‘ఒక వైపే చూడు’ నేనే ఎమ్మెల్యే – నేనే సీఎం

‘ఏకగ్రీవాల’ సంగతేమిటని, ‘ప్రతిజ్ఞల’ మాటేమిటని ఎవరికైనా అనుమానం రాక మానదు. ఇదొక సరికొత్త ఆధునిక వ్యూహం. సరికొత్త కళ. ప్రజాభిప్రాయాన్ని అనుకూలంగా మలచడానికి జరుగుతున్న ప్రయత్నం. ప్రతిపక్షాలను, రాజకీయ ప్రత్యర్థులతో ‘మానసిక యుద్ధం’ చేయడంలో కేసీఆర్ నేర్పరి. మొనగాడు. ఏ గ్రామంలోనైనా ఒకరో, ఇద్దరో టిఆర్ఎస్ వ్యతిరేకులు కావచ్చు, కాంగ్రెస్ అభిమానులు కావచ్చు, లేదా మరేదైనా రాజకీయ అభిప్రాయాలతో ఉండవచ్చు…. పూర్తిగా లేకుండా ఎలా పోతారు? తమకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాలేదనో, మూడెకరాల భూమి రాలేదనో, ఉద్యోగం రాలేదనో, లేదా మరో పని జరగలేదనో, మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో పెరిగిపోయిన ‘అవినీతి కాటు’కు గురయ్యామనో, స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోలేదనో, దురుసుగా – అహంకారపూరితంగావ్యహరిస్తున్నాడనో, కాంట్రాక్టులు – లంచాలతో వందల కోట్లకు పడగెత్తాడనో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక అభిప్రాయం ఏర్పరచుకునే స్వేచ్ఛ, హక్కు ప్రజలకు ఉన్నది. అది రాజ్యాంగం కల్పించింది. టిఆర్ఎస్ ప్రభుత్వం కల్పించినది కాదు. అయితే అటువంటి అభిప్రాయం బలపడకుండా, అది సమీకృతం కాకుండా ‘ఏకగ్రీవ’ తీర్మానాలు పనికొస్తాయి. ‘ప్రతిజ్ఞ’ లు పనికొస్తాయి. మిగతా ప్రజలంతా అధికార పక్షము వైపే ఉన్నప్పుడు తాము కూడా ‘అదే దారిలో’ వెళ్లాలని అసంతృప్తితో ఉన్న జనం ‘మానసికంగా’ సిద్ధం కావడం సహజం. పైగా ఒక గ్రామంలో మూకుమ్మడిగా ప్రజాభిప్రాయం ఒకే విధంగా ఉంటె, ఉన్నట్లు ప్రచారం జరిగితే చుట్టుపక్కల మరికొన్ని గ్రామాలపైనా దాని ప్రభావం పడుతుంది. పరిసర గ్రామాల్లో వివిధ రంగాల్లో, వృత్తుల్లో ఉన్న ప్రజలను ప్రభావితం చేస్తుంది. నిస్సందేహంగా ఇదొక కొత్త టెక్నిక్కు. ప్రభుత్వ అనుకూల ప్రసార సాధనాలు, పత్రికల్లో ‘పల్లెలెట్లకదులుతున్నయంటే’ అంటూ విస్తృతంగా ప్రచారం లభిస్తున్నది. ‘కారు’ గుర్తును మరచిపోకుండా పదే, పదే గుర్తు చేస్తున్నారు.

 

ఎస్.కె.జకీర్.
