కాళేశ్వరం పై ఆగని కాంగ్రెస్ కుట్రలు.

తెలంగాణ బక్క రైతు పై ప్రతాపం.
టీఆరెస్ కు 100 సీట్లు పక్కా.
– మంత్రి హరీశ్ రావు.

హైదరాబాద్:
తెలంగాణ ఏర్పాటు పట్ల కాంగ్రెస్ ప్రదర్శించిన అలసత్వ వైఖరినే కాళేశ్వరం పట్ల చూపుతోందని విమర్శించారు. తెలంగాణ ప్రజల పట్ల కాంగ్రెస్ అక్కసు పెంచుకుందన్నారు. కాళేశ్వరం నీళ్లు తెలంగాణ పంట పొలాలకు మళ్లడం కాంగ్రెస్ కు ఇష్టం లేదని హరీశ్ చెప్పారు.కేసులతో కాళేశ్వరం ను నీరు గార్చేందుకు కాంగ్రెస్ విఫల యత్నం చేసిందని ఆయన రుజువులు చూపారు.
అన్ని ప్రయత్నాలు విఫలం కావడం తో ఎన్నికలకు ముందు ‘రౌండ్ టేబుల్’ మీటింగ్ లతో హడావుడి చేస్తోందని అన్నారు. తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టుతో సస్యశ్యామలం అయితే తమకు రాజకీయంగా పుట్టగతులు ఉండవనే కాంగ్రెస్ కుట్రలకు తెరదీస్తొందని మంత్రి విరుచుకుపడ్డారు.పాము తన పిల్లలను తానే తిన్నట్టుగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు తమ సొంత ప్రజలకే ద్రోహం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.చంద్రబాబు కాళేశ్వరం ను అడ్డుకుంటున్నట్టే కాంగ్రెస్ నేతలు తెలంగాణ కు ద్రోహం చేస్తున్నారని అన్నారు. బక్కచిక్కిన తెలంగాణ రైతు పైనా కాంగ్రెస్ నేతల ప్రతాపమా ? అని ప్రశ్నించారు.  గోదావరి ,కృష్ణా జలాల్లో తెలంగాణ కు ఉన్న వాటాను వినియోగించుకోవాలన్నదే తెలంగాణ ప్రభుత్వ అభిమతం అని ఇరిగేషన్ మంత్రి స్పష్టం చేశారు.
గోదావరి జలాల్లో తెలంగాణ వాటా 954 టీఎంసీ లయితే ఎప్పుడయినా కాంగ్రెస్ వాటిని వినియోగించుకోవాలని ప్రయత్నించిందా ? అని ప్రశ్నించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ను 37 యేళ్ళ తర్వాత పూర్తయ్యిందని ప్రకటించి కాంగ్రెస్ ఆరులక్షల ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేకపోయిందన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టును 9 లక్షల 25 వేల ఎకరాలకు చేర్చడమే trs ప్రభుత్వ లక్ష్యమని హరీశ్ రావు తెలిపారు. గోదావరి పై ఒక్క మధ్యతరహా ప్రాజెక్టును పూర్తి చెయని ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలదని ఆయన అవహేళన చేశారు.మిడ్ మానేరు ను పూర్తి చేసిన ఘనత తమ ప్రభుత్వానిదని చెప్పారు.రాళ్ళ వాగు, మత్తడి ప్రాజెక్టుల ను పూర్తి చేసి నీళ్లందించామని గుర్తు చేశారు. ప్రాజెక్టులను అడ్డుకోవడం లో కాంగ్రెస్, జేఏసీ లు ఒక్కటయ్యాయని ఆరోపించారు.
కాంగ్రెస్ నేత దామోదర్ రాజనరసింహ కారు లో కోదండరాం, మరికొంత మంది న్యాయవాదులు ముంపు గ్రామాల ప్రజలను రెచ్చగొట్టడానికి వెళ్లడం కుమ్మక్కుకు నిదర్శనం కాదా ? అని అన్నారు. చనిపోయిన వారి పేర్ల మీద కాంగ్రెస్ నేతలు కేసులు వేసి శవరాజకీయాలు చేశారని ఆరోపించారు. కేసులు వేసిన వారికి కాంగ్రెస్సే ఆర్ధిక సాయం చేసిందని తెలిపారు. మాజీ మంత్రి ముత్యం రెడ్డి కొడుకు పీసీసీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి బ్యాంక్ అకౌంట్ నుంచి పిటిషనర్ల కు ఢిల్లీ ఫ్లైట్ టికెట్ లకు ఎన్నో సార్లు డబ్బులు వెళ్లాయని మంత్రి మీడియాకు ఆధారాలు ఇచ్చారు.
