కెసిఆర్ కోపం వచ్చింది

కెసిఆర్ కు కోపమొచ్చింది!

ఆర్టీసీ ‘సమ్మె’పై గరం,గరం.

హైదరాబాద్;

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీసు వ్యవహారం పై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు.సమ్మెకు దిగితే కటిన చర్యలు తప్పవని, ఉద్యోగం కోల్పోవలసివస్తుందని ఆయన హెచ్చరించారు.‘ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు వేతనాలు చెల్లిస్తాం.కొన్ని రకాల పన్నులను రద్దు చేయడం వల్ల ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావచ్చు.’ అని 2014 ఎన్నికల ప్రచార సభల్లో కెసిఆర్ అన్నారు.  2016 జూన్ 16 న మారియట్ హోటల్ లో ఆర్టీసి నష్టాలపై ప్రభుత్వం సుదీర్ఘంగా చర్చించింది. ‘ నష్టాలతో నడపడం కన్నా సంస్థను మూసియడమేవె మంచిది’ అని కెసిఆర్ అభిప్రాయపడినట్టు వార్తలు వెలువడ్డాయి. ‘ప్రభుత్వరంగ సంస్తలను కాపాడుతాం.ప్రైవేటుపరం చేయం.గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ మెడపై ప్రైవేటీకరణ కత్తి ఎప్పుడూ వేలాడుతూ ఉండేది.మా ప్రభుత్వం రాగానే 700 కోట్లు ఆర్టీసీకి ఇచ్చాం.’ అని 2017 జనవరి 5 న్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పారు. ‘సమ్మె పేరుతో బ్లాక్ మెయిల్ వ్యవహారాలు కుదరవు.తెలంగాణా ఆర్టీసీ 2800 కోట్ల అప్పుల్లో ఉన్నది. యేటా 700 కోట్ల నష్టాలు వస్తున్నాయి.ఈ నష్టాలు పూడ్చుకోగలిగినవే అయినా, ఆ దిశగా కృషి చేయడం లేదు.కొత్త ఆదాయమార్గాల అన్వేషణలో విఫలమవుతున్నారు.నేను 1997లో  రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీ 14.50 కోట్ల నష్టాల్లో ఉంది.ఆ నస్తాల నుంచి గట్టేక్కించి మరో 14 కోట్ల లాభాలలోకి సంస్థను తీసుకు వచ్చాను.మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్ లలో ఆర్టీసీ లేదు.కేరళలో 300 బస్సులే నడుస్తున్నాయి.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీ ఉద్యోగులకు 44 శాతం ఫిట్ మెంట్ ఇచ్చాం.ఇంకా జీతాలు పెంచమని కోరడం సరైంది కాదు.కార్మికులు సమ్మె  చేస్తే సంస్థ మరిన్ని నష్టాల్లో కూరుకుపోతుంది.కార్మికులు, యాజమాన్యం కూడా మునిగిపోతారు.’ అని గత మే 16 న మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు.తెలంగాణ ఉద్యమ చరిత్రలో సకలజనుల సమ్మెకు ఓ ప్రత్యేకత ఉంది. ఆ పోరాటంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర వెలకట్టలేనిది. తెలంగాణ రాష్ట్రం వచ్చినా ఆర్టీసీ కార్మికులకు మాత్రం నేటికీ న్యాయం జరగలేదు. ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనని ఇతర శాఖల ఉద్యోగులు సకల జనుల సమ్మె కాలానికి వేతనంతో కూడిన సెలవును పొందారు. పోరును ముందుండి నడిపిన ఆర్టీసీ కార్మికులకు ఆ భాగ్యం దక్కలేదు.టీఎస్‌ఆర్టీసీలో వేతన సవరణ రగడ ఉధృతమవుతోంది. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుంటే నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు గుర్తింపు సంఘం టీఎంయూ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇవ్వడం ప్రభుత్వానికి మింగుడుపడడం లేదు.టీఎస్ఆర్టీసీలో వేతన సవరణ జరగకపోవడంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కొత్త పీఆర్సీ కోసం అటు  ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ పోరాడుతున్న నేపధ్యంలో ఆర్టీసీ యూనియన్లు కూడా ఆందోళనకు దిగాయి. ఆర్టీసీ యాజమాన్యం స్పందించడం లేదు.  ఆర్టీసీలో ఉద్యోగులు, కార్మికులకు భద్రత కల్పించాలని, సకాలంలో జీతాలివ్వాలని టిఎంయూ డిమాండ్ చేస్తోంది . చీటికిమాటికీ కార్మికులు, ఉద్యోగుల మీద కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తోంది.2013కు సంబంధించిన పీఆర్సీ కాలపరిమితి 2017 మార్చి 31తో ముగిసింది. 2017 ఏప్రిల్ 1 నుంచి కొత్త వేతనాలు అమలుకావాలి. దీనికోసం ఆర్టీసీ యాజమాన్యం 4 నెలల క్రితం కొత్త పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసింది. గుర్తింపు సంస్థ తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేతలతో కలిసి ఆర్టీసీ అధికారులు వేసిన ఈ కమిటీ ఇప్పటిదాకా రెండు సార్లు మాత్రమే సమావేశమైంది. ఎంత మేరకు వేతనాలు పెంచాలన్న దానిపై  నిర్ణయం తీసుకోలేదు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం స్పందించకపోవడంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.2015లో 8 రోజులపాటు జరిగిన ఆర్టీసీ సమ్మెకు మంత్రి  హరీశ్ రావు మద్దతు పలికారంటూ ప్రచారం జరిగింది. ప్రభుత్వ, సింగరేణి, విద్యుత్‌ ఉద్యోగులకు సకల జనుల సమ్మె కాలానికి వేతనాలు దక్కాయి. రోజుకు రెండు వందల చొప్పున కన్సాలిడేటెడ్ పే పేరుతో వేతనం ఇచ్చారు. అయితే సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొని అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న ఆర్టీసీ కార్మికులను మాత్రం ప్రభుత్వం విస్మరించింది. సకల జనుల సమ్మె కాలంలో ఆర్టీసీ కార్మికులు కోల్పోయిన వేతనాన్ని.. సెలవులను తిరిగి ఇస్తామని సీఎం కేసీఆర్‌ గతంలో హామీ ఇచ్చారు. ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికల సమయంలోనూ ఇదే విషయాన్ని అధికార పార్టీ నేతలు చెప్పారు. సమ్మెకాల వేతనంపై ఏ రకమైన స్పష్టత రాలేదు. దీంతో ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సకల జనుల సమ్మె కాల వేతనమే కాదు.. ప్రస్తుతం ఇస్తున్న తెలంగాణ ఇంక్రిమెంట్ విషయంలోనూ మార్పులు చేయాలని కార్మికులు కోరుతున్నారు.  సకల జనుల సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవుగా పరిగణిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2011 సెప్టెంబర్‌ నుంచి అక్టోబర్ 24 వరకు 42 రోజుల పాటు ఆ సమ్మె జరిగింది. దేశ చరిత్రలోనే 42 రోజలు సాగిన సకల జనుల ఉద్యమం చిరస్థాయిగా నిలిచింది. ఒక రాష్ట్ర సాధన కోసం దేశంలోనే ఇలాంటి సమ్మె జరగడం చారిత్రాత్మకం.సకల జనుల సమ్మెలో 42 రోజుల పాటు అన్ని స్థాయిల ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.అటెండర్ స్థాయి నుంచి మొదలుకొని గెజిటెడ్ అధికారి వరకు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. అయితే అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఈ సమ్మె కాలాన్ని సాధారణ సెలువుగా పరిగణించడానికి అంగీకరించలేదు. ఉద్యోగుల సెలవుల్లోంచే వీటిని వాడుకోవాలని స్పష్టం చేసింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగ సంఘాల నేతలు పలుమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉద్యోగులకు అనేక వరాలు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సకలజనుల సమ్మెను స్పెషల్ క్యాజువల్ లీవ్‌గా పరిగణిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. 2015లో ఆర్తీసే కార్మికులు 8 రోజులు సమ్మె చేశారు. ప్రభుత్వం దిగివచ్చింది.ఆర్టీసీ కార్మికులకు 44% ఫిట్ మెంట్ను కెసిఆర్  ప్రకటించారు. ఫిట్ మెంట్ పెంపుదల వల్ల ఆర్టీసీపై రూ. 821 కోట్ల భారం పడిందని కెసిఆర్ అన్నారు. ఇప్పటికే ఆర్టీసీ రూ. 400 కోట్ల పై చిలుకు నష్టాల్లో ఉందన్నారు. ఆర్టీసీని, ఇతర ప్రభుత్వ రంగం సంస్థలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం చేయమని సి.ఎం.కెసిఆర్ హామీ ఇచ్చారు. ప్రతి సంవత్సరం బడ్జెట్ లో ఆర్టీసీ కి గ్రాంట్ ఇవ్వనున్నట్లు సీఎం 2015 లో  ప్రకటించారు. తెలంగాణలో ఎనిమిది రోజుల పాటు ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది జరిపిన సమ్మె, దానిపట్ల ప్రభుత్వ వైఖరి, న్యాయస్థానాల వైఖరి, ప్రధాన సామాజిక వర్గాల వైఖరి తప్పనిసరిగా సమీక్షించుకోవలసి వుంది. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన తప్పులను సవరిస్తామనీ, అప్పటి ప్రజావ్యతిరేక విధానాలను మారుస్తామనీ తెలంగాణ ఉద్యమ కాలంలో వాగ్దానాలు వెల్లువెత్తాయి. తెలంగాణ ఆర్టీసీని బలమైన ప్రజా రవాణా సంస్థగా తీర్చి దిద్దుతారని భావించారు. ఆర్టీసీని బలమైన ప్రజారవాణా సంస్థగా తీర్చిదిద్దడమంటే ఆ సంస్థ కార్మికులనూ సిబ్బందినీ పరిగణనలోకి తీసుకుని, వారిని శత్రువుల్లా, బానిసల్లా కాక, మనుషులుగా, తమ నెత్తుటినీ చెమటనూ ప్రజాసేవకు ధారపోస్తున్న కార్మికులుగా గుర్తించడం. వారికి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం. 2013 ఆర్థిక సంవత్సరం నుంచే అమలు కావలసి ఉండిన నూతన వేతన ఒప్పందం. ఒక రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థగా తమకు కూడా రాష్ట్ర ప్రభుత్వోద్యోగులతో సమానమైన వేతనాలు, వేతన స్కేళ్లు, భృతులు ఉండాలని ఆర్టీసీ కార్మికులు కోరడం సహజ న్యాయసూత్రం. ఉద్యోగులకు 2015 జనవరిలోనే 43 శాతం ఫిట్‌ మెంట్‌ ప్రకటించాయి గాని, అప్పటికి ఇరవై నెలలుగా చర్చలలో ఉన్న ఆర్టీసీ కార్మికుల వేతన సవరణను మాత్రం పట్టించుకోకుండా వదిలేశాయి. అప్పటికి ఒక ఏడాదిగా అమలవుతున్న తాత్కాలిక, మధ్యంతర భృతి తప్ప స్థిరమైన, స్పష్టమైన వేతన సవరణ, కనీసం తోటి ఉద్యోగులతో సమానమైన వేతన సవరణ లేకుండా పోయింది.