‘టిఆర్ఎస్ కే మా ఓటు’ అంటూ గ్రామాలకు, గ్రామాలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేస్తున్నవి. ప్రజలు టివిచానళ్ల కెమెరాల ముందుకు వచ్చి ‘ప్రతిజ్ఞ’ చేస్తున్నారు. ఈ దృశ్య, శ్రవణ వార్తా కథనాలు పుంకానుపుంఖాలుగా వస్తున్నవి. ”మా ఇంటి ఓట్లు కారు గుర్తు కే” అంటూ మరికొన్ని గ్రామాల్లో గోడ మీద రాతలు కనిపిస్తున్నవి. ఇదొక కొత్త ట్రెండ్. గతంలో ఇటువంటి వార్తలు చాలా అరుదుగా ఎక్కడో, ఎదో ఒక చోట మాత్రమే కనిపించేవి. లేదా వినిపించేవి. అది కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే, లేదా ఎంపీ అభ్యర్థి పనితీరు అద్భుతంగా ఉండి, ప్రజల తలలో నాలుక వలె వ్యవహరించిన నియోజకవర్గాల్లో ‘మూకుమ్మడి’ తీర్మానాలో, ప్రతిజ్ఞలో ఉండేవి. ఇప్పుడలా కాదు. ఇది కేసీఆర్ శకం. ఇది కేసీఆర్ యుగం. ‘ఏకగ్రీవ’ తీర్మానాలు కొన్ని చోట్ల ప్రజలు స్వచ్ఛందంగా చేస్తుండవచ్చును. మరికొన్ని చోట్ల ‘బలవంతంగా’ కూడా తీర్మానం తంతుజరుగుతుండవచ్చును. సిద్ధిపేట జిల్లా ఇబ్రాహీంపూర్ గ్రామం ఏకగ్రీవంగా తీర్మానించిందంటే ఎవరు అనుమానించరు. ఆ గ్రామం అనేక ప్రమాణాలలో జాతీయ స్థాయిలో పలు అవార్డులు సొంతం చేసుకున్నది. అది మంత్రి హరీశ్ దత్తత గ్రామం.ఇటీవల ఆయన భావోద్వేగానికి గురై రాజకీయాలపై వైరాగ్యాన్ని ప్రకటించింది అక్కడే. ఇక కొన్ని గ్రామాల్లో ‘బలవంతపు’ ఏకగ్రీవ తీర్మానాల కథ నడుతున్నది. టిఆర్ఎస్ తరపున పోటీ చేసే అభ్యర్థులందరికీ ఇదొక ఫ్యాషన్ గా మారింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ టిఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ‘నిర్వాకం’ మీడియాలో దుమారంగా మారింది. మరకల్ గ్రామస్థులు టిఆర్ఎస్ కు ఓటు వేస్తామని ‘ఏకగ్రీవ తీర్మానం’ చేసేందుకు ఆయన 5 లక్షల రూపాయలను ఇవ్వజూపడం విమర్శల పాలైంది. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కు రవీందర్ రెడ్డి పై కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ” ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి వచ్చినా టిఆర్ఎస్ వంద సీట్ల కన్నా ఎక్కువ సీట్లు గెల్చుకుంటుంది. మా సర్వేలో 82 నియోజకవర్గాల్లో 60 శాతం పైబడి ఉన్నాం. 100 నియోజకవర్గాలలో ఫిఫ్టీ పర్శంట్కంటే ఎక్కువే ఉన్నాం. ప్రజల మీద మాకు నమ్మకం ఉన్నది. మేమట్లమెదిలినం. మాకు సమీపంలో ఏ పార్టీ లేదు. కాంగ్రెస్, తెలుగుదేశం పొత్తు జుగుప్సాకరం . ఎన్నికల తర్వాత వాళ్ళ తల పగులుతుంది. టిడిపి ఎక్కడా లేదు. 17 సర్వేలు చేయించాం.

