కూడికలు – తీసివేతలు!!

ఎస్.కె. జకీర్.

‘‘వచ్చే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో వంద సీట్లలో మాకు యాభై శాతానికి పైగా ఓట్లు వస్తాయి. 82 నియోజకవర్గాల్లో 60 శాతం ఓట్లు సాధిస్తామ” ని కేసీఆర్ సెప్టెంబర్ 6 న చెప్పారు. తర్వాత ఆ సంఖ్య నల్లగొండ సభ నాటికి 110 కి పెరిగింది. అంటే ఆయన ఆయన దృష్టిలో ఎన్నికలు ‘ఏకపక్షంగా’ జరగనున్నవి. ప్రజలంతా టిఆర్ఎస్ వైపు నిలబడనున్నారు. చరిత్రలో చూస్తే పోలైన ఓట్లలో దేశవ్యాప్తంగా ఒక పార్టీకి 50 శాతానికి పైగా ఓట్లు వచ్చిన సందర్భాలు లోక్‌సభ ఎన్నికల్లో ఇంత వరకు లేవు. శాసనసభ ఎన్నికల్లో 41 సార్లు అది సాధ్యమైంది. అందులో ఇరవై సిక్కింలాంటి చిన్న రాష్ట్రాలే. ఇటీవలి కాలంలో అలాంటి ఘనత సాధించిన రాష్ట్రం ఢిల్లీ ఒక్కటే. 2015 శాసనసభ ఎన్నికల్లో ‘ఆమ్‌ ఆద్మీ పార్టీ’కి ఏకంగా 54.3 శాతం ఓట్లు వచ్చాయి. మొత్తం 70 స్థానాల్లో ఏకంగా 67 సీట్లను ‘ఆప్‌’ గెలుచుకుంది. 95.71 శాతం సీట్లలో విజయం సాధించింది. అంతకు ముందు ఇలాంటి విజయం చివరిసారిగా 1990లో ఒడిశాలో నమోదైంది. బిజూ పట్నాయక్‌ నాయకత్వంలో జనతాదళ్‌ 53.69 శాతం ఓట్లు సంపాదించింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒకసారి కాంగ్రెస్‌, మరోసారి టీడీపీ ఈ ఘనతను సాధించినట్టు రికార్డులు చెబుతున్నవి. 1972 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 52.17 శాతం ఓట్లతో తిరుగులేని విజయం సాధించింది.

1983లో ఎన్‌టీ రామారావు ప్రభంజనంలో తెలుగుదేశం పార్టీ 54.03 శాతం ఓట్లు సాధించింది. సిక్కిం లో 6 సార్లు, గుజరాత్‌ లో 4 సార్లు , కర్ణాటక లో 3 సార్లు ఒక పార్టీకి యాభై శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ అత్యధికసార్లు ఈ స్కోరు సాధించగా , టీడీపీ, ఆప్‌, జనతాదళ్‌, జనతాపార్టీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఒక్కోసారి సాధించాయి. ప్రాంతీయ పార్టీలు పెరగడం, ద్విముఖ పోటీ తగ్గిపోవడంతో 50 శాతం ఓట్లను సాధించే రికార్డు నమోదు చేయడం సాధ్యం కావడం లేదు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ విషయానికి వస్తే 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 119 సీట్లలో పోటీచేసి 34.15 శాతం ఓట్లు సాధించింది. 63 సీట్లు గెలిచింది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 34 శాతం ఓట్లు అంటే 66 లక్షల ఓట్లు సాధించింది. కాంగ్రెస్ పార్టీ 25 శాతం ఓట్లు సాధించింది. అప్పుడు టీడీపీ-బీజేపీకి పొత్తు ద్వారా 21 శాతం ఓట్లు సాధించింది. ఇందులో టీడీపీ ఓటింగ్‌ కేవలం 15 శాతం గానే ఇక్కడ లెక్కగడితే దీనిప్రకారం ప్రస్తుతం టీడీపీ – కాంగ్రెస్ పొత్తు ద్వారా సాధించే ఓటింగ్ 40 శాతం అవుతుందని అంచనా. ఇది గత ఎన్నికల్లో టీఆర్ఎస్ సాధించిన ఓట్లకంటే ఎక్కువ . టీఆర్ఎస్ ప్రభుత్వంపై నాలుగున్నరేళ్లలో ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత ఉంటుంది. కనుక టీఆర్ఎస్‌ కన్నా తమా పెర్ఫార్మెన్స్ బాగుంటుందని కనీసం 70 – 80 సీట్లలో గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ అంచనా కొచ్చింది. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ‘కాంగ్రెస్ కూటమి’ ని ప్రజలు ఆమోదితే , ప్రభుత్వ వ్యతిరేక ఓటు కచ్చితంగా కాంగ్రెస్ కూటమికే దక్కవచ్చును.

ప్రస్తుతం టీడీపీ ఎంత బలహీన పడినా, గతంలో వచ్చిన 15 శాతం ఓట్లు రాకపోయినా, 9 శాతమో,10శాతమో ఓటింగ్ దక్కినా గానీ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింట్ కావచ్చు. మరోవైపు ఈ పొత్తువల్ల కాంగ్రెసు కూటమి గెలుస్తుందన్న విశ్వాసం ప్రజల లో వస్తే టీఆర్ఎస్ లో చేరిన, టీడీపీ నేతలు కార్యకర్తలు మళ్లీ టీడీపీ వైపు వస్తారన్న ఆశాభావమూ ఉన్నది. అలాంటి విశ్వాసం ఓటర్లలో కల్పించడంలో టీడీపీ అడుగు ముందుకు వేయడానికి ప్రయత్నిస్తున్నది. కాంగ్రెస్ – టీడీపీ పొత్తుసంకేతాలతో టీడీపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. మరోవైపు బీజేపీ కూడా వ్యూహాలు పన్నే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 25 సీట్లలో త్రిముఖ పోటి ఉండే అవకాశం లేకపోలేదు. కాంగ్రెస్ తో తెలుగుదేశం పార్టీ పొత్తు అనైతికమన్న విమర్శలు, దూషణలు ఊపందుకున్నవి. ‘కూటమి’ ని భగ్నం చేయాలన్న ప్రయత్నాలతో పాటు ‘కూటమి’ ని విఫలం చేయాలని కూడా అధికారపక్షం నుంచి వ్యూహరచన జరిగిందన్న వార్తలు వస్తున్నవి. కాగా కాంగ్రెస్ పార్టీ ఓట్లు, సీట్లపై మరికొందరు కేసీఆర్ అనుకూల వర్గాల విశ్లేషణ ఇలా సాగుతున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు తెలంగాణలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో గత 35 ఏళ్లలో ఎన్న‌డూ 60 సీట్లు ద‌క్కించుకున్న చ‌రిత్ర లేదన్నది ఆ విశ్లేషణ. తెలంగాణలో అధికారం దక్కాలంటే,కనీసం ‘మ్యాజిక్ మార్కు’ 60 సీట్లలో గెలుపు అత్యవసరం. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ కు 43 అసెంబ్లీ స్థానాలు లభించాయి. 1985 లో 14 సీట్లు, 1989 లో 58 సీట్లు, 1994 లో 10 సీట్లు, 1999 లో 43 సీట్లు, 2004 లో 54 సీట్లు, 2009 లో 50 సీట్లు లభించాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరణ అనంతరం 2014 లో 21 సీట్లు మాత్రమే కాంగ్రెస్ కు దక్కాయి. అయితే 2004, 2009 లలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తెలంగాణ నుంచి వచ్చిన సీట్లు కీలకమైనవి. 1983 లో టిడిపి అధ్యక్షుడు ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ తెలంగాణా వాటా 43 సీట్లు. 1989 లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తెలంగాణే కారణం. 2009 లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతునపుడు సైతం కాంగ్రెస్ కు ఇక్కడి ఓటర్లు 50 సీట్లు కట్టబెట్టడాన్ని మరచిపోరాదు . కనుక ఈ కూడికలు – తీసివేతలు ఆయా రాజకీయపక్షాలు తమ వాదనలకు అనుకూలంగా మలచుకొని మాట్లాడుతుంటాయి. ప్రజల చైతన్యస్థాయి మునుపటికన్నా బాగా పెరిగింది. ఇంకా చెప్పాలంటే 2014 కు 2018 కి కూడా ఈ చైతన్యస్థాయిలో అనూహ్యమైన తేడా కనిపిస్తున్నది. సోషల్ మీడియా విప్లవానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి.