కాంగ్రెస్ నేతపై ‘రాజద్రోహం’ కేసు!

ప్రకాశ్, న్యూఢిల్లీ:

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై వివాదాస్పద ట్వీట్‌ చేసినందుకు మాజీ ఎంపీ, కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జ్ రమ్య (దివ్య స్పందన)కు భారీ షాక్ తగిలింది. ప్రధాని మోడీపై అభ్యంతరకరంగా ట్వీట్ చేసినందుకు ఆమెపై రాజద్రోహం కేసు నమోదైంది. ప్రధానిని ఉద్దేశించి రమ్య చేసిన ఓ ట్వీట్‌పై వచ్చిన ఫిర్యాదు మేరకు ఉత్తరప్రదేశ్‌లోని గోమతినగర్‌ పోలీసులు ఆమెపై రాజద్రోహం కింద కేసు నమోదు చేశారు. మోడీ తనను పోలిన మరో రూపంపై చోర్‌ అని రాసుకుంటున్నట్టు ఓ మార్ఫింగ్‌ ఫొటోను సోమవారం రమ్య ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ ఫోటో ప్రధానిని కించపరిచేలా ఉందంటూ లక్నోకు చెందిన లాయర్ సయీద్‌ రిజ్వాన్‌ అహ్మద్‌ గోమతినగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గోమతి నగర్ పోలీసులు రమ్యపై సెక్షన్ 67 ఐటీ యాక్ట్.. సెక్షన్ 124 (ఏ) (రాజద్రోహం) కింద కేసు నమోదు చేశారు.ఆమెపై రాజద్రోహం కేసు పెట్టినట్టు ఓ నెటిజన్ రమ్య దృష్టికి తీసుకెళ్లారు. మీపై కేసు నమోదైందని తెలుపగా.. ఓ అవునా.. అయితే మంచిది అంటూ రమ్య వ్యంగ్యంగా జవాబిచ్చారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జ్‌గా ఉన్న రమ్య.. ట్విట్టర్ లో బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. రాఫెల్ డీల్, పెట్రో ధరల పెంపుపై కూడా రమ్య వెటకారంగా ట్వీట్లు చేశారు. ఇప్పుడు అలాగే ట్వీట్‌ చేసి వివాదంలో చిక్కుపడ్డారు.