కరీంనగర్ కీర్తికిరీటంలో మరో కలికితురాయి.

కరీంనగర్:

నగరానికి అద్భుత ప్రాజెక్టును కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీసుకువచ్చారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా జెట్ స్కీలు, హైస్పీడ్ బోటు, క్రూయిజర్ ను కరీం”నగరానికి” మంజూరు చేయించారు.
ఇప్పటికే జెట్ స్కీలు నగరానికి చేరాయి. పర్యాటకులకు ఎంతో ఆహ్లాదాన్ని కల్గించే ఈ సౌకర్యాన్ని అక్టోబర్ మూడో తేదీన ప్రారంభించనున్నారు.గతంలో టూరిజం అంటే సముద్రం ఒడ్డున ఉన్న ప్రాంతాలు, లేదా కొండగుట్టలు మాత్రమే జ్ఞప్తికి వచ్చేవి. కానీ అలాంటి చరిత్రను తిరగరాసేందుకు కరీంనగర్ తాజా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేసిన కృషి ఫలించింది. ఎక్కడో గోవాలోనో బ్యాంకాక్ లోనో మాత్రమే చూసిన జెట్ స్కీలు, హైస్పీడ్ బోట్లను కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంలో విహరింపచేసేందుకు ఆయన ప్రత్యేక చొరవ తీసుకొని మంజూరు చేయించారు. మానేరు జలాశయం కొత్త శోభను సంతరించుకోనుంది. రెండు జెట్ స్కీలు, ఆరుగురు ప్రయాణించగలిగే ఒక హైస్పీడ్ బోటు, 100 మంది ప్రయాణించగలిగే ఒక క్రూయిజర్ ను ఈ పథకంలో చేర్చారు. వీటి నిర్వహణకు మానేరు వద్ద ప్రత్యేకమైన జెట్టీని ఏర్పాటు చేస్తున్నారు. రెండు కోట్ల యాభై లక్షల రూపాయల ఖర్చుతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల అవుతున్న ప్రత్యేక నిధుల్లోంచి కోటిన్నర రూపాయలను, రాష్ట్ర పర్యాటక శాఖ నుంచి మరో కోటి రూపాయలను ఈ పథకానికి కేటాయించారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఈ సౌకర్యాన్ని కరీంనగర్ లో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రెండు జెట్ స్కీలు కరీంనగర్ చేరుకున్నాయి.

బోట్లు ఆగేందుకు, పర్యాటకులు ఎక్కేందుకు వీలుగా నిర్మించే జెట్టీ నిర్మాణ పనులు ఆదివారం నుండి ప్రారంభం కానున్నాయి. కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్, తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఈ జెట్ స్కీలను పరిశీలించారు. మరో రెండ్రోజుల్లో హైస్పీడ్ బోటును కూడా నగరానికి చేర్చనున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ ఎండీ మనోహర్ కరీంనగరానికి వచ్చి మానేరు జలాశయం వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తారు. సోమ, మంగళవారాల్లో బోట్లను ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. 200 మందితో ఈ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు.అనంతరం అక్టోబర్ మూడో తేదీన ఈ అద్భుత పర్యాటక ప్రాజెక్టును పర్యాటక శాఖ ఎంపీ మనోహర్, యూత్ ఆండ్ కల్చరల్ కార్యదర్శి బుర్ర వెంకటేశ్వర్లు కలిసి ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఎల్ఈడీ లైట్లతో జిగేల్ మంటున్న ఎల్ఎండీ పరిసర ప్రాంతాలు ఈ బోట్లతో మరింత అందంగా మారనున్నాయి. త్వరలోనే రిసార్టుల నిర్మాణం కూడా చేపట్టనున్నారు. పర్యాటక అభివృద్ధికి ఎంతగానో తపిస్తున్న తాజా మాజీ ఎమ్మేల్యే గంగుల కమలాకర్ నిరంతర కృషితో ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు మంజూరైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో లేని చక్కటి పర్యాటక సౌకర్యం కరీంనగరానికి మంజూరు కావడం నగర వాసులందరికీ గర్వకారణం.