కాళేశ్వరం ఒక స్కామ్. సమగ్ర దర్యాప్తు జరపాలి. – కోదండరాం.

  • అంతర్జాతీయ నిపుణులను పిలవాలి.
    టీఆరెస్ నాయకులు జైలుకు పోక తప్పదు.
                                            

హైదరాబాద్:
తుమ్మిడిహట్టి నీళ్లు మేడిగడ్డకు మార్చడం కాంట్రాక్టర్‌ల ప్రయోజనం కోసమేనని, టీఆర్ ఎస్ నాయకులు జైలు కు పోక తప్పదని కోదండరాం అన్నారు. కాస్ట్ బెనిఫిట్ కింద వరి పంటకు రూ.3,000 నుంచి రూ.20,000 ఆదాయం వస్తుందని, పత్తిపంటపై రూ.9,000 నుండి రూ.42,000 ఆదాయం, మిర్చి పంటకు రూ. లక్షా యాభైవేల ఆదాయం వస్తుందని నివేదికలు ఇచ్చి తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.ప్రభుత్వం చెప్తున్నట్టు కాళేశ్వరం ప్రాజెక్టుతో పంటలకు అధిక ఆదాయం ఎలా వస్తుందో వివరించాలన్నారు. ప్రాజెక్టులోని నీళ్లలో అమృతం ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. “ఇమానాబాద్ నుండి మల్లన్నసాగర్‌కు వచ్చే నీళ్లు వాస్తవానికి అవసరాల కంటే చాలా తక్కువ. అక్కడ ఉండేది 90 టీఎంసీలు. నగర అవసరాలు, తాగు, సాగు పోను అక్కడ మిగిలే నీళ్లు చాలా తక్కువ కాగా అలాంటప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్టును కట్టవలసిన అవసరం లేదన్నారు. కాళేశ్వరం విషయంలో ప్రభుత్వ ప్రయ త్నం, ప్రాజెక్టుపై ఖర్చు వృధా తప్ప మరొకటి లేదు. కాంట్రాక్టర్ల ప్రయోజనం, నిధుల దుర్వినియోగం, అధికారంలో ఉన్న కుటుంబానికి ప్రయోజనం తప్ప మరొకటి లేదని చెప్పారు.ఈ ప్రాజెక్టుపై సమగ్ర దర్యాప్తు చేపట్టాల”ని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు రైతుల కంటే కాంట్రాక్టర్‌కు ఎక్కువ మేలు చేస్తుందన్నారు. “ఈ నాయకులంతా చంచల్‌గూడ జైలుకు వెళ్లడం ఖాయమ”న్నారు.కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎప్పుడు, ఎక్కడ చర్చ పెట్టినా తాము సిద్ధమేనని తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరామ్ పేర్కొన్నారు. ప్రభుత్వం సమాధానాలు చెప్పడం లేదని ఆయన విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు నివేదికను టీజేఎస్ సిద్ధం చేసిందని, ప్రభుత్వ అధికారులకు, ఇరిగేషన్ శాఖలోని ప్రధాన అధికారులకు కూడా అందజేశామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకు మేలు చేసే కంటే ప్రధానంగా కాంట్రాక్టర్‌లకు మేలు చేసే విధంగా ఉందన్నారు. మంత్రి హరీష్‌రావు నిర్వహించిన సమావేశంలో ఒక్క ప్రశ్నకు కూడా సరైన సమాధానం చెప్పలేదన్నారు. తెలంగాణలో లిఫ్ట్‌ల ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం వీలైనంత తక్కువ ఖర్చుతో లిఫ్ట్‌ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. తుమ్మిడిహట్టి దగ్గర నీళ్లు ఉన్నాయి.. కానీ ప్రభుత్వం నీళ్లు లేవనే చర్చను ప్రధానంగా లేవనెత్తుతుందని విమర్శించారు. తుమ్మిడిహట్టి దగ్గర కాకపోతే ఎల్లంపల్లి దగ్గర కట్టుకునేందుకు ప్రత్యామ్నాయం ఉందని సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో నిపుణులను పిలవాలన్నారు. ఎవరి వాదన తప్పో వారే తేల్చుతారన్నారు. ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టునే సమర్థించుకునేందుకు 3 అంశాలను ప్రధానంగా లేవనెత్తుతుంది.ఇందులో ప్రధానంగా కాళేశ్వరం అవసరమనేది మొదటి వాదనగా ఉంది. తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేవు కాబట్టి మేడిగడ్డ వద్ద నీళ్లు ఉన్నాయన్నది ప్రధానంగా వినిపిస్తుంది. తెలంగాణకు నీళ్లు రావడానికి ఎల్లంపల్లి తప్ప మరొకమార్గం లేదన్నది ప్రభుత్వం బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నది. వాస్తవంగా లిప్ట్ అవసరం ఉంది కాబట్టి వీలైనంత తక్కువ ఖర్చులో మనం లిఫ్ట్‌ను ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ నీటి అవసరాలు మొత్తం గోదావరి తీరుస్తుంది కాబట్టి ఆ నీళ్లు అందించడానికి ఎల్లంపల్లి ఒక్కటే మార్గం అనడం వాస్తవం కాదు.ఎల్లంపల్లితో పాటు దిగువన నీళ్లు ఆపుకుని ఎత్తులో ఉన్న నీళ్లు అక్కడే ఆపుకోవచ్చని తెలిపారు. తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు ఉన్నాయని.. ఎల్లంపల్లిని జంక్షన్‌లా వాడుకుంటే అవసరాలు తీరుతాయని చెప్పారు. ఎల్లంపల్లి దగ్గర నీళ్లు లేనప్పుడు గోదావరి నది కింద భాగంలో కూడా నీళ్లు ఉండవన్నది వాస్తవమైన విషయం. తుమ్మిడి హట్టి వద్ద నీళ్లు లేకుండా ప్రాణహిత వద్ద నీళ్లు వచ్చే అవకాశం లేదన్నారు. తుమ్మిడి హట్టి దగ్గర నీళ్లు లేనప్పుడు మేడిగడ్డ వద్ద నీళ్లు ఎలా వస్తాయనేది మరొక ప్రశ్న. అంతేకాకుండా తక్కువ ఖర్చుతో నీళ్లు తెచ్చుకోవచ్చనేది మా వాదన. తుమ్మిడిహట్టి దగ్గర నీళ్లు తెచ్చుకోగలిగితే రూ.70,000 కోట్లు ఆదా అవుతుందని వివరించారు. కాబట్టి పదేపదే తుమ్మిడిహట్టి దగ్గర నుండి మేడిగడ్డ దగ్గరకు మార్చడం వల్ల ఇది కాంట్రాక్టర్లకు ప్రయోజననాన్ని చేకూరుస్తుంది తప్ప ప్రజలకు అవసరాలు తీర్చదని వెల్లడించారు. కాళేశ్వరం అంటే తెలంగాణ ప్రజల అవసరాల కంటే కాంట్రాక్టర్‌ల అవసరాలు తీరుస్తుందని దుయ్యబట్టారు. “కేవలం ఒక్క కాంట్రాక్టర్ ప్రయోజనం కోసం కుటుంబం చేస్తున్న ప్రయత్నం” అనేది వాస్తవమన్నారు.దాని వల్ల ఇవాళ రూ.80,000 కోట్ల తెలంగాణ ఆదాయంగా భావించవచ్చా అని ప్రశ్నించారు. ఆ డబ్బు ఆదా చేస్తే తెలంగాణ అభివృద్ధికి ఉపయోగపడేదన్నారు. అదే నిధులను సరిగా వినియోగించుకోగలిగితే ఫీజురీయింబర్స్‌మెంట్, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి ఇచ్చే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా ఆరోగ్య శ్రీ నిధుల బకాయిలు చెల్లింపులు నిలిచేవి కాదన్నారు. ఇవాళ రాష్ట్రం మీద ఇంత ఆర్థిక భారం పడేది కాదన్నారు.