కాంట్రాక్టర్ల మేలు కోసమే కాళేశ్వరం…

-తుమ్మిడిహెట్‌ ప్రాజెక్టు ఒకటి చాలు
-అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ వ్యర్థం
-గోదావరిఖని కేంద్రంగా పోరాటం ఉదృతం
-జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం

విశ్వనాథ్‌, కరీంనగర్‌ :
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజలకు అవసరమే. ఐతె ఇది ప్రజల కంటే కాంట్రాక్టర్లకే ఎక్కువ లాభాలు తెచ్చిపెడుతోంది. కాంట్రాక్టర్ల కోసమే అంచనాలు పెంచి అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ ఎత్తిపోతలను ఏర్పాటుచేస్తున్నారని తెంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం ఘాటుగా విమర్శించారు. ఆదివారం గోదావరిఖనిలో సంఘసేవకుడు, టిజెఎస్‌ నాయకుడు పెంట రాజేష్‌ నాయకత్వంలో వెయ్యి మందికి పైగా యువకులు కోదండరాం సమక్షంలో టిజెఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ తుమ్మిడిహెట్‌ ప్రాజెక్టు సరిపోతుందన్నారు. తుమ్మిడిహెట్‌ ఎత్తిపోతల నుండి కాళేశ్వరం ప్రాజెక్టుకు మోటార్ల ద్వారా నీరు ఎత్తిపోయవచ్చు అన్నారు. 40 క్యూసెక్కుల నీటిని తెచ్చుకోగలిగితే సరిపోతుందన్నారు. అయితే కాళేశ్వరంపై అంచనాలను పెంచి రూ.లక్ష కోట్ల వరకు డబ్బు వృధా చేసి అదనంగా మూడు చోట్ల ఎత్తిపోతలను ఏర్పాటుచేసి నీళ్లను రివర్స్‌ పంపింగ్‌ ద్వారా ఎస్సారెస్పీ వరకు నీరు తీసుకెళ్తాననడం వృధా ప్రయాస అన్నారు. అవకాశం ఉన్న చోట తుమ్మిడిహెట్‌ను వాడుకుంటే సరిపోతుందని అయితే కాంట్రాక్టర్ల కోసం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. వారసత్వ ఉద్యోగాల కోసం పోరాటం చేస్తున్న వారికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు కల్పిస్తుందన్నారు. గోదావరిఖని కేంద్రంగా సింగరేణిలో జరిగే అవకతవకలకు ఉద్యోగుల హక్కుల కోసం చేస్తున్న ఆందోళనకు తమ పార్టీ తోడుగా, నీడగా ఉంటుందని స్పష్టం చేశారు. సింగరేణి గనుల్లో కార్మికులు పడుతున్న కష్టాలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కార్మిక క్షేత్రాన్ని అడ్డాగా చేసుకొని తమ కార్యకలాపాలను విస్తరిస్తామన్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయని, హక్కుల కోసం ఆర్టీసీ కార్మికులు, సాక్షరభారత్‌ ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. పెద్దపల్లి, సుల్తానాబాద్‌లలో దీక్షా శిబిరాలను సందర్శించి మద్దతు పలికారు. ఆదివారం పెద్దపల్లి బస్టాండ్‌ వద్ద టిజెఎస్‌ జెండాను కోదండరాం ఆవిష్కరించారు. ఆయన వెంట రాష్ట్ర నాయకులు గాదె ఇన్నయ్య, పెంట రాజేష్‌, రౌతు కనకయ్య, ఐలయ్య యాదవ్‌, డొంకెన రవి, జెవి. రాజు, కేశవరెడ్డి, నూనె రాజేశం, జగ్గారెడ్డి, ప్రేమ్‌ కుమార్‌, మహేష్‌, రమేష్‌ తదితరులున్నారు.