కేసీఆర్ కర్ణాటక పర్యటన కుదింపు.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఒకే వేదికను పంచుకోవడం కేసీఆర్ కు ఇష్టం లేదు.అందువల్ల కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరు కావడం లేదు.కాంగ్రెస్, బీజేపీయే తర ఫెడరల్ ఫ్రంట్ కు రూపకల్పన చేసిన కేసీఆర్ బెంగళూరులో కాంగ్రెస్ నాయకులతో కలిసి సి.ఎం.కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడం వివాదాస్పద మవుతుందని కేసీఆర్ అభిప్రాయపడుతన్నట్టు తెలుస్తోంది. బీజేపీ ఎడ్యురప్ప సి.ఎం.గా బల పరీక్ష ఎదుర్కునే ముందు జరిగిన నాటకీయ పరిణామాలలో కాంగ్రెస్, జె.డీ. ఎస్.ఎం.ఎల్.ఏ.లకు హైదరాబాద్ లో ఆశ్రయం ఇవ్వడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక పాత్ర పోషించారు. ఒకవైపు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ మరోవైపు ఆ పార్టీ కర్ణాటక శాసనసభ్యులకు ‘షెల్టర్’ కల్పించడంపై తెలంగాణ బీజేపీ దుమ్మెత్తి పోస్తున్నది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తో పాటుగా కర్ణాటక సి.ఎం.కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి పాల్గొంటే మరిన్ని విమర్శలకు గురి కావచ్చునని కేసీఆర్ భావిస్తున్నారు.

“కర్ణాటక ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్న హెచ్.డి. కుమార స్వామిని అభినందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సాయంత్రం బెంగళూరు వెళ్తున్నారు. బుధవారం అత్యవసర సమావేశాలున్నందున మంగళవారం రాత్రికే సిఎం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు” అని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.