కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో వృత్తి నిపుణుల భాగస్వామ్యం. –శ్రవణ్‌ .

హైదరాబాద్:
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రణాళిక (మ్యానిఫెస్టో)ను నిపుణుల భాగస్వామ్యంతో రూపొందిస్తామని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన అధికార ప్రతినిధి శ్రవణ్‌ వెల్లడించారు.న్యూఢిల్లీలో శనివారం అఖిల భారత ప్రొఫెషనల్‌ కాంగ్రెస్‌ (ఎఐపిసి) జాతీయ సదస్సులో డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ సమర్పించారు. రాజకీయాల్లో చేరేందుకు, రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు వెనుకాడుతున్న వృత్తి నిపుణుల్లో ఏఐపిసి ఉత్సాహం నింపుతోందని వెల్లడించారు. రాజకీయాలంటే ఆసక్తి చూపడానికి ఏమాత్రం ఇష్టపడని వృత్తి నిపుణులు ఇప్పుడు క్రియాశీలక పాత్ర పోషించేందుకు, వారిలోని సృజనాత్మకతను దేశం కోసం ఉపయోగించేందుకు ఇది గొప్ప వేదికగా నిలిపేలా చేయడం అభినందించదగ్గ పరిణామమని శ్రవణ్‌ చెప్పారు.
ఈ కీలక సదస్సులో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, అఖిల భారత వృత్తి నిపుణుల కాంగ్రెస్‌ (ఎఐపిసి) అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్, కేంద్ర మాజీ మంత్రి మిలింద్‌ దేవరాలతోపాటు దేశ వ్యాప్తంగా వంద మంది నిపుణులు హాజరయ్యారు.
5 వ నవంబర్, 2017 న తెలంగాణ రాష్ట్ర వృత్తి నిపుణుల కాంగ్రెస్‌ విభాగం ప్రారంభమైందని, రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ యూనిట్‌కు బాగా స్పందన లభించిందని, లభిస్తున్న వృద్ధిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందంటూ.. తెలంగాణ యూనిట్‌ గణనీయ పెరుగుదలను తెలియజేశారు. తెలంగాణ యూనిట్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ నాటికి ఏడు చాప్టర్లను ప్రారంభించిందని, ఇందులో సభ్యుల సంఖ్య 432కు చేరడంతో తమలో ఉత్సాహాన్ని మరింత పెంచుతోందన్నారు. మొత్తం 25 ఈవెంట్స్‌ను నిర్వహించామని, ‘పెద్ద నోట్ల రద్దు–కుప్పకూలిన భారత ఆర్థిక వ్యవస్థ, ఈవీఎంల వల్ల అనర్ధాలు–ప్రజాస్వామ్య పరిరక్షణ, బీమా బిల్లు–2017 వల్ల ప్రజలకు నష్టాలు, సమగ్రాభివృద్ధి–లక్ష్యాలు … వంటి 25 అంశాలపై వృత్తినిపుణులతో సదస్సులు నిర్వహించినట్లు డాక్టర్‌ శ్రవణ్‌ చెప్పారు. అవే కాకుండా ఐటీ ఉద్యోగుల హక్కులు–కార్మిక చట్టాలు, విద్య, ఉద్యోగ, ఉపాధి అంశాలపై గ్రూప్‌ల్లో చర్చలు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించామని వివరించారు. ఇవే కాకుండా కథువా, ఉన్నావ్‌ రేప్‌ సంఘటనలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహించామని చెప్పారు.
శ్రవణ్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తూ.. తెలంగాణలోని మొత్తం 17 నియోజకవర్గాలకు ఒకో చాప్టర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. 17 చాప్టర్లకు బదులు తెలంగాణలోని 31 జిల్లాకో ఒక చాప్టర్‌ను వచ్చే మూడు నాలుగు నెలల్లో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అదేవిధంగా కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్నికల ప్రణాళిక రూపకల్పనకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. విద్య, ఉపాధి, ఆరోగ్యం, వ్యవసాయం వంటి కీలక అంశాల వర్క్‌షాపులు నిర్వహిస్తామని చెప్పారు. వృత్తి నిపుణుల సాయంతో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ప్రజల ఎన్నికల ప్రణాళికను రూపకల్పన చేస్తామని, అందుకు తెలంగాణ రాష్ట్రం తరఫున తమ వంతు పాత్ర శక్తివంచన లేకుండా పోషిస్తామని శ్రవణ్‌ హామీ ఇచ్చారు. పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన వాటిపై ప్రతిపాదనల్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి విన్నవించారు. వృత్తి నిపుణులు సేవలు ఉపయోగించుకోవాలని రాహుల్‌గాంధీ చేసిన ప్రతిపాదనను సద్వినియోగం చేసుకుంటామని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించి పారదర్శక ప్రభుత్వం అందించేందుకు దోహదపడతామని శ్రవణ్‌ చెప్పారు.