కిషన్‌రెడ్డిపై నిప్పులు చెరిగిన ఒవైసీ.

కిషన్‌రెడ్డిపై నిప్పులు చెరిగిన ఒవైసీ.

న్యూఢిల్లీ:

‘హైదరాబాద్ టెర్రరిస్ట్ హబ్’ అంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి శుక్రవారం చేసిన వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఉగ్రవాదులకు హైదరాబాద్ సేఫ్ జోన్ అంటూ అమిత్‌షా సహాయ మంత్రి బాధ్యతలేని వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. శనివారంనాడిక్కడ మీడియాతో ఒవైసీ మాట్లాడుతూ, హైదరాబాద్ అభివృద్ధికి వ్యతిరేకిగా కిషన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని అన్నారు.ఉగ్రవాదానికి హైదరాబాద్ సేఫ్ జోన్ అని కిషన్ రెడ్డి చెబుతున్నారని, ఆయనను తాను ఒకటే ప్రశ్న అడుగుతున్నానని, ఉగ్రవాదానికి హైదరాబాద్ సేఫ్ జోన్ అని ఎన్ఐఏ, ఐబీ, రా ఎన్నిసార్లు లిఖిత పూర్వకంగా చెప్పాయని ప్రశ్నించారు.గత ఐదేళ్లుగా హైదరాబాద్ ఎంతో ప్రశాంతంగా ఉందని, ఎలాంటి మతపరమైన అల్లర్లు జరగలేదని, మతపరమైన పండుగలన్నీ శాంతియుతంగా జరిగాయని ఒవైసీ గుర్తు చేశారు. అభివృద్ధిపరంగా హైదరాబాద్ సిటీ ఎంతో ఎదుగుతోందని, ఇందుకు భిన్నంగా తెలంగాణకు, హైదరాబాద్‌కు వ్యతిరేకంగా వారు శత్రుత్వం పెంచుకోవడానికి కారణమేమిటని నిలదీశారు. రాష్ట్రం, రాజధాని నగరం అభివృద్ధి చెందడం వారికి ఇష్టంలేదా అని ప్రశ్నించారు. ముస్లింలంటే కేవలం ఉగ్రవాదులేననే అభిప్రాయం బీజేపీకి ఉందని, అయితే ముస్లింలంతా ఉగ్రవాదులు కాదనే విషయం గ్రహించడం మంచిదని ఒవైసీ చెప్పారు.