‘కుంగుబాటు’కు దివ్య ఔషధం ‘ కేటామిన్’.

న్యూఢిల్లీ:
కెటామిన్.. నిషేధిత మత్తు పదార్థం అని అందరికీ తెలుసు. మాదక ద్రవ్యాల వ్యాపారుల పరిభాషలో ‘స్పెషల్ కె‘గా వ్యవహరించే కెటామిన్ ను క్లబ్బులు, పబ్బులు వంటి చోట్ల అక్రమంగా అమ్ముతుంటారు. ఇది తీసుకోగానే గమ్మత్తయిన మత్తు, తేలిపోతున్న భావనను కలిగిస్తుంది. దీంతో యువత పార్టీలలో అక్రమంగా కొనితెచ్చిన కెటామిన్ ను తీసుకుంటారు. కానీ ఆస్పత్రులలో కెటామిన్ ని సర్జరీల సమయంలో, నొప్పి నివారణకు ఉపయోగిస్తారు. ఇప్పుడీ మత్తుమందు తీవ్ర మానసిక కుంగుబాటు, ఆత్మహత్య ధోరణులు ప్రబలినవారికి దివ్యౌషధం కానుంది. చికిత్స ఎంత తీసుకున్నా వదలని కుంగుబాటు, ఆత్మహత్యా ధోరణుల నివారణకు కెటామిన్ అద్భుతంగా పనిచేస్తుందని ఇటీవల జరిపిన కొన్ని శాస్త్ర పరిశోధనల్లో తేలింది.కొన్ని దశాబ్దాలుగా కుంగుబాటుకు మందులు కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఎన్నో ఔషధాలను తీసుకొచ్చారు. అయితే తీవ్ర కుంగుబాటు, మొండి మానసిక ఆందోళనలకు ఈ మందులు పెద్దగా ప్రభావం చూపడం లేదు. దీంతో ఇలాంటి రోగులు చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ దిశగా ప్రయోగాలు జరిపిన పరిశోధకులకు కెటామిన్ రూపంలో ఓ అద్భుత నివారిణి దొరికింది. మానసిక ఆరోగ్య సంరక్షణలో గత 50 ఏళ్లలోనే ఇలాంటి మందు రాలేదని వారు చెబుతున్నారు. మందులకు నయం కాని మానసిక రోగుల్లో 70 శాతం కెటామిన్ కు అద్భుతంగా స్పందిస్తున్నారని తెలిపారు. ఇంట్రావీనస్ పద్ధతిలో కెటామిన్ ప్రయోగించిన రోగులు కొద్ది గంటల్లోనే ఎంతో ఉపశమనం పొందినట్లు పరిశోధనల్లో రుజువైంది. ఆత్మహత్యకు సిద్ధమైన వారిని రక్షించేందుకు కెటామిన్ ఇవ్వాలని ఫిక్సయిన డాక్టర్లు దీనికి ‘సేవ్ షాట్‘ అని పేరు కూడా పెట్టారు. అయితే ఇందులో ఓ ప్రమాదం ఉంది. ప్రారంభంలో ఐదారు సార్లు కెటామిన్ తీసుకున్న రోగులు ఈ కిక్ కి అలవాటు పడుతున్నారు. ప్రతి 4-6 వారాలకోసారి బూస్టర్ డోసులు అడిగే ప్రమాదం ఉంది. అందుకని రోగుల పరిస్థితి, వ్యాధి తీవ్రతను సరిగ్గా అంచనా వేసి మాత్రమే కెటామిన్ ను వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.