కేసీఆర్ తెలంగాణకు శ్రీరామరక్ష: – హరీశ్‌రావు.

హైదరాబాద్:

కేసీఆర్ మాత్రమే తెలంగాణకు శ్రీరామరక్ష అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు సమక్షంలో బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణతో పాటు పలువురు నేతలు టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ..‘‘జాతీయ పార్టీలు అవకాశవాద పార్టీలు. ఏడు మండలాలను ఆంధ్రాలో కలపడంలో బీజేపీది కీలక పాత్ర. బయ్యారం ఉక్కు కర్మాగారం విషయంలో బీజేపీ ఏం చేసిందో చెప్పాలి?. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇచ్చారా?. మధ్యప్రదేశ్‌లో రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర బీజేపీది. బీజేపీ జాతీయ నేతలు మమ్మల్ని విమర్శిస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు.ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానన్న రాహుల్ గాంధీ.. తెలంగాణకు ఏమిస్తారో స్పష్టం చేయాలి. తెలంగాణకు వస్తున్న రాహుల్ గాంధీ పరిశ్రమలకు రాయితీలు ఇస్తారో లేదో స్పష్టం చేసి రావాలి. కాంగ్రెస్-టీడీపీ పొత్తు తెలంగాణ పాలిట గుదిబండ. మహా కూటమిని చిత్తు చిత్తుగా ఓడించాలి. కేంద్రపదవులను గడ్డిపోచలా త్యాగం చేసిన ఘనత కేసీఆర్‌ది. తెలుగుదేశం పక్కా ఆంధ్ర పార్టీ. టీఆర్ఎస్ తెలంగాణ ఇంటి పార్టీ అని అన్నారు.