కాంగ్రెస్‌ కూటమి రాజకీయాలు

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. తెలంగాణాలో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు రంగం సిద్ధం చేసుకున్న నేపథ్యంలో ఎన్నికల సెగ పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను తాకుతోంది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ బ్యాలెట్‌ పోరులో ప్రత్యర్ధులుగా నిలబడే ఉన్నారు. గత ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టపోయిన పరిస్థితికి వచ్చిన కాంగ్రెస్‌ ఈసారి పరువు దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు మొన్నటి రాహుల్‌ గాంధీ సభ స్పష్టం చేస్తోంది. ఏఐసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత మొదటి సారి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు రాహుల్‌. కర్నూలు జిల్లాలో దాదాపు ఐదు గంటల పాటు సుడిగాలి పర్యటన చేశారు. సమయ పాలనలో కచ్చితత్వాన్ని పాటించే రాహుల్‌ హెలిపాడ్‌ దిగీ దిగగానే పెద్దపాడు గ్రామంలోని మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య నివాసానికి చేరుకున్నారు. ఒంటి గది రేకుల షెడ్డు అది. ఒక అల్మారాలో దుమ్ముకొట్టుకు పోయిన కొన్ని పుస్తకాలు, ఒక కంచం, ఒక ట్రంకు పెట్టె మినహా ఇంకేమి లేని గది లేదంటే ఇల్లు. సంజీవయ్య దేశంలోనే మొదటి దళిత ముఖ్యమంత్రి. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన సతీమణి కృష్ణవేణి కూడా చనిపోయారు. వారికి పిల్లలు లేరు. సొంత సోదరులూ చనిపోయి చాలా కాలం అయ్యింది. సోదరుల పిల్లలు, మనవళ్లు, మనుమరాళ్లు అంటే రెండో, మూడో తరం వారే ప్రస్తుతం ఉన్నారు. సంజీవయ్య రక్త సంబంధికులు ఓ ముఫ్పై మందిని రాహుల్‌ కలిసే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు. ఇన్నేళ్ల తర్వాత హఠాత్తుగా సంజీవయ్యను తలుచుకోవటం, మరీ దగ్గర కాని కుటుంబ సభ్యులను కలుసుకోవటం వెనుక రాజకీయ వ్యూహం లేదనుకోవటం పొరపాటే అవుతుంది. దళితులు కాంగ్రెస్‌ సంప్రదాయ ఓట్‌ బ్యాంక్‌. వైఎస్‌ఆర్‌సీపీ ఆవిర్భవించిన తర్వాత ఈ వర్గం అంతా జగన్‌కు బాసటగా నిలబడుతూ వస్తోంది. గత ఎన్నికల్లో ఈ ప్రభావం చాలా స్పష్టంగా కనిపించింది. దీనితో ఈ వర్గాన్ని ఆకర్షించాల్సిన అవసరం హస్తం పార్టీ పై పడింది. దీనిలో భాగంగానే రాకుమారుడు పెద్దపాడు గ్రామంలోని ఇరుకు రోడ్ల పై నడుచుకుంటూ సంజీవయ్య ఇంటి వరకు వచ్చారు. దీని తర్వాత రాహుల్‌ కర్నూలుకే చెందిన మరో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర రెడ్డి సమాధిని సందర్శించారు. రాయలసీమలో అందులోనూ కర్నూలు రెడ్డి సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువ. ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీ అంటే రెడ్ల పార్టీగా పేరు. అయితే ఇప్పుడు అదే సామాజిక వర్గం నుంచి వచ్చిన జగన్మోహన రెడ్డి పార్టీని ఈ వర్గం తనదిగా భావిస్తోంది. అందుకే రాహుల్‌ కోట్ల సమాధి కిసాన్‌ ఘాట్‌ను సందర్శించటం, ఆయన కుమారుడు, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్‌ రెడ్డి ఇంటికి వెళ్లటం ఎన్నికల ఎత్తుగడలో భాగమే అనేది స్పష్టం. ఇక ఈ సభ నేపథ్యంలో కనిపించిన మూడో వ్యూహం పొత్తు రాజకీయాలు. ఇప్పటికే తెలంగాణాలో కూటమి దిశగా కాంగ్రెస్‌ అడుగులు వేస్తోంది. ఏకంగా బద్ద శత్రువు, మూడు దశాబ్దాలకు పైగా రాజకీయ ప్రత్యర్ధి అయిన టీడీపీతో సైతం దోస్తీకి ఉవ్విళ్లూరుతోంది. సీపీఐ, తెలంగాణా జన సమితి కూడా ఈ కూటమిలో భాగం కానున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే ప్రతిపక్షాలన్నీ ఒకే తాటి పైకి రావాల్సిన అవసరం ఉందనే వాదనను ఖండించలేం. కాని వందేళ్ళకు పైబడిన చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ దృక్కోణం నుంచి చూస్తే ఒంటరి పోరుతో చేతులు కాల్చుకునేందుకు ఆ పార్టీ సిద్ధంగా లేదనిపిస్తోంది. అందుకే సాధ్యమైనంత వరకు పొత్తు రాజకీయాలే లక్ష్యంగా ఎత్తులు వేస్తోంది. ఈ వైఖరి కాంగ్రెస్‌ ఒక్కటే కాదు కమల నాథులు కూడా అవలంబిస్తున్నారు. కాకపోతే ఉత్తరప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ వంటి చోట్ల ఆ పార్టీ మ్యాజిక్‌ ఫిగర్‌ సాధించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. మిగిలిన చాలా చోట్ల పొత్తులతో అధికార పీఠం ఎక్కిన ఉదంతాలే. మరో సారి ఏపీ కాంగ్రెస్‌ దగ్గరకు వస్తే పక్క రాష్ట్రంలో పొత్తు పెట్టుకుంటున్న టీడీపీ పై ఆంధ్రప్రదేశ్‌లో నేతలు గట్టిగా విమర్శలు గుప్పించలేని పరిస్థితి ఏర్పడింది. చివరకు రాహుల్‌ గాంధీ కూడా చంద్రబాబు పేరు కనీసం ప్రస్తావించలేదు. రాష్ట్రంలో పాలనను ఎండ గొట్టే ప్రయత్నం చేయలేదు. విమర్శల దాడులన్నీ ప్రధాని మోడీ పైనే చేశారు. ఒక రాష్ట్రానికి వచ్చిన తర్వాత స్థానిక పరిస్థితులు, స్థానిక ప్రభుత్వాల పని తీరు పై మాట్లాడితే ప్రజలు ఎక్కువగా కనెక్ట్‌ అవుతారు. కేంద్రంలోనే కాకుండా రాష్ట్రాల్లోనూ అధికారంలోకి వచ్చే ప్రయత్నం ఏ పార్టీ అయినా చేస్తుంది. కాని విచిత్రంగా రాహుల్‌ స్థానికంగా టీడీపీ పై ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం కాని, ప్రభుత్వ వ్యతిరేకతను పెంచే ప్రయత్నం కాని చేయకపోవటం విశేషం. పక్క రాష్ట్రంలో ఉన్న పొత్తు ఇబ్బందుల కారణంగా మాట్లాడలేదనుకుంటే అటు ప్రతిపక్ష వైసీపీని కూడా పల్లెత్తు మాట అనకపోవటం వెనుక భవిష్యత్‌ అవసరాలే ఉండి ఉంటాయి అని ఓ అనుమానం.

ఇలా చూసి చూడనట్లు వ్యవహరించటం మినహా ప్రత్యక్షంగా సైకిల్‌తో పొత్తు పెట్టుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఉండదు. అలా చేస్తే అది కురు వృద్ధ కాంగ్రెస్‌కు ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది. ఈ మాత్రం ఎరుక ఆ పార్టీ నేతల్లో లేకపోలేదు. అందుకే ప్రత్యామ్నాయ మార్గాల పై వారు దృష్టి సారిస్తున్నారు. కలిసి వచ్చే పార్టీలు ఏవీ అని వెతుకులాడుతున్నారు. మాజీ మంత్రి వట్టి వసంత కుమార్‌ లాంటి వారు జనసేన నిర్వహించిన సమావేశాలకు హాజరై ఉన్నారు. జనసేన తమతో కలిసి రావాలని ఆకాంక్షిస్తున్నారు. గత ఎన్నికల్లో జనసేన టీడీపీ, బీజేపీతో ఎన్నికల స్నేహం చేసింది. ఈ మధ్య కాలంలో పవన్‌ కళ్యాణ్‌కు, చంద్రబాబుకు కాస్త గ్యాప్‌ వచ్చినట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ గెలుపుకు ఈ ఈక్వేషన్‌ కూడా ఒక కారణం అని భావిస్తున్న హస్తం పార్టీ ఇప్పుడు తాము కూడా అదే లెక్కలో విజయకేతనం ఎగరేయాలని తాపత్రయపడుతోంది. వామపక్షాల వైపు కూడా కాంగ్రెస్‌ ఆశగా చూస్తోంది. మొత్తం మీద చూసుకుంటే ఒంటరి పోరాటం చేయటానికి కాంగ్రెస్‌ సాహసించటం లేదు. ఆ మధ్య జరిగిన కర్ణాటక ఎన్నికలు మారిన కాంగ్రెస్‌ వైఖరికి ఒక ఉదాహరణగా నిలిచాయి. అత్యధిక సీట్లు సాధించి మ్యాజిక్‌ ఫిగర్‌కు దూరంగా ఉండిపోయిన బీజేపీని నిలువరించటానికి జనతాదళ్‌(సెక్యులర్‌)తో చేతులు కలిపింది. తాను 80 స్థానాలు సాధించినా, 37 సీట్లకే పరిమితం అయిన జేడీఎస్‌కు పవర్‌ పగ్గాలిచ్చింది. కుమార స్వామిని సీఎమ్‌ సీటు దక్కేలా చేసింది. దక్షిణాది రాష్ట్రాల్లో చూస్తే తమిళనాడులో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే అవకాశం సమీప భవిష్యత్తులో ఉండదని గట్టిగా చెప్పవచ్చు. కేరళలో కమ్యూనిస్ట్‌ ప్రభుత్వమే ఉంది. కర్ణాటకలో కూటమి తర్వాత తెలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ ఇదే పంథాలో వెళ్లక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి.