కేకే.మహేందర్ రెడ్డితో మంతనాల మర్మం?

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు.సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు కేకే.మహేందర్ రెడ్డిని టిఆర్ ఎస్ లోకి ఆహ్వానించినట్టు జరుగుతున్న ప్రచారం సంచలనం సృష్టిస్తున్నది.ఇవన్నీ వదంతులేనని మహేందర్ రెడ్డి కొట్టి పారేశారు.

రాజన్నసిరిసిల్ల ;
సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర సమితి మాజీ నేత కేకే. మహేందర్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర సమితి గాలం వేస్తున్నట్టు తెలుస్తోంది. కొందరు టిఆర్ ఎస్ నాయకులు ఆయనతో మంతనాలు జరిపారంటూ వస్తున్న సమాచారం ఇందుకు ప్రాతిపదిక. 2009 ఎన్నికల్లో కేటిఆర్ పై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి కేవలం 171 ఓట్లతో ఓడిపోయిన సీనియర్ న్యాయవాది కె.కె.మహేందర్ రెడ్డి టిఆర్ఎస్ అవిర్భావం నుంచి ఆ పార్టీ లో క్రియాశీలంగా పనిచేశారు. కేటియార్ కోసం మహేందర్ రెడ్డికి టికెట్టు నిరాకరించడంతో ఆయన కాంగ్రెస్ లో చేరారు. 2014లో కేటిఆర్ పై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రవీందర్ రావు సహా పలువురు నాయకులు టిఆర్ఎస్ లో చేరిపోయారు. మహేందర్ రెడ్డిని కూడా చేర్చుకోగలిగితే ఆ నియోజకవర్గంలో మొత్తం కాంగ్రెస్ నాయకత్వాన్ని తుడిచిపెట్టినట్లవుతుందని ‘ప్రగతిభవన్’ ఆలోచన అని తెలుస్తోంది.ఇప్పుడు మళ్ళీ కె.కె ను టి ఆర్ ఎస్ లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయన్న ప్రచారం ఊపందుకున్నది.ఈ మేరకు కెసిఆర్ తరపున కొందరు మధ్యవర్ధులు మహేందర్ రెడ్డి తో చర్చలు జరిపినట్టు కూడా ప్రచారం జోరుగా సాగుతున్నది.మహేందర్ రెడ్డి నిర్ణయం మాత్రం ఇంకా వెల్లడి కాలేదని, కానీ తనతో టిఆర్ ఎస్ మధ్యవర్తులు సంప్రదించిన విషయాన్ని తన సన్నిహితుల దగ్గర మహేందర్ రెడ్డి పరోక్షంగా ధ్రువీకరించినట్టు తెలంగాణా రాష్ట్ర సమితికి చెందిన సిరిసిల్ల కార్యకర్తలు చెబుతున్నారు.ఇవన్నీ వదంతులని కె.కె. మహేందర్ రెడ్డి కొట్టిపారేశారు.సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నందున తన అనుచరులను, కాంగ్రెస్ కార్యకర్తలను గందరగోళంలో పడవేసేందుకు టిఆర్ఎస్ పన్నని చౌకబారు ఎత్తుగడ అని ఆయన అన్నారు. ఇదంతా కెసిఆర్ మైండ్ గేమ్ అని కూడా విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ తరపున సిరిసిల్ల నుంచి తానూ పోటీ చేయనున్నట్టు స్పష్టం చేశారు.అటు వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ‘ఆకర్ష్ ‘ పథకం అమలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.వేములవాడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఏనుగు మనోహరరెడ్డికి టిఆర్ ఎస్ గాలం వేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది.