‘కూటమి’కి కోదండరాం సారధ్యం!! ‘తెలంగాణ పరిరక్షణ వేదిక’ గా నామకరణం.

హైదరాబాద్;

తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ ‘కూటమి’ కి చైర్మన్ గా కోదండరాంను ఎన్నుకున్నారు. ‘కూటమికి ‘ తెలంగాణ పరిరక్షణ వేదిక లేదా తెలంగాణ పరిరక్షణ సమితిగా పేరు పెట్టాలని నిర్ణయించారు. అధికారికంగా దీనిపై ప్రకటన వెలువడవలసి ఉన్నది. ఈ నాలుగు పార్టీలు బుధవారం జరిగిన సమావేశంలో ఈ విషయమై సూత్రప్రాయంగా ఒక అంగీకారం కుదిరినట్టు సమాచారం ఉన్నది. నాలుగు పార్టీల మధ్య సీట్ల పంపకం తుది దశలో ఉన్నది. ఎన్నికలకు మాత్రమే పరిమితం కాకుండా ‘కూటమి’ అధికారంలోకి వచ్చిన తరువాత కోదండరాంకు మేనిఫెస్టో అమలు కమిటీ చైర్మన్ తరహా పదవి కావాలని టీజేఎస్ కోరుతున్నది. కోదండరాంను’కూటమి’ చైర్మన్ గా మిగతా పార్టీలు ఒప్పుకున్నందున ‘కూటమి’ పక్షాన ఎన్నికల ప్రణాళికను రూపొందించి విడుదల చేయాలని అనుకుంటున్నారు. టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క, సిపిఐ నాయకుడు కూనంనేని సాంబశివరావు, తెలంగాణ జన సమితి నాయకుడు దిలీప్, తెలుగుదేశం సీనియర్ నాయకుడు రావుల చంద్రశేఖరరెడ్డి తదితరులు ‘కూటమి’ సమావేశంలో పాల్గొన్నారు.