కన్న కూతురిపై తండ్రి అత్యాచారం. తల్లి సహకారం.

చంద్రగిరి మండల ఎం.కొంగరవారిపల్లెకు చెందిన ఓ జీపు డ్రైవరు కుమార్తె తిరుపతిలోని ఓ ప్రైవేటు కళాశాల్లో బీకాం కంప్యూటర్స్‌ తృతీయ సంవత్సరం చదువుతోంది. మూడేళ్లుగా ఈ విద్యార్థినిపై ఆమె తండ్రి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. మద్యానికి బానిసైన అతను మూడేళ్ల క్రితం యువతిపై తొలిసారి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

చిత్తూరు:
కామంతో కళ్లు మూసుకుపోయి కన్న కూతురు పైనే మూడేళ్లుగా అత్యాచారం చేస్తున్న కీచక తండ్రిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అలాగే కన్న తండ్రి అకృత్యం గురించి చెప్పినా సర్థుకుపోమంటూ భర్తకు పరోక్షంగా సహకరించిన బాధితురాలి తల్లిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విలేకరుల సమావేశంలో సీఐ సురేంద్ర నాయుడు నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించారు…చంద్రగిరి మండల ఎం.కొంగరవారిపల్లెకు చెందిన ఓ జీపు డ్రైవరుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె తిరుపతిలోని ఓ ప్రైవేటు కళాశాల్లో బీకాం కంప్యూటర్స్‌ తృతీయ సంవత్సరం చదువుతోందన్నారు. మూడేళ్లుగా ఈ విద్యార్థినిపై ఆమె తండ్రి అత్యాచారానికి పాల్పడుతున్నాడని సిఐ తెలిపారు. మద్యానికి బానిసైన అతను మూడేళ్ల క్రితం యువతిపై తొలిసారి అఘాయిత్యానికి పాల్పడ్డాడన్నారు.

యువతి వ్యతిరేకించడంతో ఆమెపై, ఆమె తల్లిపై దాడి చేసి వారిని భయభ్రాంతులకు గురిచేసినట్లు తెలిపారు. తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే కుటుంబ పోషణ భారమవుతుందన్న ఉద్దేశంతో వారు ఎవరికీ చెప్పుకోలేదని తెలిపారు. దీంతో ఇతడు మూడేళ్లుగా కూతురుపై అత్యాచారం చేస్తూ వచ్చాడని సిఐ తెలిపారు. చివరకు తన తండ్రి చేసే అఘాయిత్యాన్ని తట్టుకోలేక యువతి ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఆమె తన దూరపు బంధువుకు తన దుస్థితి గురించి చెప్పడంతో ఆమె సూచనల మేరకు యువతి ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.యువతి ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నమ్మలేని నిజాలు బైటపడ్డాయన్నారు. నిందితుడు తన కూతురిపై మూడేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నట్లు అంగీకరించినట్లు సిఐ తెలిపారు. నిందితుడి నుంచి తగిన సాక్ష్యాలను సేకరించడం జరిగిందని చెప్పారు. బాధిత యువతిని మెడికల్‌ పరీక్షల అనంతరం తిరుపతిలోని ఓ హోంకు తరలించినట్లు తెలిపారు. అలాగే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు తన అత్తను సైతం హతమార్చినట్లు తెలిసిందన్నారు. ఆ కోణంలోనూ విచారణ జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిందితుడి పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.