కానిస్టేబుల్‌ కూతురిని రేప్‌ చేసిన డీసీపీ

ఔరంగాబాద్‌:
మహిళకు రక్షణ కరువైన దేశంలో రక్షకభటుడే కీచకుడిగా మారిన వ్యవహారం ఆందోళన కలిగిస్తున్నది. తన వద్ద పనిచేస్తోన్న కానిస్టేబుల్‌ కూతురికి మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికిన డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌(డీసీపీ) ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడటమేకాక వేధింపులతో నరకం చూపించాడు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ ఎండీసీ పోలీస్‌ స్టేషన్‌లో ఈ మేరకు కేసు నమోదైంది. దర్యాప్తు అధికారి డీసీపీ వినాయక్‌ ధక్నే తెలిపిన వివరాలివి. ఔరంగాబాద్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోన్న మహిళకు 23 ఏళ్ల కూతురుంది. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన తన కూతురికి ఏదైనా మంచి ఉద్యోగం చూసిపెట్టమని డీసీపీ రాహుల్‌ శ్రీరామ్‌ను అభ్యర్థించిందా మహిళా కానిస్టేబుల్‌. ఆ సాకుతో యువతిని ఇంటికి పిలిపించుకున్న ఆ డీసీపీ తన పాడుబుద్ధిని ప్రదర్శించాడు. అంతటితో ఊరుకోకుండా నెలల తరబడి ఆమెను లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురిచేశాడు. అతని హింస తారాస్థాయికి చేరడంతో బాధితురాలు కొద్దిగా ధైర్యం తెచ్చుకుని జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పింది. ఇద్దరూ కలిసి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి డీసీపీ రాహుల్‌పై ఫిర్యాదు చేశారు