కేసీఆర్ ను బొంద పెట్టాలి. – ఉత్తమ్ గర్జన.

హైదరాబాద్:

కేసీఆర్ ను బొంద పెట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లేదంటే సమాజం మనల్ని క్షమించదన్నారు. ప్రజలు కేసీఆర్ కు అధికారమిస్తే తాము కూడా ప్రజల తీర్పును గౌరవించామని తెలిపారు. మన పైసలతో 500 కోట్ల ఖరీదైన భవింతిని కేసీఆర్ లక్ష స్క్వేర్ ఫీట్లలో కట్టుకున్నాడని విమర్శించారు.కేసీఆర్ బట్టేబాజి మాటలు మాట్లాడుతున్నాడని ఉత్తం ఆరోపించారు.

కేసీఆర్ ముందస్తు ఎలక్షన్లకు వెళ్ళి తన గొయ్యి తానే తవ్వుకున్నాడని అన్నారు.లక్షల ఓట్లు తొలగించారని,అందరి ఓట్లు సరిచేసుకోవాలని కోరారు.అక్టోబర్ 2 న ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుందని, నవంబర్ 1 న ఎలక్షన్లు జరిగే అవకాశం ఉందన్నారు.నెరేళ్ల లాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే కేసీఆర్ పాలనకు ముగింపు పలకాలని ఆయన కోరారు.
ఖమ్మం లో రైతులకు బేడీలు వేసిన ఘనుడు కేసీఆర్ అని టీపీసీసీ అధ్యక్షుడు మండిపడ్డారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు.కాంగ్రెస్ పార్టీ అందరికి సంక్షేమాన్ని కల్పించే విధంగా పనిచేస్తుందని చెప్పారు.అభయహస్తం పునరుద్దరిస్తామని హామీ ఇచ్చారు.మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని తెలిపారు.బిసి, మైనారిటీల అభివృద్ధి కి కాంగ్రెస్ పెద్దపీట వేస్తుందన్నారు.

చేవెళ్ల కు చెందిన భీమ్ భారత్ ను కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నట్టు ప్రకటించారు దళిత, గిరిజన వారికి కాంగ్రెస్ మేలు చేస్తుందన్న నమ్మకం తోనే పార్టీలో చేరారని తెలిపారు.జగజ్జీవంరాం కుమార్తె మీరాకుమార్ ద్వారా తనకు భీమ్ భారత్ పరిచయం అని చెప్పారు.దళితుల మీద కేసీఆర్ కుటుంబం నేరుగా దాడి చేస్తున్నట్టు ఆయన ఆరోపించారు.పాకిస్థాన్, చైనా బోర్డర్ లలో ఓ సైనికుడిగా పనిచేసానని,ఇప్పుడు రాష్ట్రం కోసం, పార్టీ కోసం ఒక సైనికుడిలా పనిచేస్తున్నానని ఉత్తమ్ తెలియజేశారు.తన జీవితంలో చాలా మంది ముఖ్యమంత్రులను చూసానని కానీ కేసీఆర్ లాంటి నియంత ముఖ్యమంత్రి ని ఇప్పటివరకు చూడలేదన్నారు.కేసీఆర్ క్యాబినెట్లో కనీసం ఒక్క దళిత మంత్రి కూడా లేడన్నారు.రాష్ట్రంలో ఇసుక మాఫియా కేసీఆర్ కుటుంబ సభ్యుల కనుసన్నల్లో నడుస్తుందని ఆరోపించారు.ఇసుక అక్రమ రవాణా సమయంలో ఒక గిరిజనుడిని లారీ కింద తొక్కించి చంపేశారని ఆయన ఆరోపించారు.

ఇది స్వయానా సిరిసిల్లలో కేటీఆర్ కనుసన్నల్లో జరిగిందన్నారు.నిరసన తెలియజేసిన గిరిజనులని అక్రమంగా అరెస్టు చేయించి థర్డ్ డిగ్రీ ఇప్పించారన్నారు.బట్టలు విప్పి కరెంట్ షాక్ ఇప్పించారని తెలిపారు.వారికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి వైద్యులే భయపడినట్టు ఉత్తమ్ చెప్పారు.మీరాకుమార్ ఢిల్లీ నుంచి పరామర్శకు వచ్చారని, వారిని చూసి కంటతడి పెట్టారని టీపీసీసీ చీఫ్ గుర్తు చేశారు.ఇదేమిటని ప్రశ్నించిన మహిళలపై వ్యభిచారకేసులను పెడతామని పోలీసులు బెదిరించారని ఆరోపించారు.ఇంత జరిగినా పోలీసులపై కానీ , మంత్రి పై కానీ ఒక కేసు కూడా నమోదు కాలేదన్నారు.మాల, మాదిగలు కేసీఆర్ ను నిలదీయాలని పిలుపునిచ్చారు.దళితుడను ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదని కేసీఆర్ ను ప్రశ్నించాలని కోరారు.రాష్ట్రంలో అర్హత ఉన్న దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్న హామీని కూడా నెరవేర్చలేదన్నారు.డబుల్ బెడ్రూం ఇళ్ళ పరిస్థితి కూడా అంతేనని ఆయన విమర్శించారు.