కేసీఆర్ ‘కంట్లో నలుసు’ రేవంత్.

  • కొ ‘దంగల్’ లో ఎన్నికల కోలాహలం.
  • మంత్రుల మోహరింపు.

ఎస్.కే.జకీర్.
కొడంగల్ నియోజకవర్గం లో ‘యుద్ధ మేఘాలు’ కమ్ముకున్నవి.టీఆర్ఎస్అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కెసిఆర్ కు ‘కంటి మీద కునుకు’ లేకుండా చేస్తూ, ఆయన కంట్లో నలుసుగా మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపైకి తెలంగాణ రాష్ట్ర సమితి ‘సైన్యం’ మోహరించింది. ‘శత్రుదేశం’ పై దండెత్తిన తరహాలో అధికారపక్షం కదన కుతూహలంతో కనిపిస్తున్నది.
కొడంగల్ ‘దంగల్’ గా మారిపోయింది. కేసీఆర్ ప్రభుత్వానికి’ఆయువుపట్టు’ అయిన ఇరిగేషన్ ప్రాజెక్టు ల్లో అవినీతిపై రేవంత్ రెడ్డి ‘ఆధారాలతో’ సహా చెలరేగిపోతుండడం అధికారపక్షానికి మింగుడు పడడం లేదు. దీంతో కేసీఆర్ ‘మిషన్ కొడంగల్’ను రచించినట్టు తెలుస్తున్నది.శనివారం నాడు కొడంగల్ నియోజకవర్గంలో మంత్రుల పర్యటన సాదాసీదాగా లేదు. రేవంత్ రెడ్డి పై ‘యుద్ధానికి’ బలగాలు తరలిన రీతిలో ఉన్నది.
మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, హరీష్ రావు, మహేందర్ రెడ్డి, తదితర నాయకులు వందల వాహనాలలో హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు.వారికి దారిపొడవునా టీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికినవి. మొయినాబాద్, చేవెళ్లలో పార్టీ జెండాను మంత్రులు ఎగురవేశారు.చేవెళ్ల లో ఎంఎల్ఏ యాదయ్య,టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పట్నం అవినాష్ రెడ్డి హల్ చల్ చేశారు. తెలంగాణలో కొడంగల్ నియోజ‌క‌వ‌ర్గంలో గెలుపుకోసం అవసరమైతే
100 కోట్లకు పైగా ఖర్చు చేయడానికి వెనుకాడరాదని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్టు తెలియవచ్చింది.రేవంత్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలోకి రాకుండా చూడాలని అధికారపక్షం కృతనిశ్చయంతో ఉన్నది.తెలంగాణ‌లో 119 నియోజ‌క వ‌ర్గాలలో
కొడంగల్ ‘హాట్ టాపిక్.’ రేవంత్ రెడ్డి బ‌లం,బ‌ల‌హీన‌త‌లమీదే ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇదివరకే ద్రుష్టి కేంద్రీక‌రించారు. ఆ నియోజ‌క వ‌ర్గంలోని ప్ర‌జలపై ఎమ్మెల్యే ‘పట్టు’ ఎలా సాధించారు?ప్రజలలో ఉన్న ఆదరణను ఎలా బలహీన పరచాలి అనే అంశాలపై టీఆర్ఎస్ బృందాలు విస్తృతంగా పర్యటించి క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేశాయి. రేవంత్ రెడ్డి బలాబలాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా సర్వే కూడా జరిపారు.రేవంత్ రెడ్డిని ఓడించే అవకాశాలు ఎంత మేర ఉన్నాయి? నియోజకవర్గంలో ఆయనకు బలమైన అనుచరులు ఎవరు? ఆయన వద్ద నుంచి ఎవరిని దూరం చేస్తే బాగా బలహీనపడతాడు లాంటి అంశాలపై ఈ సర్వే ద్వారా సమాచారం తెప్పించుకున్నారు.
అయితే రేవంత్ రెడ్డి గెలుపు ఖాయం అన్నది సర్వేల సారాంశంగా తెలుస్తోంది. కనీసం 20 వేల ఓట్లకు పైగా రేవంత్ రెడ్డికి మెజారిటీ కూడా ఖాయమని కొన్ని సర్వేలలో వెల్లడైంది. రేవంత్ రెడ్డి ఓటమి కంటే, ఆయన మెజారిటీని భారీగా తగ్గించడం పైనే వ్యూహరచన చేయాలని అధికారపక్షం ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది.
