కాంగ్రెస్ కు తుల ఉమ,బీజేపీ కి బొడిగే శోభ!!

ఎస్.కే.జకీర్.

ఆ ఇద్దరు మహిళా నాయకుల నిరీక్షణ ఫలించలేదు. టిఆర్ఎస్ టికెట్ లభించకపోవడంతో తమ దారి తాము చూసుకుంటున్నట్టు తెలుస్తోంది. చివరి నిమిషంలోనైనా అధికార పార్టీ టికెట్లు తమకు దక్కుతాయనుకున్న ఆ ఇద్దరు టిఆర్ఎస్ మహిళా నేతల కు దారులు మూసుకుపోయినవి. చొప్పదండి అధికార టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తుల ఉమ టీఆరెస్ కు గుడ్ బై చెప్పాలని దాదాపు నిర్ణయించున్నారు. ఉమ కాంగ్రెస్ వైపు, శోభ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా 12 స్థానాల్లో అధికార పార్టీ అభ్యర్థులను మొట్టమొదటి లిస్టులోనే ప్రకటించినప్పటికీ. చొప్పదండి అధికార పార్టీ అభ్యర్థిని మాత్రం ప్రకటించలేదు. బొడిగే శోభ కు మొండి చెయ్యి తప్పదని గురువారం మీడియా లో వార్తలు వచ్చాయి.మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ఇంట్లో కొద్దీ రోజుల క్రితం శోభతో కేటిఆర్ చర్చించినారు.అయితే శోభకు కేటీఆర్ నుంచి టిక్కెట్ వస్తుందన్న హామీ దక్కలేదు. చొప్పదండి టిఆర్ఎస్ టికెట్ ను రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ సుంకె రవిశంకర్ కు ఖరారు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తీవ్ర నిరాశకు గురైన మరో మహిళా నేత తుల ఉమ. ఉమ వేములవాడ టికెట్ కోసం మొదటి నుంచి ఆశిస్తున్నారు. టిఆర్ఎస్ అధిష్టానం రమేష్ బాబు పేరునే ఖరారు చేస్తూ మొదటి జాబితాలోనే ప్రకటించింది. మొదట్లో రమేష్ బాబు పేరు ప్రకటించే కంటే ముందే, ఉమ వర్గానికీ, రమేష్ బాబు వర్గానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. వేములవాడ ఎంపీపీపైన అవిశ్వాసం నుంచి మొదలుకొంటే అది ఆగిపోయే వరకు చోటుచేసుకున్న రాజకీయాల నేపథ్యంలో వేములవాడ రాష్ట్రవ్యాప్తంగా దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఉమకి టిక్కెట్ ఇవ్వాలంటూ మేడిపల్లి, కథలాపూర్, చందుర్తి, రుద్రంగి వేములవాడ మండలాల్లో పలువురు ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ నేతలు తీర్మానాలు చేయడం, సమావేశాలు నిర్వహించడం, ర్యాలీల కోసం ప్రయత్నించడం తెలిసిందే. మరికొంతమంది ఓ అడుగు ముందుకేసి రమేష్ బాబుకు టికెట్ ఇస్తే మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ అసమ్మతి జ్వాలల వెనక తుల ఉమ ఉన్నారన్న ప్రచారం కూడా జరిగింది. కెసిఆర్ కు, టిఆర్ఎస్ పార్టీకితాను విధేయురాలిగా ఉన్నానని,కార్యకర్తలు మనోభీష్ఠం, ప్రజలు కోరుకోవడంతోనే తాను టికెట్ ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. టికెట్ రమేష్ బాబుకు కేటాయించినందున ఇప్పుడు మార్చడం కుదరదని కేటీఆర్ తేల్చి చెప్పారు. గత క్యాబినెట్ లో మహిళా మంత్రులెవరినీతీసుకోకుండా.. మహిళల కనీస ప్రాతినిథ్యానికి కూడా గండికొట్టారన్న అపవాదును టీఆర్ఎస్ పార్టీ మూటగట్టుకున్నది. ఉన్న కొందరు మహీళా నేతలను కూడా ఆపార్టీ కోల్పోయే విధానాలను అనుసరిస్తోందా?అన్న అనుమానాలు కలుగుతున్నవి.తీవ్ర నిరాశకు గురైన తుల ఉమ కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నట్టు ప్రచారం గురువారం ప్రారంభమైంది.బొడిగే శోభ బీజేపీ లో చేరనున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.