ఓబీసీ బిల్లు కు ఆమోదం.

న్యూఢిల్లీ:
ఓబీసీ (సవరణ) బిల్లు, 2017కు రాజ్యసభ ఆమోదం తెలిపింది. వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్‌ (ఎన్‌సీబీసీ)కి రాజ్యాంగ హోదా కల్పించే ఈ బిల్లును గత వారం లోక్‌సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. వెనుకబడిన కులాల సంక్షేమానికి మోదీ సర్కార్‌ కట్టుబడిందనే సంకేతాలను పంపుతూ ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) ప్రయోజనాలను పరిరక్షించేలా, వారి హక్కులను కాపాడేందుకు పూర్తి అధికారాలను ఎన్‌సీబీసీకి కట్టబెడుతూ దానికి రాజ్యాంగ హోదా కల్పించే బిల్లును ఆమోదింపచేయడం ప్రభుత్వ విజయంగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
కాగా మీడియా సంస్థల్లో జోక్యం చేసుకోవడం ద్వారా కేంద్రం దేశంలో సూపర్‌ ఎమర్జెన్సీని విధిస్తోందని తృణమూల్‌ నేతలు ఆరోపిస్తూ పార్లమెంట్‌ వెలుపల నిరసనలు చేపట్టారు. అసోంలో ఎన్‌ఆర్‌సీ అమలును తృణమూల్‌ నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వానికి వ్యతిరేక కథనాలు ప్రసారం చేసే మీడియా సంస్థలపై బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ పరువు నష్టం కేసులు వేయడం వంటి చర్యలు చేపడుతున్నదని తృణమూల్‌ ఎంపీ డెరెక్‌ ఒబ్రెయిన్‌ ఆరోపించారు