కాంగ్రెస్ ఉన్నట్టా? లేనట్టా?

నల్లగొండ;
ఉమ్మడి నల్లగొండలో 16 మంది మృత్యు వాత పడిన ఘోర దుర్ఘటన పై తెలంగాణ పిసిసి నిర్లిప్త వైఖరి విమర్శలకు గురవుతున్నది. అదే జిల్లాకు చెందిన హేమాహేమీలైన కాంగ్రెస్ నాయకులు ఎవరూ దుర్ఘటన ప్రాంతాన్ని సందర్శించలేదు. బాధితులను పరామర్శించలేదు. టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్ఫీ నాయకుడు జానారెడ్డి, ఉత్తమ్ ను ఆ పదవి నుంచి తక్షణం తొలగించాలని రెండురోజుల కోసారి మీడియాలో డిమాండ్ చేసే కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ జాడ లేరు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ స్పందన దారుణంగా ఉన్నట్టు విమర్శలు వస్తున్నవి. హైదరాబాద్ కు పట్టుమని 70 కిలోమీటర్లు కూడా లేని దుర్ఘటనాస్థలానికి ఆ పార్టీ అగ్రనేతలు సందర్శించకపోవడం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఇలాంటి ఆపద సమయాల్లోనే ప్రతిపక్షాలు క్రియాశీలంగా, చురుగ్గా వ్యవహరించవలసి ఉండగా అది ప్రభుత్వ పనిగా గాలికి వదిలేయడం పట్ల కాంగ్రెస్ కార్యకర్తల్లోనూ అసహనం వ్యక్తమవుతున్నది. ప్రజల్లో, పార్టీ క్యాడర్ లో విశ్వాసం కల్గించడానికి ఇలాంటి దుర్ఘటనలు, విపత్తుల సమయాల్లో ప్రతిపక్షం పోషించవలసిన పాత్రను కాంగ్రెస్ పూర్తిగా మరచిపోయిందని కిందిస్థాయి కార్యకర్తలు అంటున్నారు. కాంగ్రెస్ నాయకులు గాంధీభవన్ ప్రెస్ మీట్లకే పరిమితమయ్యారంటూ మంత్రి హరీష్ రావు వంటి నాయకులు తరచూ చేసే ఆరోపణలకు ప్రతిపక్ష నేతల స్పందన బలాన్నిస్తున్నది. ఈ దుర్ఘటన వార్త వినగానే ముఖ్యమంత్రి కేసిఆర్ తీవ్ర దిగ్భ్రాఅంతికి గురయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో వేములకొండ సమీపంలో ఆదివారం ఉదయం మూసీ కాలువలో ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో 16 మంది మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. మృతులంతా వ్యవసాయ కూలీలు. ట్రాక్టర్‌లో 25 మంది కూలీలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని స్థానికులతో సహాయ కార్యక్రమాలు చేపట్టారు. మృత దేహాలను బయటకు తీశారు. మృతి చెందినవారంతా మహిళా కూలీలే. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరిసరప్రాంతమంతా చనిపోయినవారి కుటుంబసభ్యుల రోదనలతో మిన్నంటాయి. రోజువారి కూలీలకు వెళ్లినవారు… ఈ విధంగా మృతి చెందడంతో విసాదం అలుముకుంది. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని సమాచారం అందింది. ట్రాక్టర్ నీటిలో బోల్తా పడడంతో ఎవరూ బయటకు రాలేకపోయారు. నీటిలో మునిగి చనిపోయారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని అధికారులు చెప్పారు. ప్రమాదం జరిగిన అనంతరం ట్రాక్టర్ డ్రైవర్ పారిపోయాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.సంఘటన సమాచారం అందిన వెంటనే నల్లగొండ జిల్లా పర్యటనలో ఉన్న విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఓ దశలో ఆయన బాగా చలించిపోయారు. కంట తడి కూడా పెట్టారు. ట్రాక్టర్ ప్రమాదంలో చనిపోయిన 16 కుటుంబాలను మంత్రి జగదీష్ రెడ్డి, టి ఆర్ ఎస్ శాసన సభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి, వీరేశం ఓదార్చారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా, ఒక్కో కుటుంబానికి డబల్ బెడ్ రూమ్స్ ను మంత్రి జగదీశ్ రెడ్డి ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలను భువనగిరి ఎం.ఎల్.ఏ శేఖర్ రెడ్డి వ్యక్తిగత సహాయంగా ప్రకటించారు. మృతుల కుటుంబంలోని విద్యార్థులకు గురుకుల స్కూళ్లలో చదివే అవకాశం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అంత్యక్రియల కోసం తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి పది వేల రూపాయలను మంత్రి జగదీష్ రెడ్డి, శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి, వీరేశం అందించారు. మృతుల కుటుంబాలను అని విధాలుగా ఆదుకుంటామని కేసీఆర్ ప్రకటించారు.