కేసీఆర్ కు 36 సీట్లే; సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి

జగిత్యాల;

కేసీఆర్‌ ప్రజల్లో నమ్మకం కోల్పోయినందున కనీసం 36సీట్లు కూడా ఆ పార్టీ గెలవడం కష్టమని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పొత్తుకు కారణం కేసీఆర్ పాలనేనన్నారు. ఒకప్పడు ఈ రెండు పార్టీలతో టిఆర్‌ఎస్ పొత్తు పెట్టుకోలేదా అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆనాడు టిడిపి ఇచ్చిన లేఖతోనే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఆరంభం అయ్యిందని చెప్పారు. టిడిపి ప్రధాన కార్యాలయం అమరావతిలో కాదు, హైదరాబాద్‌లోనే ఉందని జీవన్‌రెడ్డి కెసిఆర్‌కు గుర్తు చేశారు. కెసిఆర్‌ది నియంతృత్వ రాచరిక పాలన అనీ, సెంటిమెంట్ బలంగా ఉన్న సమయంలోనే 63 సీట్లు టిఆర్‌ఎస్ పార్టీ గెలిచిందని, ఇప్పుడు నాలుగేళ్ల పాలనను ప్రజలు గమనించారని తెలిపారు. ఐదేళ్లు ఉండాల్సిన ప్రభుత్వం నాలుగేళ్లకే పాలన చేతకాక ప్రభుత్వాన్ని రద్దు చేసుకుందని అన్నారు. ఎంఐఎం అభ్యర్థులను కూడా తానే గెలిపించానని కేసీఆర్ చెప్పుకుంటాడని ఎద్దేవా చేశారు. ఒక పార్టీ అధ్యక్షునిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి భాషవాడడం సరైంది కాదనీ, కెసిఆర్ ముందు తన భాషను మార్చుకోవాలని హితవు పలికారు.