కళ్ళతో రాసిన పుస్తకం.

లండన్:
ఆ అబ్బాయి పేరు జొనాథన్ బ్రయాన్. వయసు 12 ఏళ్లు. కానీ జొనాథన్ నోరు తెరిచి ఒక్క మాటైనా మాట్లాడలేడు. కలం పట్టి కాగితంపై రాయలేడు. పుట్టుకతో సెరిబ్రల్ పాల్సీ వ్యాధిగ్రస్తుడైన బ్రయాన్ ఎంతో కష్టపడితే కొన్ని అవయవాలను కొంత వరకు కదల్చగలడు. తల్లిదండ్రులు కూడా చిరునవ్వు, ముఖం చిట్లించడం వంటి అతితక్కువ హావభావాలతో అతనితో సంభాషిస్తారు. స్కూల్లో చేరుద్దామని తీసుకెళ్తే చదవడం, రాయడం అతనికి చాలా కష్టం కనుక చేర్చడం వృథా అని మొహానే చెప్పేశారు. ఇక జొనాథన్ బ్రయాన్ జీవితం వీల్ ఛెయిర్ కే అంకితం అని అందరూ ఫిక్సయిపోయారు.చూస్తూ చూస్తూ కన్నకొడుకుని అలా గాలికి వదిలేయడానికి జొనాథన్ తల్లి చంటాల్ బ్రయాన్ మనసొప్పలేదు. పట్టుదలగా బ్రయాన్ ని స్కూలుకి తీసుకెళ్లేది. మధ్యలో కొన్ని గంటలు బయటికి తీసుకెళ్లి చదవడం, రాయడం నేర్పించింది. 9 ఏళ్లు వచ్చేసరికి జొనాథన్ తను అనుకున్నది చెప్పగలిగే స్థాయికి వచ్చాడు. ఇప్పుడు అతను ఈ-ట్రాన్ ఫ్రేమ్ అనే పరికరం సాయంతో ఇతరులతో సంభాషించడమే కాదు.. ఏకంగా ఓ పుస్తకాన్నే రాశాడు.ఇంగ్లాండ్ లోని విల్ షైర్ లో నివసించే జొనాథన్ తన కళ్లతో అక్షరాలు రాస్తాడు. తన ముందున్న ఈ-ట్రాన్ ఫ్రేమ్ లోకి చూస్తాడు. చూసేందుకు పారదర్శక ప్లాస్టిక్ బోర్డులా కనిపించే ఈ-ట్రాన్ ఫ్రేమ్ లో అక్షరాలు, రంగుల కోడింగ్ సిస్టమ్ ఉంటాయి. కనుగుడ్లు కదిల్చి అనుకున్న అక్షరాన్ని టైప్ చేస్తాడు. అలా పదాలు, అక్షరాలు టైప్ చేసి జొనాథన్ రాస్తాడు. మనుషులతో సంభాషిస్తాడు. తన గురించి తానే రాసుకున్న ‘ఐ కెన్ రైట్‘ పుస్తకం ద్వారా పాఠకులకు మన మదిలోని భావాలను వివరించాడు ఈ బుల్లి రచయిత. తల్లి దృక్కోణం నుంచి ప్రారంభించి మొదట తను ఎలా విద్యాభ్యాసం సాగించాడో చెబుతాడు బ్రయాన్. ఆ తర్వాత తన కోణం నుంచి జీవితాన్ని చూపిస్తాడు. తన జీవితంలో కీలక భాగమైన క్రిస్టియానిటీ గురించి అభిప్రాయాలు చెబుతాడు.ఈ పుస్తకాన్ని రాసేందుకు జొనాథన్ బ్రయాన్ కు ఏడాది కాలం పట్టింది. జూలై 12న విడుదలైన ఈ రచనకు పాఠకుల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. దీంతో పుస్తక రచనకు తను పడిన కష్టం ఫలించినట్టు భావిస్తున్నాడు చిన్నారి జొనాథన్. తనలాంటి వాళ్ల కోసమే ఈ పుస్తకం రాశానని.. నోరు లేని వాళ్ల గొంతుకగా తను మారానని చెప్పాడు. ఇక తల్లి చంటాల్ అయితే ఆనందంతో పొంగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లోని పిల్లలు, వాళ్ల తల్లిదండ్రులు తన కొడుకు రాసిన పుస్తకం నుంచి కొంత స్ఫూర్తి పొందుతారనే ఆశాభావం వ్యక్తం చేస్తోంది. తన కొడుకు శరీరం పనిచేయలేక పోవచ్చు కానీ అతని మెదడు చాలా చురుగ్గా పని చేస్తోందని అందరికీ తెలిసొచ్చిందని చెప్పింది.