కాంగ్రెస్ ప్రతి మాటలో దుర్బుద్ధే. -మంత్రి కేటీఆర్.

కాగజ్ నగర్:
సిర్పూర్‌ పేపర్‌ మిల్లుకు ప్రత్యేక పూజలు నిర్వహించి గురువారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పునఃప్రారంభించారు. సిర్పూర్ కాగజ్ నగర్ లో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను ప్రారంభించారు. తెలంగాణలోని నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలిప్పించేందుకు టీఎస్ ఐపాస్ ద్వారా పెద్దసంఖ్యలో పరిశ్రమలను రాష్ట్ర్రానికి రప్పిస్తున్నామని తెలిపారు. కాగజ్ నగర్ మున్సిపాలిటీకి మంత్రి కేటీఆర్ రూ.25 కోట్లు మంజూరు చేశారు. సభా వేదికపైన లబ్ధిదారులకు మంత్రి కళ్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రతి మాటలోనూ దుర్బుద్ధేనని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపించినట్టు ప్రతి పనికి కమిషన్లు వసూలు చేసిన కాంగ్రెస్ నేతలు తాము చేస్తున్న ప్రతి పనిలో తప్పులు వెదికేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఇంటింటికి నల్లా నీళ్లు ఇచ్చే మిషన్ భగీరథను కమిషన్ భగీరథ అంటున్నారని దుయ్యబట్టారు. తెల్లారి లేస్తూనే కాంగ్రెస్ నాయకులు బూతు పురాణం మొదలు పెడుతున్నారని విమర్శించారు. ఆఖరికి ఇళ్లలో చిన్నపిల్లలను సైతం వదలడం లేదని అన్నారు. ప్రజల దీవెనలు మెండుగా ఉన్న తమను వాళ్ల తిట్లు ఏం చేయలేవని చెప్పారు. కేసీఆర్ ని ఇంటికి పంపేవరకు గడ్డం తీయనని ఒకడు శపథం చేశారు.. పేదవాళ్ల సంక్షేమానికి పథకాలు ప్రవేశపెట్టినందుకా కేసీఆర్ ని ఇంటికి పంపించేదని ప్రశ్నించారు.