ఓబీసీ వర్గీకరణపై కేంద్రం వెనక్కి.

ప్రకాశ్,న్యూఢిల్లీ:

దళిత అనుకూల విధానాలకు అగ్రవర్ణాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిన సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు మరికొన్ని నెలలే ఉండటంతో ఎలాంటి కుల వర్గీకరణలు చేపట్టేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. ఓబీసీ ఉప వర్గీకరణ రిపోర్ట్ కొంత కాలం వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఓబీసీ ఉప వర్గీకరణ కోసం జస్టిస్ జి. రోహిణ నేతృత్వంలో నియమించిన కమిటీ ఇప్పటికే తన మధ్యంతర నివేదిక ఇవ్వాలి. కానీ అలా జరగలేదు. కొంత కాలం పాటు రిపోర్ట్ ఇవ్వొద్దని కమిటీకి సూచించినట్టు తెలిసింది. ఓబీసీ ఉప వర్గీకరణపై మధ్యంతర రిపోర్ట్ పై ప్రజాభిప్రాయ సేకరణ జరిపి తుది నివేదిక తయారు చేయాల్సి ఉంది.ఇటీవల సుప్రీంకోర్ట్ ఆదేశాల మేరకు ఎస్సీ ఎస్టీ చట్టాన్ని తిరిగి అమలు చేయడంపై అగ్రవర్ణాలు ఆగ్రహం చేశాయి. ముఖ్యంగా త్వరలో ఎన్నికలు జరగాల్సిన మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో తీవ్ర వ్యతిరేకత రావడంతో బీజేపీ వెనక్కి తగ్గింది. ఇప్పుడు ఓబీసీ ఉప వర్గీకరణ జరిగితే తమ వాటా తగ్గిపోతుందని బలమైన ఓబీసీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పుడు రిపోర్ట్ బయటపెడితే అగ్రకులాలతో పాటు, ఈ వర్గాల ఆగ్రహాన్ని రుచి చూడాల్సి ఉంటుందని అధికార పక్షం వెనుకాడుతున్నట్టు తెలుస్తోంది.బలహీన ఓబీసీలను ఆకట్టుకొనేందుకు ఓబీసీ ఉప వర్గీకరణను ముందుకు తెచ్చారు. దీనివల్ల ఓబీసీ జాబితాలో మరింత వర్గీకరణ జరగనుంది. ఇప్పటి వరకు దాదాపుగా 30-35 ఓబీసీ వర్గాలు మాత్రమే కోటా ఫలితాలు పొందుతున్నాయి. ఉప వర్గీకరణ జరిగితే జనాభా దామాషాలో దాదాపుగా 27 శాతం కోటా బలహీన ఓబీసీలకు కేటాయించే అవకాశం ఉంది. ఉప వర్గీకరణ కమిషన్ ఓబీసీలను ‘వెనుకబడిన’ ‘బాగా వెనుకబడిన’ ‘అత్యంత వెనుకబడిన’ అనే కేటగిరీలుగా విభజించాలని సిఫార్సు చేసే అవకాశం ఉంది.