కుర్చీ కోసమే కాంగ్రెస్‌‌ నేతల కొట్లాట… – మంత్రి హరీష్ రావు.

నల్లగొండ:
కాంగ్రెస్‌ పార్టీ నేతలు‌ కుర్చీ కోసం కొట్లాడటం తప్ప ..ప్రజల గురించి ఏ మాత్రం ఆలోచించడం‌లేదని మంత్రి హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే కరెంటు కోతలు, ఎరువు, విత్తనాల‌కొరతలని చెప్పారు. నల్గొండ జిల్లాలో నిమ్మ, బత్తాయి మార్కెట్ ఏర్పాటు అన్నది ఓ కలలా ఉండేదన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో నిమ్మ, బత్తాయి మార్కెట్ ఏర్పాటు కల నకిరేకల్ లో నేడు నిజమయిందన్నారు. అంతకు ముందు ఆయన మూడున్నర కోట్లతో నకిరేకల్ లో నిమ్మ మార్కెట్ యార్డును ప్రారంభించారు.‌ అనంతరం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడారు. నిమ్మ , బత్తాయి మార్కెట్ రాక ముందు రైతులు ‌ఇక్కడ చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పారు. తెరాస కాకుండా ,కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఇరవై ఏళ్లయినా ఈ మార్కెట్లు వచ్చేవి కాదన్నారు. తాను ఇరవై‌సార్లు దరఖాస్తు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మ, బత్తాయి మార్కెట్ మంజూరు చేయలేదని , సీఎం కేసీఆర్ మాత్రమే మంజూరు చేశారని కోమటి రెడ్డి వెంకటరెడ్డే స్వయంగా‌‌ చెప్పారన్నారు.

నకిరేకల్ లో కోల్డ్‌స్టోరేజీ కావాలని ఎమ్మెల్యే వీరేశం కోరారని, కోల్డ్ స్టోరేజీని మంజూరు చేస్తున్నట్లు మంత్రి అక్కడికక్కడే ప్రకటించారు. ప్రాసెసింగ్ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరారని, దీనిపై మంత్రి కేటీఆర్ తో మాట్లాడి ప్రాసెసింగ్ యూనిట్ మంజూరు చేసేందుకు కృషి చేస్తానన్నారు. నార్కట్ పల్లి, కట్టంగూరు, చిట్యాలలో సబ్ మార్కెట్ యార్డు లు ఏర్పాటు చేయలన్న డిమాండ్ పై స్పందించిన మంత్రి హరీష్ రావు…ఐదెకరాల స్థలం ఇస్తే పదిహేను రోజుల్లో మార్తెట్ యార్డును మంజూరు చేస్తామని చెప్పారు. అయిటి పాముల ఎత్తిపోతల పథకం త్వరలోనే మంజూరు‌చేయనున్నట్లు చెప్పారు. ఎర్రకాలువ ద్వారా రామన్న పేట, చిట్యాల, నార్కెట్‌పల్లి మండలాలకు ఉపయోగమన్న మంత్రి హరీష్ రావు, దీని కోసం‌ 150‌ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు. ఇందు కోసం 18 కోట్లు విడుదల చేయనున్నట్లు చెప్పారు. బ్రాహ్మణ వెల్లం పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. కాళేశ్వరం నీరు రావడం వల్ల మూసీ నది నిండుగా మారనుందన్నారు. మూసీ ద్వారా వానా కాలంలోను 40 వేల ఎకరాలకు పంట నీరు ఇస్తామన్నారు. మూసీ కాలువల ఆధునికీకరణ కు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. మూసీ‌గేట్లను 19 కోట్లతో బాగు చేయించామని, 65 కోట్లు మూసీ కాలువల ఆధునికీకరణ కు నిధులు విడుదల చేసినట్లు‌ చెప్పారు. ధర్మారెడ్డి, పిల్లయి పల్లి కాలువల ఆధునికీకరణ పనులకు 280 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. దిండి ప్రాజెక్టు,ఎన్.ఎస్.పీ ఆధునికీకరణ, ఎస్.ఆర్.ఎస్.