కేసీఆర్ ‘ఓటు బ్యాంకు’ల వేట!

” మా జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలు మాత్రమే మా పార్టీ గెలుచుకునే పరిస్థితి ఉన్నది. మిగతా చోట్ల కాంగ్రెస్ గెలుస్తుంది.” అని 12 అసెంబ్లీ నియోజకవర్గాలతో ఉన్న ఒక జిల్లాకు చెందిన టిఆర్ఎస్ శాసనసభ్యుడు ఒకరు తన అంతరంగాన్ని కొద్దీ రోజుల క్రితం హైదరాబాద్ లో కొందరు విలేకరుల ముందు ఆవిష్కరించారు.దీన్ని బట్టి పార్టీల బలాబలాలను ఎలా అంచనా వేయవచ్చును? కేసీఆర్ సంక్షేమ పథకాల తుపాను ఆ జిల్లాను తాకలేదా? ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఎందుకు ఉన్నట్టు? అక్కడ కేసీఆర్ పై సానుకూలత ఎందుకు లేనట్టు? లోపం ఎక్కడున్నది? పాపం ఎవరిదీ?ఇచ్చిన హామీలు, చేసిన వాగ్దానాలు పూర్తి స్థాయిలో అమలు కాలేదన్న అభిప్రాయం ప్రజల్లో ఉన్నది. ఇప్పటికే తెలంగాణలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు స్వైరవిహారం చేస్తున్నా ప్రజల్లో ఇంకా ఎక్కడో… ఏదో అసంతృప్తి… నిరాశ. అందుకే మ‌రికొన్ని ‘జ‌నాక‌ర్ష‌క ప‌థ‌కాల’ కు రూపకల్పన జరుగుతున్నది. రైతులకు 2 లక్షల రుణమాఫీని కాంగ్రెస్ ప్రకటించినందున దానికి విరుగుడుగా టిఆర్ఎస్ కూడా మరోసారి రుణమాఫీని అమలుచేసే అంశంపై కసరత్తు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. మిగతా కార్యక్రమాల సంగతి ఎలా ఉన్నా ఎస్.సి, ఎస్.టి లకు మూడెకరాల భూమి పంపిణీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు వంటి పథకాలు అధికారపార్టీని ‘ఆత్మరక్షణ’ లో పడవేసే అవకాశాలున్నవి.

ఎస్.కే.జకీర్.
దేశంలో నిర్దిష్ట ‘ ఓటు బ్యాంకు’ లేని ఏకైక పార్టీ టీఆర్‌ఎస్. ఇప్పటిదాకా కేసీఆర్ పార్టీ గెలుపునకు ‘తెలంగాణ సెంటిమెంట్’ ఇంధనం వలె పనిచేసింది. ఇప్పుడిక భావోద్వాగాలు లేవు. కృత్రిమంగా ఏవైనా ‘భావోద్వేగాల’ సృష్టికి ప్రయత్నించినా ఫలితం ఉండదు. ఈ సంగతి టిఆర్ఎస్ నిర్మాత కేసీఆర్ కు తెలుసు. ప్రభుత్వానికి ‘అనుకూల’ ఓట్లు కావాలి. ప్రభుత్వ పనితీరుకు ప్రజలు ‘పట్టం’ కట్టవలసి ఉన్నది. ఎన్నికలకు సమయం సమీపిస్తున్నది. గెలుపుపై టీఆర్‌ఎస్‌లో ‘ధీమా’తో పాటు ‘ఆందోళన’ కూడా ఉన్నది.కారణం కేసీఆర్ ‘ఫ్యాక్టర్’ ఒక్కటే శక్తిమంతంగా ఉండడం. ‘గాంభీర్యం’ తప్ప పూర్తి మెజారిటీతో గెలుస్తామన్న నమ్మకం ఆ పార్టీ శాసనసభ్యులలో లేదు.” మా జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలు మాత్రమే మా పార్టీ గెలుచుకునే పరిస్థితి ఉన్నది. మిగతా చోట్ల కాంగ్రెస్ గెలుస్తుంది.” అని 12 అసెంబ్లీ నియోజకవర్గాలతో ఉన్న ఒక జిల్లాకు చెందిన టిఆర్ఎస్ శాసనసభ్యుడు ఒకరు తన అంతరంగాన్ని కొద్దీ రోజుల క్రితం హైదరాబాద్ లో కొందరు విలేకరుల ముందు ఆవిష్కరించారు.దీన్ని బట్టి పార్టీల బలాబలాలను ఎలా అంచనా వేయవచ్చును? కేసీఆర్ సంక్షేమ పథకాల తుపాను ఆ జిల్లాను తాకలేదా? ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఎందుకు ఉన్నట్టు? అక్కడ కేసీఆర్ పై సానుకూలత ఎందుకు లేనట్టు? లోపం ఎక్కడున్నది? పాపం ఎవరిదీ?ఇచ్చిన హామీలు, చేసిన వాగ్దానాలు పూర్తి స్థాయిలో అమలు కాలేదన్న అభిప్రాయం ప్రజల్లో ఉన్నది. ఇప్పటికే తెలంగాణలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు స్వైరవిహారం చేస్తున్నా ప్రజల్లో ఇంకా ఎక్కడో… ఏదో అసంతృప్తి… నిరాశ. అందుకే మ‌రికొన్ని ‘జ‌నాక‌ర్ష‌క ప‌థ‌కాల’ కు రూపకల్పన జరుగుతున్నది. రైతులకు 2 లక్షల రుణమాఫీని కాంగ్రెస్ ప్రకటించినందున దానికి విరుగుడుగా టిఆర్ఎస్ కూడా మరోసారి రుణమాఫీని అమలుచేసే అంశంపై కసరత్తు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. మ‌రి కొన్ని ప‌థ‌కాల‌ను డిజైన్ చేసి, ద‌శ‌ల‌వారీగా ఒక్కో ప‌థ‌కాన్నీ ప్ర‌వేశ‌పెట్టాల‌నీ, త‌ద్వారా ప్ర‌జ‌లకు మ‌రింత చేరువ కావాల‌నే ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నారు. వివిధ కులవృత్తుల వారికి ఇప్ప‌టికే గొర్రెల పెంప‌కం, వృత్తుల వారిగ సాయం వంటి జ‌నాక‌ర్ష‌క ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టారు. రాష్ట్రంలో వివిధ సాగునీటి ప్రాజెక్టుల‌కు సంబంధించిన స‌మాచారాన్ని కూడా పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లబోతున్నారు.