టిడిపితో పొత్తు పెట్టుకుంటే డిపాజిట్లు కూడా రావు” అని టిఆర్ఎస్ నిర్మాత కేసీఆర్ సెప్టెంబర్ 6 వ తేదీ సాయంత్రం 105 మంది పార్టీ అభ్యర్థులను ప్రకటించినప్పుడు విలేకరులతో అన్నారు. ఆయన కథనం ప్రకారమే 100 కు పైగా సీట్లలో ‘వార్ వన్ సైడ్’ అవుతుందని ఆ పార్టీలోనే నమ్మే వాళ్ళున్నారు, నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ ‘ఏకగ్రీవాల’ సంగతేమిటని, ‘ప్రతిజ్ఞల’ మాటేమిటని ఎవరికైనా అనుమానం రాక మానదు.ఇదొక సరికొత్త ఆధునిక వ్యూహం. సరికొత్త కళ. ప్రజాభిప్రాయాన్ని అనుకూలంగా మలచడానికి జరుగుతున్న ప్రయత్నం. ప్రతిపక్షాలను, రాజకీయ ప్రత్యర్థులతో ‘మానసిక యుద్ధం’ చేయడంలో కేసీఆర్ నేర్పరి. మొనగాడు. ఏ గ్రామంలోనైనా ఒకరో, ఇద్దరో టిఆర్ఎస్ వ్యతిరేకులు కావచ్చు, కాంగ్రెస్ అభిమానులు కావచ్చు, లేదా మరేదైనా రాజకీయ అభిప్రాయాలతో ఉండవచ్చు…. పూర్తిగా లేకుండా ఎలా పోతారు? తమకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాలేదనో, మూడెకరాల భూమి రాలేదనో, ఉద్యోగం రాలేదనో, లేదా మరో పని జరగలేదనో, మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో పెరిగిపోయిన ‘అవినీతి కాటు’కు గురయ్యామనో, స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోలేదనో, దురుసుగా – అహంకారపూరితంగావ్యహరిస్తున్నాడనో, కాంట్రాక్టులు – లంచాలతో వందల కోట్లకు పడగెత్తాడనో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక అభిప్రాయం ఏర్పరచుకునే స్వేచ్ఛ, హక్కు ప్రజలకు ఉన్నది. అది రాజ్యాంగం కల్పించింది. టిఆర్ఎస్ ప్రభుత్వం కల్పించినది కాదు. అయితే అటువంటి అభిప్రాయం బలపడకుండా, అది సమీకృతం కాకుండా ‘ఏకగ్రీవ’ తీర్మానాలు పనికొస్తాయి. ‘ప్రతిజ్ఞ’ లు పనికొస్తాయి. మిగతా ప్రజలంతా అధికార పక్షము వైపే ఉన్నప్పుడు తాము కూడా ‘అదే దారిలో’ వెళ్లాలని అసంతృప్తితో ఉన్న జనం ‘మానసికంగా’ సిద్ధం కావడం సహజం. పైగా ఒక గ్రామంలో మూకుమ్మడిగా ప్రజాభిప్రాయం ఒకే విధంగా ఉంటె, ఉన్నట్లు ప్రచారం జరిగితే చుట్టుపక్కల మరికొన్ని గ్రామాలపైనా దాని ప్రభావం పడుతుంది. పరిసర గ్రామాల్లో వివిధ రంగాల్లో, వృత్తుల్లో ఉన్న ప్రజలను ప్రభావితం చేస్తుంది. నిస్సందేహంగా ఇదొక కొత్త టెక్నిక్కు. ప్రభుత్వ అనుకూల ప్రసార సాధనాలు, పత్రికల్లో ‘పల్లెలెట్లకదులుతున్నయంటే’ అంటూ విస్తృతంగా ప్రచారం లభిస్తున్నది. ‘కారు’ గుర్తును మరచిపోకుండా పదే, పదే గుర్తు చేస్తున్నారు. ప్రజలు మరో ఆలోచన చేయకుండా, వారిలో కొత్త ఆలోచన ఏదీ రాకుండా నియంత్రించడం టిఆర్ఎస్ నిర్మాత కేసీఆర్ వ్యూహం. ‘పాజిటివ్ ఓటు బ్యాంకు’ ల సమీకరణకు ఈ తంత్రం గొప్పగా పనిచేస్తుంది. ఇప్పటిదాకా తమకు నెరవేరని కోరికలేవైనాఉంటె వచ్చే ప్రభుత్వంలో, రెండో టర్మ్ లో నెరవేరతాయని ప్రజలు ఆశలు పెట్టుకోవచ్చును. కాగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూటమి నిర్మాణ దశలో ఉన్నది.