పీ స్టేజ్ 2 పనులు పూర్తి కావొస్తున్నాయన్నారు. ఇవి ఉమ్మడి నల్గొండ జిల్లాకు‌ప్రయోజనం చేకూరుస్తాయని చెప్పారు. కాళేశ్వరం ద్వారా నీరు మిడ్ మానేరుకు‌ చేరితే , కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలాలు అందునేది సూర్యపేట, పాత వరంగల్ జిల్లాయేనని చెప్పారు. ప్రాజెక్టు పనుల్లో‌ దేశానికి ఆదర్శంగా నిలిచింది తెలంగాణయేనని మంత్రి చెప్పారు. సీఎం కేసీఆర్ రైతు సంక్షేమ ప్రభుత్వంగా తన పాలన సాగిస్తున్నారని మంత్రి హరీష్ రావు కొనియాడారు. రైతులకు గిట్టుబాచు ధర కల్పిస్తోంది… తమ ప్రభుత్వమేనన్నారు.‌ 2009 నుంచి 2014 వరకు పాలించిన కాంగ్రెస9281 కోట్లతో్ 7 కోట్ల85 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొంటే తమ ప్రభుత్వం నాలుగేళ్లలో 23,365 కోట్లతో 17 కోట్ల‌ 50‌లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు‌ చేసినట్లు ‌చెప్పారు. ఈ ఏడాది 8 వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. తమ హయాంలో 18 లక్షల టన్నుల సామర్థ్యం గల గోదాములు నిర్మంచామన్నారు. నీటి నిర్వహణలో ‌తెలంగాణ చర్యలను కేంద్రం‌ సైతం ప్రసంశించిందన్నారు. ఈ ఏడాది NSP కింద 1 TMC నీటితో 10300 ఎకరాలు, నిజాంసాగర్‌ కింద 13 వేల ఎకరాలు, SRSP కింద 12 వేల‌ఎకరాలను సాగు చేయగలిగామని చెప్పారు. ఇది ప్రభుత్వం, సాగు నీటి ఇంజనీర్ల కృషి అన్నారు. ఆర్ అండ్ ఆర్ పద్థతి ద్వారా చివరి ఆయకట్టుకు నీరు ఇచ్చామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో నేతలు కుర్చీ కోసమే కొట్లాడుతున్నారని, ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు. ప్రజా సంక్షేమం మరిచి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని చెప్పారు. ఉత్తమ్ గడ్డం పెంచుకుంటే సీఎం‌అవుతాడా అని కోమటి రెడ్డి వెంకట రెడ్డి అంటే, లావుగా ఉన్నంత మాత్రాన నాగం పెద్ద లీడర్ కాడని డీకే అరుణ విమర్శిస్తున్నారని ఎద్దేవీ చేశారు. కళ్లు కనబడని వారు, నడవలేని వారికి‌‌ సీఎం కుర్చీ కావలా అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డి అంటే నేనే సీఎం అభ్యర్థినని జానా రెడ్డి చెప్పుకుంటున్నారన్నారు. ఇక రేవంత్ రెడ్డి‌సీఎం పదవి తప్ప మరే పదవి వద్దని చెబుతున్నారన్నారు. 2019 లో‌ ఫెయిలయ్యే కంపెనీకి ఎండీ గా ఉండాలని ఉత్తమ్ ఉవ్విళ్లూరుతున్నారని ఎమ్మెల్సీ రాజ్ గోపాల్ రెడ్డినే తమ పార్టీ పరిస్థితి చెప్పకనే చెప్పారన్నారు. కుర్చీ పోరు తప్ప ప్రజలకు సేవ చేయాలన్న సోయే కాంగ్రెస్ పార్చీకి‌ లేదన్నారు.అనంతరం నల్గొండ పట్టణం లో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఆయనతో పాటు మంత్రి జగదీష్ రెడ్డి, రైైతు‌సమన్వయ సమితి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీలు బూర నర్సయ్య గౌడ్, లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే లు వేముల వీరేశం, గాదరి కిషోర్, భాస్కర్ రావు ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్,‌ జిల్లా‌తెరాస నేతలు,కార్పోరేషన్ ఛైర్మన్లు పాల్గొన్నారు.