'కూటమి' లక్ష్యమేమిటి ? కేసీఆర్ ను ఓడించడమా ! కొన్నిసీట్లు సాధించడమా!!

kutami

ఎస్.కె.జకీర్.

‘ప్రజాకూటమి’ లక్ష్యమేమిటి ? కొన్ని అసెంబ్లీ సీట్లు గెలుచుకొని పరువు దక్కించుకోవడమా ? లేక
విజయమో ,వీరస్వర్గమో అన్నట్టు తెగించి పోరాడి కేసీఆర్ సర్కారును కుప్పకూల్చడమా ? కూటమి
భాగస్వాములకు ఉన్న స్పష్టత ఏమిటి ? సిపిఐ, తెలంగాణ జనసమితి కోరుతున్న అసెంబ్లీ స్థానాలు,
వాటి సంఖ్య అనూహ్యంగా, అనుమానాస్పదంగా ఉన్నవి. సొంత బలం, బలగం ఉండి, పార్టీ క్యాడర్
పుష్కలంగా ఉండి తప్పకుండా ప్రత్యర్థిని దెబ్బతీయవచ్చునని అంచనా వేసుకొని, శాస్త్రీయంగా
విశ్లేషించుకుని, సర్వేలు చేయించుకొని వాటి ప్రాతిపదికన ‘పెద్దన్న’ కాంగ్రెస్ తో కీచులాడవచ్చు. కానీ ఏమి
జరుగుతున్నది. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితికి టి.జె.ఎస్, సిపిఐ డిమాండ్లకు పొంతన కుదరడం లేదు. ఆ
పార్టీలు తమ బలాన్ని అతిగా అంచనా వేసుకుంటున్నారా? లేక తమ పైన తమకు మితిమీరిన విశ్వాసం
వల్ల ఇలాంటి డిమాండ్లు పెడుతున్నారా !! ఎవరికీ అంతుచిక్కడం లేదు. రాజకీయ పండితులు సైతం
ఆశ్చర్యపోతున్నారు. ”అన్ టెస్టడ్ మిస్సైల్ ” అని కోదండరాం గురించి సీనియర్ జర్నలిస్టు, ప్రస్తుతం
మజ్లీస్ పార్టీ ఎమ్మెల్సీ గా ఉన్న వ్యక్తి అన్నారు. అంటే ”ఇంకా పరీక్షించబడని క్షిపణి ” అని ఆయన
అభిప్రాయం. ఈ మాట ఆయన క్యాజువల్ గా అన్నప్పటికీ అందులో ఎంతో అర్ధం ఉన్నది. ”క్షిపణి
ప్రయోగం” జరగకుండా దాని ప్రభావం, లాభ నష్టాలు… ప్రయోగించే దశలోనే కూలిపోతుందా !! వంటి
సందేహాలు తలెత్తక మానవు. కోదండరాం పట్ల ఆ సీనియర్ జర్నలిస్టుకు సదభిప్రాయం, గౌరవమూ
ఉన్నవి. కోదండరాంను ఆయన కించపరచలేదు. కోదండరాం నిజాయితీ,నిబద్ధత, విశ్వసనీయత పట్ల

తెలంగాణ సమాజంలో భిన్నాభిప్రాయాలు లేవు. కానీ ఆయన ఎత్తుగడలు కలవరపరుస్తున్నవి.
జనసమితి పార్టీ స్థాపించినా అది ఇంకా పూర్తిగా నిలదొక్కుకున్న దాఖలాలు, దానికంటూ ప్రత్యేకంగా
ఏర్పడిన బలగమూ లేవు. పైగా జనసమితిలో ‘రెడ్డి’ సామాజిక వర్గమే ఆధిక్యంలో ఉన్నది. టి.జె.ఎస్
కోరుతున్న సీట్లలో మెజారిటీ అభ్యర్థులంతా ‘రెడ్లే’ ఉండవచ్చు. కోదండరాం పోటీ చేస్తారో లేదో తెలియదు.
ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఇంకా సస్పెన్సు. కోదండరాం వ్యవహారశైలి ‘ఫక్తు రాజకీయ నాయకుల’
స్టయిల్ కు పూర్తిగా విరుద్ధం. కనుక ఆయన స్వయంగా బరిలోకి దిగి, ఇంటింటికీ ప్రచారం చేసుకోవడానికి
సమయాన్ని ఖర్చు చేసే కన్నా ‘కూటమి’పక్షాన ప్రచారకర్తగా ఉండడం ప్రయోజనకరమన్నది రాజకీయ
పరిశీలకుల మనోగతం. కోదండరాం పార్టీ, అటు సిపిఐ డెడ్ లైన్లు, అల్టిమేటంలు పెట్టడం కాంగ్రెస్ కు
రుచించని వ్యవహారం. కాంగ్రెస్ కు మనసా వాచా కర్మణా మద్దతునిచ్చే టిడిపి వెన్నంటి ఉన్నది.
చంద్రబాబు, రాహుల్ గాంధీ మధ్య జాతీయ స్థాయి ఒడంబడికలో తెలంగాణ పొత్తులు ఒక భాగం. కనుక
టిడిపి ‘సర్దుకుపోయే’ పద్దతిలోనే బేరసారాలు జరుగుతున్నవి. కాంగ్రెస్, టిడిపి పరస్పరం తమ సీట్లు,
అభ్యర్థుల జాబితాలను ఇచ్చిపుచ్చుకున్నవి. రెండు మూడు సీట్లలో తేడాలు ఉన్నా అవి కూటమిని
‘విచ్ఛిన్నం’ చేసే దాకా వెళ్లవు. అనుదుకు కారణం రాహుల్, చంద్రబాబు కమిట్ మెంటు. ఐదు స్థానాలు
ఇస్తేనే కూటమిలో కొనసాగుతామని సీపీఐ నాయకులు ఆదివారం తెగేసి చెప్పారు. సీపీఐ రాష్ట్రస్థాయి
కార్యవర్గ సమావేశంలో సిపిఐ నాయకులు కాంగ్రెస్ ధోరణిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు
సమాచారం అందింది. తమకు బలంలేని స్థానాలను తీసుకోరాదని సీపీఐ భావిస్తున్నది. వైరా,
హుస్నాబాద్‌, కొత్తగూడెం, మంచిర్యాల, బెల్లంపల్లి స్థానాలను సీపీఐ బలంగా కోరుతున్నది.సీట్ల
సర్దుబాటుపై కాంగ్రెస్ ‘సాచివేత ‘ ధోరణి ‘కూటమి’కి నష్టమన్నది ‘కంకి కొడవలి’ కామ్రేడ్ల
అభిప్రాయం.సీపీఐకి కనీసం 5 స్థానాలు కేటాయించాలని సీపీఐ తెలంగాణ కార్యదర్శి కామ్రేడ్ చాడ
వెంకటరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. టీడీపీకి 14 సీట్లు, టీజేఎస్, సీపీఐకి కలిపి 10 సీట్లు పోను 95
స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయాలనుకుంటున్నది. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆమోదం
తీసుకున్న తర్వాతే టీపీసీసీ అధ్యక్షడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆయా సీట్ల సంఖ్యను ప్రకటించినట్టు అర్ధం
చేసుకోవచ్చు. ఉత్తమ్ ప్రతిపాదనను ‘కూటమి’ భాగస్వాములు విభేదిస్తున్నారు. 14 సీట్లు తుది
ప్రకటన కాదని, 18 సీట్లు ఆశిస్తున్నామని టీడీపీ చెబుతున్న సంగతి తెలిసిందే. ఆలేరు, నకిరేకల్, కోదాడ
స్ధానాలను టీడీపీ కోరుతున్నట్టు వస్తున్న వార్తలు విడ్డూరంగా ఉన్నవి. కోదాడలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే
పద్మావతికి విజయావకాశాలు ఉన్నట్టు సర్వేలు చెబుతున్నవి. టిడిపి గట్టిగా కోరితే ఉత్తమ్ తన భార్య
సీటును త్యాగం చేయక తప్పదు. అయితే కోదాడలో టిడిపి విజయావకాశాలపై మిశ్రమ స్పందన ఉన్నది.
టిఆర్ఎస్ తరపున ఎన్ ఆర్ ఐ శానంపూడి సైదిరెడ్డి పోటీ చేస్తే టిడిపికి సానుకూల వాతావరణం
ఉండకపోవచ్చునన్న వాదన ఉన్నది. నకిరేకల్ లో టిఆర్ఎస్ కు బలమైన అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే
వేముల వీరేశంను చిత్తు చేయడం అంత సులభం కాదు. కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి

లింగయ్య బరిలోకి దిగితే కోమటిరెడ్డి బ్రదర్స్ అండదండలతో టిఆర్ఎస్ ను దెబ్బతీసే అవకాశాలున్నట్టు
నల్లగొండ రాజకీయాలపై అవగాహన ఉన్న వారి వాదన. ”సీపీఐకి మూడు సీట్లు” అంటూ వస్తున్న
వార్తలపై ఆ పార్టీ కామ్రేడ్లు భగ్గుమనడం సహజమే. ఆరు సీట్లు కావాలని, లేని పక్షంలో ‘ కనీసం ఐదు’
సీట్లు ఇచ్చినా సర్దుకుపోగలమని సీపీఐ కాంగ్రెస్ కు సందేశం పంపింది. సీట్ల పంపకం వ్యవహారం
మహాకూటమిలో సంక్షోభానికి దారితీసేలా కనిపించినా అది సులభం కాదు. ఇంత దూరం ప్రయాణించిన
తర్వాత కేసీఆర్ ‘గడీ’ని ‘కూల్చబోతున్నామంటూ గంభీరంగా చేసిన ప్రకటనలు నిర్వీర్యమవుతాయి.
కేసీఆర్ నెత్తిన పాలు పోసిన వారవుతారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఎమ్మెల్సీలను
ఇస్తామని సీపీఐ నాయకులకు కాంగ్రెస్ నుంచి హామీ లభించినా ఆ పార్టీ కామ్రేడ్లు సంతృప్తి చెందడం
లేదు. ఖమ్మం జిల్లాలో వైరా, కొత్తగూడెం, నల్లగొండ జిల్లాలో మునుగోడు, ఆలేరుల్లో ఒక స్థానం,
కరీంనగర్‌ జిల్లాలో హుస్నాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లిల్లో ఒక స్థానం
కేటాయించాలని సిపిఐ కోరుతున్నది. అందుకు విరుద్ధంగా కాం మూడు రిజర్వుడ్‌ స్థానాలను ఇస్తామని
సీపీఐకి కాంగ్రెస్ నుంచి సమాచారం అందినట్టు తెలుస్తున్నది. నిరంకుశ విధానాలతో రాష్ట్రాన్ని భ్రష్టు
పట్టించిన కేసీఆర్‌ను ఓడించాలనే లక్ష్యంతో మహాకూటమి ఏర్పాటులో తాము కీలక పాత్ర పోషించామని,
అలాంటి తమను రెండు, మూడు సీట్లకే పరిమితం చేయాలనుకోవడమేంటని చాడ వెంకటరెడ్డి
మండిపడ్డారు.హుస్నాబాద్, కొత్తగూడెం సెగ్మెంట్లను బలంగా ఎందుకు కోరుతున్నారంటే తెలంగాణ
కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హుస్నాబాద్ నుంచి, తెలంగాణ సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
కొత్తగూడెం నుంచి పోటీ చేయదలిచారు. వాళ్లిద్దరూ ఆ స్థానాల నుంచి శాసనసభలో ప్రాతినిధ్యం వహించిన
చరిత్ర ఉన్నది. ప్రస్తుతం సిపిఐ కోరుతున్న ఐదారు అసెంబ్లీ నియోజకవర్గాల్లో, టీజెఎస్ కోరుతున్న 8
లేదా 10 సెగ్మెంట్లలో ఆ పార్టీలు క్లెయిమ్ చేస్తున్నట్టుగా, లేదా వాదిస్తున్నట్టుగా ‘వాతావరణం’ లేదు.
అలాగే ‘మిత్రపక్షాలకు’ 24 సీట్లు ఇవ్వాలనుకుంటున్న కాంగ్రెస్ హైకమాండ్ కూడా అందులో సగం సీట్లపై
ఆశలు పెట్టుకోలేదని ఢిల్లీ వర్గాల సమాచారం. ‘కూటమి’ అనే రూపం వల్ల టిఆర్ఎస్ ను కకావికలం
చేయవచ్చునని, నాలుగు పార్టీలు సంఘటితంగా, సమన్వయంతో పనిచేస్తే కాంగ్రెస్ పోటీ చేసే 95 లో 50
స్థానాలను సొంతంగా గెలుచుకొని భాగస్వాముల బలంతో అధికారంలోకి రావాలన్నది కాంగ్రెస్
అభిప్రాయం.