‘కూటమి’ నిర్మాణం తర్వాత ఆయా కూటమి భాగస్వాముల మధ్య ‘ఓట్ల బదిలీ’ ఎలా జరుగుతుందన్న అంశంపై మిశ్రమ స్పందన ఉన్నది. ఇవన్నీ కేసీఆర్ కు బాగా తెలుసు. అందువల్ల ఆయన అక్టోబర్ 3 నుంచి తొలి విడత ఉమ్మడి జిల్లా కేంద్రాలలో ఎన్నికల ప్రచారసభలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ లోగా గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో ‘పాజిటివ్’ వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి, ప్రజలంతా టిఆర్ఎస్ వైపే ఉన్నారని చెప్పడానికి ఏకగ్రీవ తీర్మానాలు, ప్రతిజ్ఞలు వంటి బహిరంగ ‘ప్రదర్శన’ లు జరుగుతున్నవి. కానీ పలువురు అభ్యర్థులు ప్రజల ‘తిరస్కారానికి’ గురవుతున్న విషయాన్ని కూడా మరచిపోరాదు. ఆలేరులో గొంగిడి సునీత, నిజామాబాద్ రురల్ లో బాజిరెడ్డి గోవర్ధన్, బాల్కొండ లో ప్రశాంతరెడ్డి, ఇంకా మరికొన్ని చోట్ల ప్రజల్లో ఆయా ‘సిట్టింగ్’ లపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ప్రకటిత 105 మందిలో ప్రజల్లో ‘వ్యతిరేకతను’ సంపాదించుకున్నవారెందరన్నది ఇప్పుడే తేలదు. కాంగ్రెస్ కూటమి సంపూర్ణంగా రంగంలోకి దిగిన తర్వాత ఆ కూటమి ఇచ్చే హామీలపై కుదిరే నమ్మకాన్ని బట్టి, జరిగే పోరాటాన్ని బట్టి ఉంటుంది. పోలింగు ముగిసి, ఓట్ల లెక్కింపు పూర్తికావలసి ఉంటుంది. సరే, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైనా, వారి వ్యవహార శైలి ఎట్లా ఉన్నా 100 సీట్ల గెలుపు బాధ్యతను కేసీఆర్ తన భుజాలకు ఎత్తుకున్నందున ఆయన సిట్టింగులపై ఉన్న ‘యాంటీ ఇంకంబెన్సీ’ ని చిత్తు చేసే ఎత్తుగడలేవో రచిస్తూ ఉండవచ్చు. తనను చూసి ఓటు వేయాలని కేసీఆర్ ప్రజల్ని కోరనున్నారు. తనను నమ్మాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే ప్రజలు కేసీఆర్ ను చూసి, ఆయనను నమ్మి ఓటు వేయవచ్చు…. కానీ తాము రోజువారీ సమస్యలు ఎవరితో చెప్పుకోవాలి? ఎవరు పరిష్కరించగలరు? తమకు అందుబాటులో ఉండే మనిషి ఎవరు? ప్రగతి భవన్ తలుపులు ‘సెకండ్ ఇన్నింగ్స్’ లో సామాన్య ప్రజల కోసం తెరచుకోగలవా? లేక తమ పట్ల కనీసం మర్యాద పాటించని, తమ గోడు వినని ఎమ్మెల్యేలు ఈ సారి ‘పరిశుద్ధాత్మ’ గా మారతారా? మొదటి టర్మ్ లో లేని అనుభవం రెండో టర్మ్ లో సదరు ఎమ్మెల్యేకు వస్తుందా ? కనీసం రెండు డజన్ల మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రజాదరణ తక్కువగా ఉన్నట్టు నివేదికలు అందినా వారిని మార్చకపోవడం…. తాను చేసిన సంక్షేమ కార్యక్రమాలు, తన మీద ప్రజల్లో ఉన్న అభిమానం పట్ల కేసీఆర్ కు ఉన్న కొండంత విశ్వాసమే కారణం. అందుకే తానే ఎమ్మెల్యే – తానే సిఎం అనే ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు.