కాంగ్రెస్ కు ‘చేయి’చ్చిన మాయా!!

 

ప్రకాశ్,న్యూఢిల్లీ:

వచ్చే ఏడాది జరనున్న ఎన్నికల్లో ఎన్డీఏకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటు చేయాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ పెద్ద షాక్ తగిలింది. సాధారణ ఎన్నికలకు ముందు జరుగుతున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ‘హస్తం’తో చేయి కలపరాదని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని బెహన్జీ నిర్ణయించారు. అయితే సార్వత్రిక ఎన్నికల పొత్తు ద్వారాలు మాత్రం తెరిచే ఉంచారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను ప్రశంసల్లో ముంచెత్తారు.ఎట్టి పరిస్థితుల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికలకు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొనేది లేదని బీఎస్పీ అధినేత్రి కుండబద్దలు కొట్టారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లోక్ సభ ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తుని కోరుకుంటున్నారు. వారిద్దరూ నిజాయితీగా ఉన్నారనే భావిస్తున్నానని చెప్పారు. అయితే తాము కోరుకున్నన్ని సీట్లు ఇవ్వనందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అహంకార వైఖరితోనే గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కొన్నేళ్లుగా అధికారానికి దూరమైందని వ్యాఖ్యానించారు. ఈ వైఖరి కారణంగానే కర్ణాటక, ఛత్తీస్ గఢ్ లలో తాము ఇతరులతో కలిసి వెళ్లాల్సి వచ్చిందని మాయా వివరించారు.కొందరు కాంగ్రెస్ నేతలు పొత్తు యత్నాలకు గండికొడుతున్నారని మాయావతి ఆరోపించారు. ‘బీజేపీని సొంతంగానే ఓడిస్తామని వాళ్లు అపోహ పడుతున్నారు. ప్రజలు ఇంకా కాంగ్రెస్ తప్పిదాలు, అవినీతిని మరిచిపోలేకపోతున్నారనే నిజాన్ని గుర్తించడం లేదు. తమ తప్పులు దిద్దుకునేందుకు వాళ్లు సిద్ధంగా లేనట్టున్నార’ని మాయావతి అన్నారు. ‘దిగ్విజయ్ సింగ్ బీజేపీ ఏజెంట్‌ అని.. కేంద్రం మాయావతిపై ఒత్తిడి తెస్తోందని నిరాధార ఆరోపణలు చేస్తున్నార’ని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు తమ నేతలు విముఖంగా ఉన్నట్టు చెప్పారు. ఇప్పటికే మధ్యప్రదేశ్‌లోని 22 అసెంబ్లీ నియోజకవర్గాలకు బీఎస్పీ అభ్యర్థులను మాయావతి ప్రకటించారు. గత నెలలో కాంగ్రెస్ రెబెల్ అజిత్ జోగి సారథ్యంలోని ఛత్తీస్‌గఢ్ జనతా కాంగ్రెస్‌తో కలసి వెళ్లాలని నిర్ణయించారు.