ప్రభుత్వం అన్ని సెక్షన్ల ప్రజల్ని సంతృప్తి పరచినట్టు చెబుతున్నా మహిళలను మరచిపోయినట్టు అధికారపక్షంలో వినిపిస్తున్నది. టిఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావాలంటే మహిళల ఓట్లు కీలకమని అధికారపార్టీ ఆలస్యంగా గుర్తించినట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలో మహిళా మంత్రి లేరు. అయినా వారి ఓట్లు కావాలంటే మహిళల మద్దతును కూడగట్టవలసి ఉన్నది. మహిళలకు ఏం కావాలి? ఎలాంటి ఆకర్శణీయమైన పథకాలను అమలు చేయాలన్న అంశంపై కేసీఆర్ కసరత్తు మొదలు పెట్టినట్టు తెలియవచ్చింది. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటీ? ఎలాంటి పరిష్కారం చూపాలి? అన్న అంశాలపై ఇంటెలిజెన్స్ వర్గాలు, టిఆర్ఎస్ తరపున పనిచేస్తున్న కొన్ని సర్వే సంస్థలు ‘ ప్రజాభిప్రాయ’ సేకరణ జరుపుతున్నవి. నాలుగున్నర సంవత్సరాలుగా మహిళ సంఘాలకు రుణాల మంజూరు ప్రక్రియ పై మహిళల స్పందనను తెలుసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ‘మహిళా స్వయం సహాయక సంఘాల’ వివరాలను నిఘా వర్గాలు సేకరిస్తున్నాయి. వృద్ధులకు, ఉద్యోగులకు, రైతుల కోసం తీసుకువచ్చిన పథకాల మాదిరిగా మహిళలు ఎలాంటి పథకాలను ఆశిస్తున్నారు? ఇప్పుడున్న రుణాలు రూ.5లక్షల నుంచి రూ.10లక్షల పెంచవలసి ఉంటుందా ? ఇంకా వేరే ఇతరత్రా కొత్త తరహా పథకాలకు శ్రీకారం చుట్టి మహిళలను ఆకర్షించవచ్చునా? వంటి ప్రశ్నలకు గ్రామాల్లో ‘నిఘా’ విభాగం అధికారవర్గాలు జవాబు రాబడుతున్నవి.కాగా నాలుగున్నరేళ్ల కాలంలో అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలు, లబ్దిదారుల వివరాలను ప్రభుత్వం క్రోడీకరిస్తున్నది.ప్రభుత్వ పథకాలే ఓట్లను రాల్చనుందని కేసీఆర్ గట్టిగా నమ్ముతున్నారు. ‘ సంక్షేమ’ లబ్ధిదార్లను గుర్తించవలసిందిగా అన్ని శాఖలను తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ జోషీ ఇటీవల ఆదేశించారు. తమ తమ శాఖల ద్వారా అమలు చేస్తున్న పథకాలు? కార్యక్రమాలు ? ఎంత మందికి ప్రయోజనం చేకూరింది? ఖర్చు చేసిన నిధులు? ఒక్కో వ్యక్తికి జరిగిన మేలు? వంటి వివరాలను పంపించాలంటూ ఆదేశించారు. ఈ సమాచారాన్ని ప్రచార రూపంలో ‘దట్టించి’ జనంలోకి వదలాలన్నది కేసీఆర్ లక్ష్యం అయి ఉండవచ్చును. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో పలు ‘ఫ్లాగ్‌షిప్‌’ పథకాలను ప్రారంభించింది. కేసీఆర్‌ కిట్స్‌, ఆరోగ్య లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, గొర్రెల పెంపకం, చేపల పెంపకం, ఆసరా పెన్షన్లు, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, హాస్టళ్లలో సన్న బియ్యం, ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల భూమి, బీడీ కార్మికులకు భృతి, ఒంటరి మహిళలు, హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులు, గీత కార్మికులు, చేనేత కార్మికులకు పెన్షన్లు వంటి పథకాలను ప్రారంభించింది. ఈ పథకాల ద్వారా లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనం చేకూరుతోందని ప్రభుత్వం, టిఆర్ ఎస్ పార్టీ భావిస్తున్నవి. ఇందులో మిగతా కార్యక్రమాల సంగతి ఎలా ఉన్నా ఎస్.సి, ఎస్.టి లకు మూడెకరాల భూమి పంపిణీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు వంటి పథకాలు అధికారపార్టీని ‘ఆత్మరక్షణ’ లో పడవేసే అవకాశాలున్నవి.