కేంద్రంలో ‘ దుష్ట చతుష్టయం’.

ప్రకాశ్, న్యూఢిల్లీ:
ప్రత్యర్థులపైనే కాదు.. సొంత పార్టీ నేతలపైనా నిప్పులు చెరిగే విమర్శలు చేయడానికి వెనుకాడని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సంచలనం రేకెత్తిస్తున్న సీబీఐ వివాదంపై తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్‌లోని నిర్మా యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన యూత్‌ పార్లమెంట్‌కు హాజరైన స్వామి.. సీబీఐ వివాదానికి కేంద్రంలోని నలుగురు వ్యక్తులే కారణమని ఆరోపించారు. తమ ప్రభుత్వమే నిందితులను కాపాడుతోందని, అలాంటప్పుడు తాను అవినీతిపై పోరాడడం వల్ల లాభమేంటని వ్యాఖ్యానించారు. అవినీతి అధికారులను శిక్షించకపోతే ఎన్నికల్లో బీజేపీ గెలుపు కష్టమని అభిప్రాయపడ్డారు.

సీబీఐ మాజీ స్పెషల్ డైరెక్టర్‌ రాకేష్ అస్థానా, రెవెన్యూ కార్యదర్శి హస్ ముఖ్‌ అదియా, పీఎంవో అధికారులు పీకే మిశ్రా, భాస్కర్‌ ఖుల్బే సీబీఐ పాలనా వ్యవస్థపై పైచేయి సాధించేందుకు ఎన్నో తప్పులు చేశారని స్వామి మండిపడ్డారు. ‘కేంద్రంలో ఓ నలుగురి గ్యాంగ్‌ ఉంది. ప్రభుత్వంలోని ఓ కేంద్ర మంత్రి ఆదేశాలతో ఈ నలుగురు పి. చిదంబరంను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ, దేశ ప్రజల ప్రయోజనాల కోసం వాళ్లు పని చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో మేము ప్రజలకు జవాబు చెప్పలేక ఇబ్బంది పడుతున్నాం. వచ్చే ఎన్నికల్లో మేమెలా ప్రచారం చేస్తాం? అవినీతి అధికారులను జైలుకు పంపకపోతే, నల్లధనాన్ని వెనక్కి తీసుకురాకపోతే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయే అవకాశముంద’ని స్వామి అన్నారు.నరేంద్రమోడీ ఉత్తమ ప్రధాని అని తాను ఇప్పటికీ నమ్ముతున్నానని, అయితే ఆయన అధికారుల ఎంపిక మాత్రం సరిగా లేదని సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. ఢిల్లీలో పూర్తి అవినీతి వాతావరణం ఉందని, అది ఓ వ్యక్తి ఆలోచనను కూడా పూర్తిగా మార్చేస్తుందని స్వామి చెప్పారు. ప్రభుత్వంలోనే ఉంటూ అదే ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారని, రానున్న రోజుల్లో వారి పేర్లు బయటపెడతానని తెలిపారు. ‘ఇలాంటి వాళ్లు ప్రభుత్వంలో ఉంటే ప్రతిపక్షం అవసరం లేదు. విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోడీ, మెహుల్ చోక్సీ వంటివారు దేశం విడిచిపోయేలా చేసింది వారే. చిదంబరంను కూడా కాపాడాలని చూస్తున్నారు. ఆలోక్‌ వర్మ నిజాయతీ గల అధికారి. ఆయనను సీబీఐ డైరెక్టర్‌గా తప్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని మోడీ వెనక్కి తీసుకోవాల’ని స్వామి కోరారు.