ఇపుడు కొన్ని ఆధారాలే బయట పెడుతున్నానని,మిగతా ఆధారాలు అసెంబ్లీ లో బయట పెడతానని హరీశ్ రావు చెప్పారు.కాంగ్రెస్ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా కాళేశ్వరానికి అన్ని అనుమతులు సాధించామన్నారు.కోర్టుల్లో పోరాడి ఓడిన కాంగ్రెస్ నేతలు ఇపుడు రౌండ్ టేబుల్ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. తమ్మిడి హట్టి పై కాంగ్రెస్ నేతలు అబద్దాలు మాట్లాడుతున్నారని చెప్పారు. మే లో తమ్మిడి హట్టి దగ్గర 20 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుందని షబ్బీర్ అలీ అబద్దం ఆడారని ఆయన చెప్పారు.కేంద్ర జలసంఘం వివరాల ప్రకారం మే లో అక్కడ 12 వందల క్యూసెక్కులే ప్రవహిస్తాయని తెలిపారు.కెసిఆర్ అధికారం లోకి వచ్చిన వెంటనే ప్రాణహిత చేవెళ్ల కు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధాని మోడీ కి లేఖ రాశారని మంత్రి గుర్తు చేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం చర్చలకు మహారాష్ట్ర వెళితే అక్కడి మంత్రి అనుమతులు లేని ప్రాజెక్టును అనుమతించేది లేదని తెగేసి చెప్పారన్నారు.రకరకాల ప్రయత్నాల తర్వాత సీఎం కెసిఆర్ మహారాష్ట్ర తో గోదావరి జలాలపై చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన తెలిపారు.కాంగ్రెస్ హాయం లో ఏడేండ్లలో చేయని పనిని సీఎం కెసిఆర్ ఏడు నెలల్లో చేసి చూపించారని చెప్పారు. ప్రాణహిత చేవెళ్ల పై ఇపుడు మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు అపుడు మహారాష్ట్ర తో ఎందుకు ఒప్పందం కుదుర్చుకోలేక పోయారని ఇరిగేషన్ మంత్రి ప్రశ్నించారు. తమ్మిడి హట్టి దగ్గర నీటి లభ్యత లేదని కేంద్ర జలసంఘం మార్చి 2015 లో కీలక ప్రకటన చేసిన తర్వాత ప్రాణహిత చేవెళ్ల పై ముందుకు సాగలేకపోయామని తెలిపారు.
నాగార్జునసాగర్ పైన ఆలమట్టి, శ్రీరామ్ సాగర్ పైన బాబ్లీ కట్టడం తో ఆ ప్రాజెక్టుల పరిస్థితి ఏమయిందని ప్రశ్నించారు.అలాంటి పొరపాట్లు జరగవద్దని ముందు చూపుతో కాళేశ్వరాన్ని మేడి గడ్డ దగ్గర ప్రతిపాదించినట్టు హరీశ్ చెప్పారు.
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కు పది హేడు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తూ మొదటి జీవో కాంగ్రెస్ హాయం లో ఇచ్చారని, పంచరంగుల డ్రామాను తెలంగాణకు చూపారని, ఎన్నో చోట్ల ఎన్నికల కోసం కొబ్బరికాయలు కొట్టారని అన్నారు. కేవలం పందొమ్మిది నెలల్లోనే ప్రాణహిత ప్రాజెక్టు వ్యయాన్ని రెండున్నర రెట్లు పెంచుతూ రెండో జీవో ఇచ్చారని ఆరోపించారు. అప్పుడెందుకు అంచనా వ్యయం పెంచారని ప్రశ్నించారు. కాళేశ్వరం అంచనా వ్యయాన్ని పెంచడానికి భూ పరిహారం ఆరింతలు పెరగడం ,రిజార్వాయర్లు ,లిఫ్టులు పెరగడం ,ఆయకట్టు పెరగడం ప్రధాన కారణం అని మంత్రి వివరించారు. మే 2012 నాటికి ప్రాణహిత చేవెళ్లకు 3234 కోట్లు ఖర్చు చేశామని చూపారని తెలిపారు. ఇందులో 2 వేల కోట్లు మొబిలైజేషన్ అద్వాన్సులకు చెల్లించారని మంత్రి తెలిపారు. ఎనిమిది సంవత్సరాల్లో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ హాయంలో పెట్టిన ఖర్చు ఆరు శాతమే నన్నారు.కాంగ్రెస్ హాయం లో నిధుల విడుదల తీరు చూస్తే వందేళ్లయినా ప్రాణహిత ప్రాజెక్టు పూర్తి కాక పోయేదన్నారు. ప్రాణహిత ప్రాజెక్టు పై వాస్తవాలు ఇలా ఉంటే ఉత్తమ్, జానా లు అబద్దాలు మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు. పోతిరెడ్డి పాడు ,పులిచింతల అక్రమంగా కడుతుంటే నోరు మెదపని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అన్ని అనుమతులున్న కాళేశ్వరం కు అడ్డుపడుతున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టు సక్రమంగా లేకుంటే కేంద్ర జలసంఘం అన్ని అనుమతులు ఎలా ఇస్తుందన్నారు.నీళ్లు లేనిచోట మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఎందుకు అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారని, నీళ్లు లేని చోట ఏపీ లో కండలేరు, ఓర్వకల్లు రిజార్వాయర్లు కట్టలేదా ?
అని తెలిపారు. తక్కువ ముంపుతో 50 టీఎంసి ల సామర్ధ్యం తో మల్లన్న సాగర్ హైదరాబాద్ భవిషత్ అవసరాలు తీరుస్తుందన్నారు .ఖర్చు తగ్గించేందుకే తమ్మిడి హట్టి ప్రాజెక్టును వార్ధా దగ్గర కు మార్చామని తెలిపారు.బీఆర్ అంబేద్కర్ ప్రాజెక్టు కొనసాగుతోందని,
దీని పై కాంగ్రెస్ నేతలు దుష్ప్రాచారం చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ నేతలు ఎంతగా అడ్డుపడ్డా కాళేశ్వరం ప్రాజెక్టు తో గోదావరి జలాలను రైతుల పొలాలు తడుపుతామని స్పష్టం చేశారు.
“మేము ప్రజలకు మంచి చేస్తున్నాం .కాబట్టే అన్ని సర్వేల్లో trs కు వంద సీట్లు వస్తాయని తేలింది. కాంగ్రెస్ హాయం లో కొన్ని ప్రాజెక్టుల వ్యయం వంద రెట్లు పెరిగింది. బ్యాంకుల నుంచి రుణం తెస్తున్నాం.. నిర్ణీత వ్యవధి లో వాటి పూర్తి కి ప్రయత్నిస్తున్నాం” అని ఇరిగేషన్ మంత్రి చెప్పారు.