ఏం చేస్తే రేవంత్ రెడ్డికి వచ్చే మెజారిటీ భారీగా తగ్గించవచ్చు అన్నదానిపై లెక్కలు కడుతోందని మరో సమాచారం.రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నప్పుడు తన ఎమ్మెల్యే పదవికి కూడా ‘రాజీనామా’ సమర్పించారు. కొడంగల్ కు ఉప ఎన్నిక తప్పదని అందరూ భావించారు. అధికారపక్షంతో పాటు రేవంత్ రెడ్డి కూడా అందుకు సిద్ధమయ్యారు.టీఆరెస్ పార్టీ ‘ట్రబుల్ షూటర్’ హరీశ్ రావును కొడంగల్ బాధ్యత ఇచ్చారు.
రేవంత్ ‘రాజీనామా’ లేఖను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పీకర్ మధుసూదనాచారికి పంపలేదు. ఉపఎన్నికల అంశం అక్కడితో ఆగిపోయింది. కొడంగల్ లో ఆపరేషన్ ఆకర్ష్ ను అధికారపక్షం ఉధృతం చేసింది.కొడంగ‌ల్ లో అదికారపార్టీ గెలుపు సాద్యాసాద్యాల‌పై మంత్రి హరీశ్ అద్య‌య‌నం చేశారు.రేవంత్ రెడ్డికి గట్టి మద్ధతుదారులుగా భావిస్తున్న చాలా మంది నాయకులకు నయానో భయానో టీఆర్ఎస్ వ‌ల‌వేసింది. ఈ పరిణామంతో రేవంత్ రెడ్డి పనైపోయిందని కొందరు అభిప్రాయపడ్డారు. రేవంత్ బలహీనపడిపోయారని, ఓటమి ఖాయమని టీఆరెస్ నాయకులు అంచనా వేశారు. ఆ దిశగా మీడియా లో ప్రచారం జరిగింది.కానీ ఎంత ప్రయత్నించినా రేవంత్ రెడ్డిని బలహీనపరచలేకపోయినట్టు తాజా సర్వేలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి రేవంత్ రెడ్డి బలాన్ని బాగా తగ్గించాలన్న లెక్కతో అధికార పక్షం పథక రచన చేసింది. గురునాథరెడ్డి వారసులను బరిలోకి దింపితే ఎలా ఉంటుందన్న కోణంలో ముందుగా ఆలోచించారు. అది ఫలితాలు ఇవ్వదన్న విషయం సర్వేలో స్పష్టమైంది. మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డినే టీఆర్ఎస్ తన అభ్యర్థిగా ఖరారు చేసింది.కొడంగ‌ల్ లో రేవంత్ రెడ్డిని ఓడించాల‌న్న‌ది అదికార పార్టీ ల‌క్ష్యం.
కొడంగల్ లో తన సోదరుడుకి సీటు ఇప్పించుకోవాలన్న కోరికతో టీఆర్ఎస్ ఇన్ ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డిని మంత్రి మహేందర్ రెడ్డి టార్గెట్ చేశారని చెబుతున్నారు.దీంతో గురునాథరెడ్డి తీవ్ర అసంతృప్తి కి గురయ్యారు. ఎన్నికల నాటికి తన పెత్తనం నడవదన్న ఉద్దేశంతో మహేందర్ రెడ్డి పావులు కదుపుతున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పక్షాన తనకు ఎదురులేకుండా ఉండాలంటే ముందుగా గురునాథ్ రెడ్డిని రాజకీయంగా బ‌ల‌హీన ప‌ర‌చాల‌ని మహేందర్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గురునాథ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు వెనుక మంత్రి మహేందర్ రెడ్డి ఉన్నట్టు తెలిసింది. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని, ఆయనను ఓడించడం లేదా మెజారిటీని బాగా తగ్గించాలన్న కసితో సీఎం కేసీఆర్ ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. తెలంగాణ‌లో కొడంగల్ నియోజ‌క వ‌ర్గంలో గెలుపే ల‌క్ష్యంగా అదికార పార్టీ పావులు క‌దుపుతున్న‌ది.