‘కేసీఆర్ పై కేసు నమోదు చేయాలి’ – టిపిసిసి వర్కింగ్ అధ్యక్షుడు రేవంత్.

హైదరాబాద్;

హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యల ఆధారంగా కేసీఆర్ పై కేసు నమోదు చేయాలని టిపిసిసి వర్కింగ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికల కమిషన్ ను డిమాండ్ చేశారు. ఎల్బీనగర్ లో పోటి చేస్తే 10కోట్ల రూపాయలు ఇస్తామని కేసీఆర్ చెప్పినట్టుగా బహిరంగంగా హోమ మంత్రి వ్యాఖ్యానించారని రేవంత్ శనివారం ఈ.సి కి పిర్యాదు చేశారు. ఇది లంచం ఇవ్వచూపిన దాని కిందకు వస్తుందని రేవంత్ అన్నారు. ఈ అంశాన్ని సుమోటోగా తీసుకోవాలని కోరానని, లేదా తన పిర్యాదు మేరకు కేసు నమోదు చేయాలని ఈ.సీ.ని కోరినట్టు తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఒక అభ్యర్థి కి 28 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు చేయాలని, 10 కోట్ల రూపాయలు ఎలా ఖర్చు చేస్తారని రేవంత్ ప్రశ్నించారు. తన భద్రత గురించి ఫిర్యాదు చేసానని రేవంత్ తెలిపారు.రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి గతంలో నాగార్జున సాగర్ లో జరిగిన టి ఆర్ ఎస్ పార్టీ శిక్షణ కార్యక్రమాల లో పాల్గొన్నారని ఆయన ఆరోపించారు.కాబట్టి ఆయన పై నమ్మకం లేదని ఈ.సి.కి తెలిపినట్టు చెప్పారు. తనను ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ చేస్తానని నిండు సభలో కేసీఆర్ హెచ్చరించారని ఈ.సి. కి రేవంత్ తెలిపారు. ఇటీవల కాలంలో మంత్రులు జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి, బాల్క సుమన్ లు తనను భౌతికంగా అంతమొందిస్తామని హెచ్చరించినట్టు రేవంత్ గుర్తు చేశారు. తనకు కేంద్ర సెక్యురిటీ సంస్థల ద్వారా రక్షణ కల్పించాలని టిపిసిసి వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు కోరారు.