‘కూటమి’ పంపకాలపై తేలని చర్చలు. రేపు ఢిల్లీకి కూటమి నాయకులు.

హైదరాబాద్‌:

మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై ఇంకా స్పష్టత రాలేదు. కోర్‌ కమిటీ సూచనల మేరకు సీట్ల వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నాలను తీవ్రం చేసింది. కూటమి నేతల మధ్య చర్చలు పూర్తికాగా, ఆదివారం మరో మారు భేటీ కావాలని నిర్ణయించారు. శుక్రవారం టీజేఎస్‌ అధినేత కోదండరాంతో కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. భేటీలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. సీనియర్‌ నేత కె.జానారెడ్డి హాజరయ్యారు. 17 సీట్లు కేటాయించాలని టీజేఎస్‌ కోరింది. అయితే, 8 నుంచి 9 సీట్లు కేటాయించేందుకు కాంగ్రెస్‌ సమ్మతి తెలిపినట్లు తెలుస్తోంది. టీడీపీ 27 స్థానాలకు తమ అభ్యర్థుల జాబితాను అందించగా, ఇందులో 12 నుంచి 13 స్థానాలకు కాంగ్రెస్‌ ఓకే చెబుతోంది. ఇక సీపీఐ 6 స్థానాలకు కోరుతుండగా, రెండు లేక మూడు ఇస్తామని కాంగ్రెస్‌ అంటోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల 27న రాహుల్‌ రెండోదఫా రాష్ట్ర పర్యటనకు ముందే సీట్ల సర్దుబాటు, కామన్‌ మినిమం ప్రోగ్రాంను కొలిక్కి తేవాలని కాంగ్రెస్‌ భావిస్తోంది.

సీట్ల సర్దుబాటు అంశం, ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చించేందుకు కూటమి నేతలు ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీతో భేటీ కానున్నారు. శనివారం రాష్ట్రానికి రానున్న రాహుల్‌తో కూటమి నేత లు భేటీ అవుతారని ప్రచారం జరిగినా, అలాంటిదేమీ లేదని కోదండరాం తేల్చిచెప్పారు. ఆదివారం కూటమి నేతలంతా ఢిల్లీకి వెళ్లి రాహుల్‌తో చర్చిస్తారని, నాలుగేళ్లుగా కేసీఆర్‌ ప్రజావ్యతిరేక పాలన అంశాలతో కూడిన బుక్‌లెట్‌ను ఆయనకు అందించనున్నారని తెలుస్తోంది. టీజేఎస్‌ అభ్యర్థులు తమ పార్టీ బీఫారంపైనే పోటీ చేస్తారని ఆ పార్టీ అధినేత కోదండరాం స్పష్టం చేశారు. తమ పార్టీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే గుర్తు సైతం కేటాయించనున్నారని తెలిపారు. తమ పార్టీ అభ్యర్థులు ఇతర పార్టీ గుర్తుపై పోటీ చేసే అంశంపై చర్చించామని, అయితే, అది సాధ్యమయ్యేది కాకపోవడంతో తమ పార్టీ గుర్తుపైనే పోటీ చేస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ పాక్షిక మేనిఫెస్టోలో గొప్ప విషయం ఏమీ లేదని అన్నారు.