కేసీఆర్ కు వ్యతిరేకంగా నిరుద్యోగుల’ ప్రతిజ్ఞ’.

మహబూబ్ నగర్:
తెలంగాణ నిరుద్యోగులు టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు. నిరుద్యోగులు ఒక ప్రతిజ్ఞ పూనుకున్నారు. కెసిఆర్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో టీఆర్ఎస్ పాలనపై అసంతృప్తిగా ఉన్న నిరుద్యోగులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రానున్న ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటు వేయకూడదని ప్రతిజ్ఞ చేశారు. అంతేకాదు వారి కుటుంబసభ్యులు, స్నేహితులు, తెలిసిన వారికీ కూడా టీఆర్ఎస్ కి ఓటు వేయకూడదని ప్రచారం చేయాలంటూ ప్రతిజ్ఞ పూనుకున్నారు.
నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం మొదలయ్యింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన నీళ్లు మనకొస్తాయని, మన నిధులు మనకొస్తాయని , మన ఉద్యోగాలు మనకొస్తాయని తెలంగాణ ఉద్యమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆనాటి నిరుద్యోగులు, యూనివర్సిటీ విద్యార్థులు. ఈ ఉద్యమంలో ఎంతోమంది విద్యార్థులు తమ ప్రాణాలు కూడా అర్పించారు, జైలు పాలయ్యారు. అమరవీరులైన కుటుంబాలను ఆదుకుంటానని కెసిఆర్ ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసాడు. ఒక లక్ష ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పాడు. తెలంగాణ యువకులందరికి రాష్ట్రం ఏర్పడ్డాక లక్ష ఉద్యోగాలు ఇస్తానన్నాడు. కానీ ఈ వాగ్దానాలన్నీ ఒట్టి మాటలయ్యాయి. నిరుద్యోగుల ఆశలు అడియాశలయ్యాయి.
దీంతో ఆగ్రహానికి గురైన నిరుద్యోగులంతా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నెగ్గకూడదని నిర్ణయించుకున్నారు. గులాబీ పార్టీకి ఓటు వేయకూడదంటూ ప్రతిజ్ఞ పూని, అంతటా ప్రచారం ప్రారంభించారు.