ట్ తేల్చి చెప్పింది.ప్రభుత్వం వివిధ రకాల ‘లోన్’ లు,గ్రాంట్లను రాబడిగా చూపించి లోటును తగ్గించే ప్రయత్నం చేసింది.1300 కోట్ల మిగులు బడ్జెట్ అనే వాదనను కాగ్ తోసిపుచ్చింది.ప్రభుత్వం ప్రస్తుతం చేస్తున్న అప్పుల్లో 34 శాతం పాత అప్పులు, వడ్డీలు తీర్చడానికే ఖర్చు చేస్తున్నది.2020-22 మధ్య 14,896 కోట్లు, 2022-24 మధ్య 22,280 కోట్ల అప్పును తెలంగాణా ప్రభుత్వం తీర్చవలసి ఉందని కాగ్ తెలిపింది.రెవెన్యూ వ్యయం 69 శాతం అయితే, అభివృద్ధికి మిగిలింది 31 శాతం నిధులే. 2016-17 లో బడ్జెట్ కేటాయింపులకన్నా అదనంగా 21,621 కోట్లు ఖర్చు చేసినట్టు ‘కాగ్’ మొట్టికాయలు వేసింది.
రాష్ట్రంలో ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఎంసెట్ పరీక్ష లోనూ సర్కారు వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడింది. ఎంసెట్ ప్రశ్నపత్రాలు లీక్ అవడంతో ఏకంగా మూడు సార్లు ఒకే పరీక్షను నిర్వహించి అభాసుపాలైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2011 లో గ్రూప్1 పరీక్ష నిర్వహించారు. కోర్టు తీర్పు నేపథ్యంలో దాన్ని మళ్లీ నిర్వహించాల్సి వచ్చింది. ఎపి, తెలంగాణ ప్రభుత్వాలు వేరువేరుగా ఒకే రోజు పరీక్షలు నిర్వహించాయి. టీచర్ అవ్వాలనుకునే నిరుద్యోగ అభ్యర్థులతో సర్కారు ఆడుకుంటున్న వైనం మరీ దారణం.బిఎడ్ పరీక్షలను ఆలస్యంగా నిర్వహిస్తోంది. టిపిటి, హెచ్‌పిటి లాంటి ప్రవేశ పరీక్షలను ఓ విద్యా సంవత్సరం పూర్తిగా రద్దు చేసింది. దీనికి కారణాలేమిటో చెప్పడం లేదు. మరో వైపు అభ్యర్థులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న డిఎస్‌సి నోటిఫికేషన్ ఊసులేదు.సింగరేణిలో వారసత్వ కొలువులకు పచ్చజెండా ఊపుతూ ప్రభుత్వం ప్రత్యేకంగా జిఒ జారీ చేసింది. దీనిపై సతీశ్ కుమార్ అనే వ్యక్తి సుప్రీం కోర్టుకు వెళ్లడంతో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. వారసత్వ నియామకాలు చెల్లవని ప్రభుత్వం జారీ చేసిన జిఒను కోర్టు కొట్టేసింది. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది.ప్రభుత్వపరంగా చూస్తే  తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ తనదైన ముద్ర వేయగలిగారు. ముఖ్యంగా హైదరాబాద్ సహా తెలంగాణ అంతటా కరెంటు కోత లేకుండా ఇవ్వడం ఆయన మొదటి విజయం. తొలుత కొద్దికాలం తీవ్రమైన పరిస్థితి ఏర్పడినా, కరెంటు విషయంలో అసాధారణ రీతిలో కొరత లేకుండా చేశారు. పెన్షన్లు, కళ్యాణలక్ష్మి తదితర సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం గట్టి చొరవ తీసుకుంది. అభివృద్ధి ప్రణాళికలు, నీటిపారుదల ప్రాజెక్టుల రీడిజైన్ లు ఇప్పటికిప్పుడు ఫలితాలు చూపకపోయినా, వాటి ప్రభావం దీర్ఘకాలంలో కనిపించవచ్చును. మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా ఇంటింటికి నీరు ఇవ్వాలన్న భగీరథ ప్రయత్నం ఆయనకు మంచి పేరు తెచ్చే అవకాశం ఉంది. పైగా ఆయన ఈ స్కీము పూర్తి చేయకపోతే ఎన్నికలలో పోటీచేయనంటూ సవాల్ విసరడం ద్వారా ప్రజలలో ఒక నమ్మకం కలిగించారు. అలాగే మిషన్ కాకతీయను కూడా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టారు. వర్షాలు పడి, చెరువులన్ని నీటితో కళకళలాడితే అంతా సంతోషిస్తారు. ఈ రెండు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులతో పాటు నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజలలో కేసీఆర్ ఎన్నో ఆశలు రేకెత్తించారు. కోటి ఎకరాలకు నీరు ఇస్తానని చెప్పి వాటిని రూపొందించారు. కేసీఆర్ కు ఇరిగేషన్ పై మంచి పట్టు ఉన్న మాట నిజమే. అవి పూర్తయి ప్రజలకు సజావుగా ఉపయోగపడితే సంతోషించవలసిందే. కెసిఆర్ వాస్తు నమ్మకాలు, ఇతర కారణాల వల్ల కొన్ని అనవసర పనులు చేస్తున్నారన్న అభిప్రాయం కలుగుతుంది. ఉన్న సచివాలయం కూల్చి కొత్తది కట్టడం అందుకు 200 కోట్లు వ్యయంచేయడం వంటి ప్రయత్నాలు విమర్శలకు దారి తీసే అవకాశం ఉంది. ఏ కారణంగానో కొత్త సచివాలయం నిర్మాణ కార్యక్రమం ప్రస్తుతం వార్తల్లో లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కువ రోజులు ఫామ్ హౌస్ లో, ప్రగతిభవన్ లో ఉంటున్నారన్న విమర్శలను ఎదుర్కుంటున్నారు. అలాగే ఎవరైనా ఆయనను కలవాలంటే అప్పాయింట్ మెంట్ దొరకడం కష్టం అన్న భావన ఉంది.కేబినేట్ లో మహిళలకు ప్రాతినిధ్యం లేకపోయినా తన మాటకు ఎదురులేనట్టు భావిస్తున్నందున కెసిఆర్ ను సొంత పార్టీ లో ప్రశించే వారు లేరు.