ఈ పూర్వరంగంలో, దాదాపు అన్ని కార్మిక సంఘాల నాయకత్వంలోని కార్మికులు, సిబ్బంది వేతన సవరణ, పాత బకాయిల చెల్లింపు, పని పరిస్థితుల మెరుగుదల, డ్రైవర్‌ – కండక్టర్‌ బాధ్యతల విభజన, కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ, అద్దె బస్సుల రద్దు, కార్మికులపై అధికారుల వేధింపులను అరికట్టడం వంటి అనేక డిమాండ్లతో మూడేళ్ల క్రితం సమ్మె చేశారు. సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి యాజమాన్యమూ ప్రభుత్వ శాఖలూ కూడ అన్ని రకాల కుటిల ఎత్తుగడలకు పాల్పడ్డాయి. తాత్కాలిక డ్రైవర్లను, కండక్టర్లను నియమించి సమ్మెను భగ్నం  చేయడానికి ప్రయత్నించాయి. ఎన్నోచోట్ల కార్మికుల మీద లాఠీఛార్జిలూ, అరెస్టులూ, కేసులూ వంటి నిర్బంధ చర్యలకు పూనుకున్నాయి. అత్యవసర సర్వీసుల చట్టాన్ని ప్రయోగిస్తామని బెదిరించాయి. సమ్మెకారులతో చర్చలు జరిపేదే లేదని బెదిరిస్తూనే, చర్చలు జరపడానికి మంత్రివర్గ ఉపసంఘం వేస్తున్నామని బుజ్జగింపులు ప్రారంభించాయి. చర్చల క్రమంలో ఆర్టీసీ నష్టాల్లో ఉంది గనుక కార్మికులు అడిగిన వేతన ఫిట్‌మెంట్‌ సాధ్యం కాదని ప్రభుత్వం వాదించింది. నిజానికి ఆర్టీసీ నష్టాలు అనేవి యాజమాన్యాల, ప్రభుత్వాల విధానాల ఫలితమే తప్ప వాస్తవం కాదని ఇప్పటికి ఎన్నో అధ్యయనాల్లో రుజువైంది. డీజిల్‌ మీద పన్ను, లాభసాటి మార్గాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం, ప్రైవేటు రవాణా సంస్థల అక్రమాలను అడ్డుకోకపోవడం, వివిధ వర్గాలకు ప్రకటించిన రాయితీల సొమ్ము ఆర్టీసీకి అందించకపోవడం, టోల్‌ సుంకం మినహాయింపు కోసం ప్రయత్నించకపోవడం వంటి అనేక చర్యల ద్వారా ప్రభుత్వాలే ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతున్నాయి. మరొకపక్క నష్టాలు వస్తున్నాయంటున్న కాలంలోనే ఆర్టీసీ ఆస్తులు విరివిగా పెరిగాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ మాటల తీరును బట్టి ఆయన టీఎస్ఆర్టీసీ ని క్రమంగా  ప్రైవేటీకరిస్తారన్న ప్రచారం ఊపందుకుంటున్నది.  ప్రభుత్వం అనుసరిస్తున్న విధి, విధానాల వల్లే ఆర్టీసీ నష్టాల బాటలో పయనిస్తుందని జనసమితి పార్టీ  అధ్యక్షుడు, ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. నష్టాలు ఎందుకు వస్తున్నాయన్న విషయాలపై చర్చించకుండా ఆర్టీసీ కార్మికుల వల్లే నష్టాలు వస్తున్నాయనడం భావ్యం కాదన్నారు.ఆర్టీసీ రకరకాల కారణాలతో నష్టపోతున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. భారం మోస్తున్న కార్మికుల వల్లే నష్టాలు అనడం బాధగా ఉందన్నారు.  ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్‌సీ ఇవ్వక 14 నెలలు గడుస్తోందని అన్నారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు పావులు కదపడం సిగ్గుచేటన్నారు.